భయం భయంగా..

ABN , First Publish Date - 2022-06-19T17:40:37+05:30 IST

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లు కనిపించినా.. రెండోరోజు స్టేషన్‌ మొత్తాన్ని స్పెషల్‌ ఫోర్స్‌ పోలీసులు అధీనంలోకి

భయం భయంగా..

వివిధ ప్రాంతాల నుంచి అదనపు బలగాలు

తనిఖీల తర్వాతే లోపలికి..

35 శాతం ప్రయాణికుల రాకపోకలు

స్పెషల్‌ ఫోర్స్‌ గుప్పెట్లో సికింద్రాబాద్‌


సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లు కనిపించినా.. రెండోరోజు స్టేషన్‌ మొత్తాన్ని స్పెషల్‌ ఫోర్స్‌ పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. ఆర్‌పీఎఫ్‌, జీఆర్‌పీ ఆధ్వర్యంలో  భారీ బందోబస్తు నిర్వహించారు. స్టేషన్‌లోకి వచ్చిపోయేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.  మరోపక్క రైల్వేస్టేషన్‌లో ఆందోళనకారుల చేతిలో ధ్వంసమైన పరికరాలకు మరమ్మతులు చేస్తున్నారు.  శనివారం వివిధ మార్గాల్లో రైళ్లు నడిపించారు. లింగంపల్లి-నాంపల్లి మార్గంలో ఎంఎంటీఎస్‌ రైలు నడిచింది. మరోపక్క శుక్రవారం జరిగిన విధ్వంసంపై సివిల్‌, రైల్వే పోలీసులు సమన్వయంతో విచారణ ముమ్మరం చేశారు. 


హైదరాబాద్‌ సిటీ: ‘అగ్నిపథ్‌’ ఆందోళన నేపథ్యంలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో భద్రతను మరింత పెంచారు. ఈ మేరకు సికింద్రాబాద్‌ జోన్‌ పరిధిలోని ఆర్‌పీఎఫ్‌, జీఆర్‌పీ శాఖలకు చెందిన ఏసీపీలు, సీఐలు, ఎస్సైలతోపాటు దాదాపు వందమంది పోలీసులు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నంబర్‌ 1, 10పై బందోబస్తు చేపడుతున్నారు. రైలు నుంచి దిగుతున్న, ఎక్కుతున్న అనుమానితులను విచారిస్తున్నారు. స్టేషన్‌ లోపలికి వస్తున్న వారి లగేజీ బ్యాగులను, టికెట్లను పరిశీలిస్తూ నిఘాను పెంచారు.


సికింద్రాబాద్‌, అడ్డగుట్ట, బర్కత్‌పుర.. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను శనివారం స్పెషల్‌ ఫోర్స్‌ పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఉదయాన్నే అన్ని ప్లాట్‌ఫాంలలో విస్తృతంగా తనిఖీలు చేశారు. చాలా మంది భయం భయంగానే రైల్వేస్టేషన్‌కు వచ్చారు. శనివారం వివిధ మార్గాల్లో నడిచిన రైళ్లలో 35 శాతం మంది ప్రయాణించినట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. కాగా, ఆందోళన నేపథ్యంలో దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు రైల్వేస్టేషన్‌ ఎదురుగా, పరిసర ప్రాంతాల్లోని లాడ్జీల్లో తలదాచుకున్నారు. శనివారం విజయవాడ, విశాఖపట్నం, నాందేడ్‌, మహారాష్ట్ర, బెంగళూరు మార్గాల్లో వెళ్లే రైళ్లలో ప్రయాణికుల రద్దీ కనిపించింది. ఆందోళనకారుల చేతిలో ధ్వంసమైన సీసీ కెమెరాలు, ఫ్యాన్‌లు, ట్యూబ్‌లైట్లు, ఇతర విద్యుత్‌ పరికరాలకు సిబ్బందితో మరమ్మతులు చేస్తున్నారు. కొత్త ఫ్యాన్‌లను బిగిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో స్టేషన్‌లో విద్యుత్‌ మరమ్మతులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. 


ఆందోళనకారుల మాటున అల్లరి మూకలు..

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఆర్మీ అభ్యర్థులు చేపట్టిన ఆందోళన నేపథ్యంలో వివిధ రైళ్ల నుంచి దిగిన కొందరు అల్లరి మూకలు సైతం విధ్వంసం సృష్టించినట్లు పోలీసు అధికారులు గుర్తించారు. స్టేషన్‌లో అప్పటికే ఉన్న దానాపూర్‌, హౌరా, అజంతా, రాజ్‌కోట్‌, శబరి రైళ్లలోని యువకులు ఆందోళనకారుల వెంట నడిచి ప్రయాణికుల వస్తువులను దోచుకెళ్లినట్లు కనుగొన్నారు. సీసీ కెమెరాల ద్వారా దాడులకు పాల్పడింది ఎవరనేది తెలుసుకుంటున్నారు.


సందడిగా చర్లపల్లి..

పలు రైళ్లను చర్లపల్లి రైల్వే స్టేషన్‌ వద్దే నియంత్రిస్తుండడంతో రెండు రోజులుగా సందడి నెలకొంది. రీషెడ్యూల్‌ కారణంగా కొన్ని రైళ్లు ఆలస్యంగా బయలు దేరినట్లు స్టేషన్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఎన్‌.హరీష్‌ తెలిపారు. ఇక్కడినుంచి ప్రయాణికులను సికింద్రాబాద్‌తోపాటు వివిధ ప్రాంతాలకు తరలించేందుకు చంగిచర్ల, కుషాయిగూడ డిపో నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-06-19T17:40:37+05:30 IST