ఆసిఫాబాద్‌ జిల్లాలో హరితహారానికి రంగం సిద్ధం

ABN , First Publish Date - 2022-05-08T04:23:28+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏడో విడత హరితహారం కార్యక్రమానికి అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది.

ఆసిఫాబాద్‌ జిల్లాలో హరితహారానికి రంగం సిద్ధం
హరితహారం కోసం సిద్ధం చేస్తున్న నర్సరీ

- నర్సరీల్లో విత్తనాలు విత్తే ప్రక్రియ పూర్తి
- 83 శాతం మొలకెత్తిన మొక్కలు
- ఈ ఏడాది లక్ష్యం 52.68 లక్షలు

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏడో విడత హరితహారం కార్యక్రమానికి అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. మరో నెల రోజుల్లో వర్షాకాల సీజన్‌ ప్రారంభం కానుండటంతో ఈ మేరకు కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ హరితహారంపై దృష్టిసారించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. అంతేకాదు మొక్కలను సిద్ధం చేయాలని డీఆర్డీఏ, అటవీశాఖలను ఆదేశించారు. ఇందులో అటవీ క్షేత్రాలు మొదలుకొని ఎవెన్యూ ప్లాంటేషన్‌ వరకు దాదాపు 52.68 లక్షల మొక్కలు నాటేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. జిల్లాలోని 71నర్సరీల్లో హరితహారం కోసం 71.01లక్షల మొక్కలను పెంచుతున్నారు. ఈ నర్సరీల్లో పెంచిన మొక్కలను జిల్లాలోని 15మండలాల పరిధిలో ఉన్న మొత్తం 335గ్రామాల్లో జూన్‌ రెండో వారం నుంచి ప్రారంభ మయ్యే హరితహారంలో భాగంగా నాటాలని నిర్ణయించారు. గతేడాది ఇదే తరహాలో లక్ష్యాలు నిర్ణయించి మొక్కలు  నాటారు. ఈ సారి లోటుపాట్లు ఉత్పన్నం కాకుండా పక్కా కార్యాచరణతో శాఖల వారీగా లక్ష్యాలను నిర్ణయించి హరిత హారాన్ని వందశాతం పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేయా లని నిర్ణయించినట్టు జిల్లా గ్రామీణాభివృద్ధి, అటవీశాఖల సిబ్బంది చెబుతున్నారు. కోట్ల సంఖ్యలో మొక్కలను పెంచినట్లు చెబుతున్నారు. ఇందులో సింహభాగం డీఆర్డీఏ ఏర్పాటు చేసిన నర్సరీల ద్వారా మొక్కలు పెంచుతుండగా ఆ తర్వాత అత్యధికంగా అటవీశాఖ 10లక్షల మొక్కలను సిద్ధం చేస్తోంది. అటు సింగరేణి, ఐటీడీఏ కూడా నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను సిద్ధం చేస్తున్నాయి. అయితే ఆ రెండు శాఖలు పెంచే మొక్కల సంఖ్య నామమాత్రమే చెప్ప వచ్చు. ఇందులోనూ సింగరేణి కేవలం సంస్థ పరిధిలో ఉన్న గ్రామాల్లో మాత్రమే హరితహారంలో భాగంగా మొక్కల పంపిణీ చేస్తోంది. ఇందులోనూ ఎక్కువగా పండ్లు, పూల మొక్కలే అధికంగా ఉంటున్నట్టు చెబుతున్నారు.
శాఖల వారీగా
డీఆర్డీఏ ద్వారా అటవీ ప్రాంతంలో 52.68లక్షల  మొక్కలు ఇందులో అటవీశాఖ 10.37లక్షలు, డీఆర్డీఏ 34లక్షలు, వ్యవ సాయశాఖ 50వేలు, ఎక్సైజ్‌శాఖ 30వేలు, సింగరేణి రెండు లక్షలు, ఉద్యానవన శాఖ 20వేలు, పోలీసుశాఖ పది వేలు,  మున్సిపల్‌, పట్టణాభివృద్ధి సంస్థ 3లక్షలు, ఇరిగేషన్‌ 15వేలు, రెవిన్యూ పదివేలు, ఫిషరీస్‌ ఐదువేలు, విద్యాశాఖ ఐదువేలు, మాద్యమిక విద్యాశాఖ ఐదువేలు, ఆర్‌అండ్‌బి ఐదువేలు, పంచాయతీరాజ్‌ శాఖ ఐదువేలు, మెడికల్‌ ఐదువేలు, పౌర సరఫరాల శాఖ పదివేలు, సహకారశాఖ 30వేలు, ట్రాన్స్‌కో 4,300, ఉపాధికల్పన శాఖ 1000, లీగల్‌ మెట్రాలజీ 1000, క్రీడలు, యువజన సర్వీసులు 2వేలు, స్త్రీ శిశుసంక్షేమ శాఖ ఐదువేలు, భూగర్భ గనుల శాఖ 1500, దేవాదాయ శాఖ 1000, సాంఘిక సంక్షేమశాఖ మూడువేలు, ఐటీడీఏ ఐదు వేలు, బీసీవెల్ఫేర్‌ రెండువేలు, మైనార్టీ సంక్షేమం రెండువేలు, మార్కెటింగ్‌ 1000, ఆర్‌డబ్ల్యూఎస్‌ 2500, ఆర్టీసీ ఐదువేల, ఇతరులు 10వేల మొక్కల చొప్పున లక్ష్యంగా నిర్ణయించారు.
గత అనుభవాల నుంచి గుణపాఠం నేర్చేనా
కోట్లాది రూపాయలు వెచ్చించి పెద్ద ఎత్తున చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటుతున్నారు కానీ వాటి సంరక్షణ కరువవుతోంది. ఎవెన్యూ ప్లాంటేషన్‌లో ఫల సాయాన్ని ఇచ్చే మొక్కలు మినహా ఇతర మొక్కలు బతికి బట్ట కట్టలేదంటే అతిశయోక్తి కాదు. మూడేళ్లుగా జిల్లాలో అందుబాటులో ఉన్న స్థలానికి మించి మొక్కలు నాటు తున్నా మళ్లీమళ్లీ లక్షలాది మొక్కల టార్గెట్‌ నిర్ణయించడం వల్ల అధికార యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని మొక్కుబడి తంతుగా ముగిస్తోందన్న ఆరోపణలున్నాయి.

Read more