Secunderabad Railway station అల్లర్ల కేసు సిట్‌కు బదిలీ

ABN , First Publish Date - 2022-06-20T22:20:49+05:30 IST

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ (Secunderabad Railway station) అల్లర్ల కేసును రైల్వే పోలీసులు సిట్‌కు బదిలీ చేశారు.

Secunderabad Railway station అల్లర్ల కేసు సిట్‌కు బదిలీ

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ (Secunderabad Railway station) అల్లర్ల కేసును రైల్వే పోలీసులు సిట్‌కు బదిలీ చేశారు. ఈ అల్లర్లలో 16 ప్రైవేట్‌ కోచింగ్ సెంటర్ల పాత్ర ఉందని పోలీసులు తేల్చారు. హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరులోని పలు కోచింగ్‌ సెంటర్లపై పోలీసుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విధ్వంసం వెనక ప్రైవేట్‌ డిఫెన్స్ అకాడమీ (Private Defense Academy)ల పాత్ర ఉన్నట్లు పోలీసులు (Police) గుర్తించారు. ఇప్పటికే సాయి డిఫెన్స్ అకాడమీ ఛైర్మన్ ఆవుల సుబ్బారావు (Subbarao) పై పలు ఆరోపణలు వచ్చాయి. ఆయనను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కేసు నమోదు చేయలేదు. కాగా ఏపీ పోలీసుల అదుపులో ఉన్న సుబ్బారావును.. తెలంగాణ పోలీసులు (Telangana police) ఎందుకు ప్రశ్నించలేదని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడులకు పాల్పడినవారు సాయి అకాడమీకి చెందినవారిగా గుర్తించారు. వాట్సాప్‌ చాటింగ్‌, గ్రూప్స్, కాల్ రికార్డింగ్స్‌లో.. సుబ్బారావు పాత్రపై ఆధారాలున్నా ఎందుకు వదిలేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ఆందోళన చేసిన కొంతమంది యువకులపై పోలీసులు కేసులు పెట్టి జైలుకి పంపించారు. ఆవుల సుబ్బారావు విషయంలో తెలుగు రాష్ట్రాల పోలీసుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ పోలీసులు ఇప్పటివరకు సంప్రదించలేదని ఏపీ పోలీసులు చెబుతున్నారు. అయితే సుబ్బారావు పాత్రపై దర్యాప్తు చేస్తున్నామని తెలంగాణ పోలీసులు అంటున్నారు. సుబ్బారావు విషయంలో రెండు రాష్ట్రాల పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


మరోవైపు అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతమయ్యే ప్రమాదముందనే కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో.. తెలంగాణ పోలీసు శాఖ అప్రమత్తమైంది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టింది. ప్రైవేట్‌ డిఫెన్స్‌ అకాడమీల నిర్వాహకులు అభ్యర్థులను రెచ్చగొట్టడమే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ విధ్వంసానికి కారణమని దర్యాప్తులో తేలిన విషయం తెలిసిందే. వాట్సాప్‌ గ్రూప్‌ల్లో రెచ్చగొడుతూ సందేశాలు పెట్టడం వల్లే భారీ సంఖ్యలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు అభ్యర్థులు వచ్చారు. ఇదే వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేటకు చెందిన సాయి డిఫెన్స్‌ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావును పోలీసులు అరెస్టు చేశారు.

Updated Date - 2022-06-20T22:20:49+05:30 IST