అపార్థాల సుడిలో లౌకిక వాదం..!

ABN , First Publish Date - 2022-05-20T10:16:16+05:30 IST

భారత్ నుంచి వేరుపడిన భూభాగాలతో ముస్లింలకు మాతృభూమిగా పాకిస్థాన్ (పవిత్రభూమి) ఏర్పాటయింది.

అపార్థాల సుడిలో లౌకిక వాదం..!

భారత్ నుంచి వేరుపడిన భూభాగాలతో ముస్లింలకు మాతృభూమిగా పాకిస్థాన్ (పవిత్రభూమి) ఏర్పాటయింది. అలా ఏర్పాటయిన పాకిస్థాన్‌లో నివశిస్తున్న ముస్లిమేతరులను పలు విధాల పారద్రోలడం ద్వారా ఆ దేశం ముస్లింల కోసమే ఉనికిలోకి వచ్చిందన్న వాస్తవాన్ని మరింతగా ధ్రువపరిచారు. అయితే భారత్ సమస్త భారతీయుల– అసోం నుంచి రాజస్థాన్ దాకా, కేరళ నుంచి కశ్మీర్ దాకా నివశిస్తున్న హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు–కు మాతృభూమిగా కొనసాగుతోంది. అనేక మతాలు, జాతులతో కూడిన ఒక ఆధునిక, ప్రజాస్వామిక, లౌకిక దేశంగా వర్థిల్లేందుకు ఆరాటపడుతోంది. నరేంద్ర మోదీ పాలన ప్రారంభమయ్యేంతవరకు హిందువులకు భారత్, ముస్లింలకు పాకిస్థాన్ అని దేశ విభజనను ఒక సరళ దృక్పథంతో చూచిన హిందూ జాతీయ వాదులు సైతం చాల వరకు ఆధునిక, ప్రజాస్వామిక, లౌకిక భారత్‌ను ఒక వాస్తవంగా అంగీకరించారు. అయితే ఆ దృక్పథం ఇప్పుడు ఇంకెంత మాత్రం లేదు.


ముస్లిం వేర్పాటు వాదం, దాని అత్యున్నత దశ అయిన దేశ విభజన ఒక మహా వైరుధ్యంతో పరిసమాప్తి అయింది. పాకిస్థాన్‌ను ప్రగాఢంగా కోరుకున్న వారికి దాని ప్రయోజనం పెద్దగా దక్కలేదు. ఆ దేశంలో వారు మొహజిర్లుగా పరిగణన అవుతున్నారు. మరింత కఠోర వాస్తవమేమిటంటే అనేక కోట్ల మంది ముస్లింలు భారత్‌లోనే ఉండిపోయారు. ఉత్తరప్రదేశ్, బిహార్‌లలోని కలహశీల, మతోన్మాద ముస్లిం కులీన శ్రేణుల వారు ముస్లిం వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించారు. పాకిస్థాన్ ఉద్యమానికి పూర్తి మద్దతు నిచ్చారు. చాలా కాలం పాటు వేర్పాటువాద రాజకీయాలతో పెద్దగా ప్రమేయం లేని పంజాబీ, సింధీ, వాయవ్య సరిహద్దు రాష్ట్రాల ప్రజలు యూపీ, బిహారీ ముస్లింలీగ్ నాయకులు రగుల్కొల్పిన మతోన్మాద ప్రభావంలో పూర్తిగా పడిపోయారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఇతర హిందూ మతోన్మాదులు 1925 సెప్టెంబర్ 27 నుంచి దీని కోసం సిద్ధమయ్యారు.


వివిధ కారణాలతో భారత్‌లోనే ఉండిపోయిన ముస్లిం వేర్పాటు వాదులు శీఘ్రగతిన కాంగ్రెస్ ‘లౌకికవాదుల’తో కలిసిపోయారు. కాల క్రమేణా జాతీయవాద ముస్లింల స్థానంలో మతతత్వవాదులు ప్రాధాన్యం పొందారు. ముస్లిం సామాజిక వర్గం చాలా త్వరితంగానే ఒక ఓటు బ్యాంకుగా పరిణమించింది. చట్ట సభలలో ప్రాతినిధ్యం పొందేందుకు, ఇతర స్వార్థ ప్రయోజనాలు సాధించుకునేందుకు మాజీ వేర్పాటువాదులు ఆ ముస్లిం ఓటు బ్యాంకును బాగా ఉపయోగించుకున్నారు. ఆ వేర్పాటువాదులే ముస్లింలను జాతిలో అంతర్భాగంగా ఉన్న ఒక జాతిగా చెప్పడం ప్రారంభించారు కాంగ్రెస్‌లోని హిందూ మతోన్మాద శక్తులు –వీరు అధిక సంఖ్యాకులే– లౌకికవాదాన్ని ఒక ఆధునికీకరణ ప్రక్రియగా కాకుండా కేవలం సహన భావంగా నిర్వచించడం ప్రారంభించారు.


