అగ్నికి ఆహుతైన సికింద్రాబాద్‌ క్లబ్‌

ABN , First Publish Date - 2022-01-17T08:42:36+05:30 IST

చారిత్రక సికింద్రాబాద్‌ క్లబ్‌ అగ్నికి ఆహుతైంది. హెరిటేజ్‌ కట్టడమైన ఈ భవనంలో జరిగిన అగ్నిప్రమాదంతో.. ఇంటీరియర్‌, ఫర్నిచర్‌, మద్యం, ఇతర సామగ్రి.. ఇలా మొత్తం బుగ్గిపాలైంది. భవనం

అగ్నికి ఆహుతైన సికింద్రాబాద్‌ క్లబ్‌

 చారిత్రక కట్టడంలో భారీ అగ్నిప్రమాదం

 వర్షం కురుస్తున్నా.. ఎగిసిపడ్డ మంటలు

 ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూటే కారణం?

 రూ. 20 కోట్ల దాకా నష్టం అంచనాలు!

 రూ. 4 కోట్ల నష్టమంటున్న అధికారులు

హైదరాబాద్‌ సిటీ/అడ్డగుట్ట/మారేడ్‌పల్లి/బోయినపల్లి/రాంగోపాల్‌పేట్‌/బౌద్ధనగర్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): చారిత్రక సికింద్రాబాద్‌ క్లబ్‌ అగ్నికి ఆహుతైంది. హెరిటేజ్‌ కట్టడమైన ఈ భవనంలో జరిగిన అగ్నిప్రమాదంతో.. ఇంటీరియర్‌, ఫర్నిచర్‌, మద్యం, ఇతర సామగ్రి.. ఇలా మొత్తం బుగ్గిపాలైంది. భవనం శకలాలు రాతికట్టడాల అస్థిపంజరంగా మిగిలిపోయి కనిపిస్తున్నాయి. పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు, స్థానికుల కథనం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి.. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రాంతంలో 1878లో సుమారు 22 ఎకరాల్లో సైన్యం కోసం క్లబ్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 20వేల చదరపు అడుగుల స్థలంలో టేకు ఇంటీరియర్‌తో ఫైవ్‌స్టార్‌ హోటల్‌ను తలపించేలా ఈ క్లబ్‌ కొనసాగుతోంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో కాల్‌నైట్‌ బార్‌ బంగ్లా కిచెన్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు క్రమంగా క్లబ్‌ భవనమంతా విస్తరించాయి. మంటలు ఎగిసిపడుతుండడాన్ని గమనించిన ఇద్దరు కానిస్టేబుళ్లు.. వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఆదివారం తెల్లవారుజామున క్లబ్‌లో కరెంటు పోయిందని, దాంతో జనరేటర్‌ ఆన్‌ అయ్యిందని అధికారులు చెబుతున్నారు. తిరిగి కరెంటు వచ్చిన సమయంలో ఏసీ/డీసీ షిఫ్టింగ్‌లో చోటుచేసుకున్న లోపాలతో మంటలు వ్యాపించి ఉంటాయని పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది అనుమానిస్తున్నారు.


ఇతర కారణాలు కూడా ఉండొచ్చని క్లబ్‌ అధ్యక్షుడు రఘురామ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనలో క్లబ్‌లో ఉన్న రూ. 2 కోట్ల విలువైన మద్యం పూర్తిగా దగ్ధమైంది. నష్టం అంచనా రూ. 20 కోట్లుగా ఉంటుందని క్లబ్‌ యాజమాన్యం చెబుతుండగా.. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ. 4 కోట్ల నష్టం వాటిల్లిందని, ఈ మొత్తం ఇంకా పెరగవచ్చని సికింద్రాబాద్‌ అగ్నిమాపకశాఖాధికారి మోహన్‌రావు తెలిపారు. మద్యానికి తోడు.. క్లబ్‌లో ఇంటీరియర్‌, అంతర్గత మెట్లు, చివరకు రెయిలింగ్‌ కూడా టేకు, ఇతర కలపతో చేసినవి కావడం వల్ల మంటలు వేగంగా వ్యాప్తి చెందాయని వివరించారు. ఓవైపు జోరున వర్షం కురుస్తున్నా.. అగ్నికీలలు ఎగిసిపడడానికి ఇదే కారణమని అధికారులు తెలిపారు. 14 మీటర్ల ఎత్తున్న భవనంలో అంతర్గత మెట్లు పూర్తిగా కాలిపోవడంతో.. పైఅంతస్తుల్లోని మంటలను ఆర్పడం ఇబ్బందికరంగా మారిందని, కిటికీల్లోంచి నీటిని చిమ్మి అదుపులోకి తెచ్చామని వివరించారు. ఫైరింజన్లతో పాటు సికింద్రాబాద్‌ నుంచి వాటర్‌ బౌజర్‌ను, కంటోన్మెంట్‌ నుంచి మల్టీ పర్పజ్‌ టెండర్‌ను రప్పించి, మంటలను ఆర్పేందుకు మూడు గంటల పాటు శ్రమించాల్సి వచ్చిందన్నారు. ఫోమ్‌ స్ర్పేతో మంటలు అదుపులోకి వచ్చాయని చెప్పారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని, క్లబ్‌ను మూసివేయడం వల్ల పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు.


5 వేల మంది శాశ్వత, 10 వేల మంది తాత్కాలిక సభ్యులున్న ఈ క్లబ్‌లో 400 మంది సిబ్బంది రేయింబవళ్లు పనిచేస్తుంటారని పేర్కొన్నారు. ఈ క్లబ్‌ స్థలంలో కొనసాగుతున్న పెట్రోల్‌ బంక్‌ వరకు మంటలు వ్యాపించలేదని, లేకుంటే.. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండేదని చెప్పారు. కాగా.. ప్రమాదం తీవ్రతను దాచేందుకు క్లబ్‌ యాజమాన్యం ప్రయత్నిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమిటీ సభ్యుల మధ్య కొన్ని రోజులుగా వివాదాలున్నాయని తెలుస్తోంది. మద్యం సేవించడానికి హెరిటేజ్‌ బంగ్లా నిత్యం తెరిచి ఉంటుందని సిబ్బంది చెబుతున్నారు. అయితే.. దర్యాప్తులో అన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు వివరించారు.

Updated Date - 2022-01-17T08:42:36+05:30 IST