లౌకికవాదమంటే ఇతర మతాల పట్ల సహన భావాన్ని చూపడం మాత్రమే కాదు, ఆధునిక విలువలు, వివేచనలో నమ్మకాన్ని కలిగి ఉండడమే లౌకికవాదం. అయితే మనం దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నాం. దాని దుష్ఫలితాలను ఇప్పుడు మనం బాగా చవి చూస్తున్నాం.


షాబానో కేసులో సుప్రీంకోర్టు తీర్పు పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రతిస్పందించిన తీరును చూడండి. ఉమ్మడి పౌరస్మృతిని శాసనంగా చేయడంలో చొరవ చూపేందుకు కాంగ్రెస్ నిరాకరించిందని ఆ ప్రతిస్పందనను బట్టి మనకు అర్థమయింది. రాజీవ్ గాంధీ ప్రోత్సాహంతో అరిఫ్ మొహమ్మద్ ఖాన్ లోక్‌సభలో సుప్రీంకోర్టు తీర్పుకు మద్దతు తెలుపుతూ ప్రసంగించినప్పుడు సంప్రదాయ, నయా వేర్పాటువాద ముస్లింలు మినహా అందరూ పెద్ద పెట్టున హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. ముస్లిం ఎంపీల వైఖరి రాజీవ్ గాంధీకి కలవరపాటు కలిగించింది. విలక్షణ ‘లౌకికవాద’ రాజకీయవాదులు అందరూ అలానే వ్యవహరిస్తారు మరి. కాంగ్రెస్‌కు ముస్లిం ఓటు బ్యాంకు తగ్గిపోగలదని ఆయన ఆందోళన చెందారు. కాంగ్రెస్‌లోని జియా–ఉల్–అన్సారీ లాంటి వాళ్లను ఆయన ఉసిగొల్పారు. సుప్రీంకోర్టు తీర్పుకు ఆక్షేపణలు చెప్పడం ప్రారంభమయింది. దేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్న నయా వేర్పాటువాద ముస్లింలు అందరూ ఆ విమర్శలను మరింత తీవ్రతరం చేశారు. అరిఫ్ ఎక్కడకు వెళ్లినా ఆయనపై భౌతిక దాడికి ప్రయత్నాలు జరిగేవి. ఆయనను ఎంతగా పరిహసించేవారు, దూషించేవారు. ఇదంతా ఒక పథకం ప్రకారమే జరిగేది. ఈ పరిణామాలకు విసుగు చెందిన అరిఫ్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిష్క్రమించారు. ‘నకిలీ లౌకికవాదం’ అనే పదం మన రాజకీయ పరిభాషలోకి ప్రవేశించింది.


అరిఫ్ కష్టాలు, సమస్యలు అంతటితో ముగియలేదు. విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్ నేతృత్వంలోని జన్ మోర్చాలో పరిస్థితులు మెరుగ్గా ఏమీ లేవు. అలహాబాద్‌లో వీపీ సింగ్ తరఫున ప్రచారం చేసేందుకు సయద్ షహబుద్దీన్ ఒక షరతు విధించారు. వీపీ సింగ్ సన్నిహిత సహచరుడు, జన్ మోర్చా సహ సంస్థాపకుడు అయిన అరిఫ్ అలహాబాద్‌లో ప్రచారం చేస్తే తాను ప్రచారం చేయబోనని షహబుద్దీన్ ఖండితంగా చెప్పాడు. అరిఫ్ హఠాత్తుగా అలహాబాద్‌లో నిషిద్ధుడు అయిపోయారు. వ్యవస్థ మార్పునకు వీపీ సింగ్ చేస్తున్న పోరాటంలో సయద్ షహబుద్దీన్ చేరాడు!


అయోధ్యలో బాబ్రీ మసీద్‌ వివాదం తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలో వివేకశీలురు హిందువులు–ముస్లింల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. ప్రముఖ పాత్రికేయుడు కుల్దీప్ నయ్యర్ తరచు వివిధ డ్రాయింగ్‌లను చూపుతూ ముస్లింలు ఎక్కడ నమాజ్ చేయాలో, రామ్ లల్లాకు హిందువులు ఎక్కడ పూజలు నిర్వహించాలో సూచించేవారు. ఆ స్థానంలో ఒక ఆసుపత్రి లేదా ఒక ఉన్నత విద్యా సంస్థ లేదా ఒక ఉద్యానవనం ఇత్యాది ‘లౌకిక’ కట్టడాలను నిర్మించాలని మరికొంత మంది విజ్ఞులు సూచించారు. అయితే భారతీయ పురావస్తు శాఖ రక్షణలో ఉన్న కట్టడమని, దాని ఉనికికి ఎటువంటి మార్పు తలపెట్టకూడదని ఎవరూ సూచించలేదు. అటువంటి సూచనే నిజమైన లౌకికవాద వైఖరి అయ్యేది.


ఆగ్రహావేశాలు తీవ్రమయ్యాయి. ప్రజలను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం పెరిగిపోయింది. అసలు శ్రీరామచంద్రుడు చారిత్రకంగా ఉన్న వ్యక్తే అని హిందువులు నిరూపించాలని సయద్ షహబుద్దీన్ (ఈయన ఒకప్పుడు అటల్ బిహారీ వాజపేయి ఆశ్రితుడు) డిమాండ్ చేశాడు. హిందువులు రాముని చారిత్రక అస్తిత్వాన్ని నిరూపిస్తే ఆ స్థలంలో హిందూ ఆలయాన్ని నిర్మించేందుకు అనుమతిస్తామని షహబుద్దీన్ అన్నాడు.


1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూల్చివేశారు. మరి ఆ స్థానంలో ఆ తరువాత నిర్మాణమయ్యేది ఏమిటి? అయోధ్యలోని ఆ స్థలం హిందువులకు చాలా ముఖ్యమైనది ముస్లింలకు అక్కడి భవనం పవిత్రమైనది. అయినప్పటికీ ఆ స్థలం తమకు దక్కాలని ముస్లింలు పట్టుబట్టారు. మసీదే కూల్చివేత చట్టవిరుద్ధమని భావిస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ బద్ధమైన తీర్పుకంటే మరింత విజ్ఞతాయుతమైన తీర్పును వెలువరించింది.


హిందూ–ముస్లిం సంబంధాలలో సామరస్యానికి దోహదం చేయని మరో అంశం కశ్మీర్ సమస్య. ఈ సమస్యపై ముస్లిం నాయకులలో ఒక స్పష్టమైన జాతీయ వైఖరి కొరవడింది. ఈ దేశంలో ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉన్న ఏకైక రాష్ట్రం కశ్మీర్. మరి ఆ రాష్ట్ర ముస్లింలు తాము భిన్న మతానికి చెందిన వారమనే కారణంతో దేశం నుంచి విడిపోదలుచుకున్నప్పుడు మిగతా భారతదేశంలోని ముస్లింలు ఆ విషయమై తమ వైఖరి ఏమిటో తప్పక తెలియజేయవలసి ఉంది. కశ్మీర్ భవిష్యత్తు వారి భవిష్యత్తుపై కీలక ప్రభావం చూపడం ఖాయం. అది అనివార్యం కూడా. కశ్మీర్ కనుక భారత్ నుంచి వేరుపడడం జరిగితే హిందువులకు భారత్, ముస్లింలకు పాకిస్థాన్ అన్న పాత భావన మళ్లీ ప్రజలపై అమిత ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. భావోద్వేగాల ప్రాధాన్యాన్ని విస్మరించడం తగదు. అయినా ముస్లింనాయకులు ఈ వాస్తవాన్ని ఉపేక్షించి ‘బాంబే’ సినిమా మొదలైన అల్ప విషయాలకు ప్రాధాన్యమిస్తున్నారు. జాతీయ ప్రాధాన్యమున్న విషయాలను విస్మరించడం సమంజసమేనా? కశ్మీర్ లోయలో కశ్మీరీ పండిట్ల ఊచకోత గురించిన ‘కశ్మీర్ ఫైల్స్’ అన్న సినిమాను ప్రశంసించి, ప్రోత్సహించడం ద్వారా ప్రధాని మోదీ కశ్మీర్ సమస్య పరిష్కారంపై తన శ్రద్ధాసక్తులు ఏమిటో తెలియజేశారు.


ఒకరి సంవేదనలు, ఆకాంక్షల పట్ల మరొకరి సున్నిత వైఖరి ఒక పరస్పర వ్యవహారం. ఇది సమున్నతంగా ఉండాలంటే చరిత్ర పట్ల ఉమ్మడి దృక్పథం తప్పనిసరి. ఉమ్మడి జాతీయతకు అత్యావశ్యకాలలో ముఖ్యమైనది చరిత్ర పట్ల ఉమ్మడి అవగాహన అని డాక్టర్ అంబేడ్కర్ స్పష్టం చేశారు. ఈ ఉమ్మడి దృక్పథం ఎలా అభివృద్ధి చెందుతుంది? అమీర్ ఖుస్రో, తాన్‌సేన్, బిస్మిల్లాఖాన్, భీమ్‌సేన్ జోషి, తాజ్‌మహల్, మీనాక్షీ ఆలయం, అక్బర్, శివాజీ, కృష్ణదేవరాయలు, మహమ్మద్ ఖులీ కుతుబ్‌షాలను సమానంగా గౌరవించినప్పుడే అది జరుగుతుంది. వీరందరినీ తమకు గర్వకారణంగా ప్రతి భారతీయుడూ భావించితీరాలి. తమ ఉమ్మడి వారసత్వంగా వారిని ఆదరించాలి. అయితే ఇది సంభవమయ్యేందుకు అనుమతిస్తారా? రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తన శతాబ్ది ఉత్సవాలను అయోధ్య, కాశీ, మథుర విజయాలతో జరుపుకోవడానికి ఎదురుచూస్తున్నది.


మోహన్ గురుస్వామి

చైర్మన్, సెంటర్ ఫర్ పాలసీ ఆల్టర్నేటివ్స్

Updated Date - 2022-05-20T10:16:16+05:30 IST