హిజాబ్ సెగ‌.. రాళ్లు రువ్వడం, లాఠీచార్జీలు, 144 సెక్షన్

ABN , First Publish Date - 2022-02-08T20:58:55+05:30 IST

హిజాబ్ సెగ కర్ణాటకలో హింసాత్మక ఘటనలకు దారితీస్తోంది. శివమొగ్గలోని బాపూజీనగర్ ప్రభుత్వ ప్రీ-యూనివర్శిటీ కాలాజీ పరిసర ప్రాంతాల్లో ..

హిజాబ్ సెగ‌.. రాళ్లు రువ్వడం, లాఠీచార్జీలు, 144 సెక్షన్

బెంగళూరు: హిజాబ్ సెగ కర్ణాటకలో హింసాత్మక ఘటనలకు దారితీసింది. శివమొగ్గలోని బాపూజీనగర్ ప్రభుత్వ ప్రీ-యూనివర్శిటీ కాలాజీ పరిసర ప్రాంతాల్లో నిరసన తెలుపుతున్న విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు మంగళవారంనాడు లాఠీచార్జి జరిపారు. పలువురు విద్యార్థులు జూనియర్ కాలేజీ సమీపంలో ప్రైవేటు బస్సులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడినట్టు తెలుస్తోది. దీంతో కర్ణాటకలోని శివమొగ్గలో సెక్షన్ 144 విధించారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా అధికార యంత్రాంగం అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపింది.




ఘర్షణ ఇలా మొదలైంది..

విద్యార్థి గ్రూపుల మధ్య రాళ్లు రువ్వుడు ఘటనపై పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, హిజాబ్ ధరించిన విద్యార్థులు, కాషాయం శాలువాలతో వచ్చిన విద్యార్థుల మధ్య మాటామాటా పెరిగింది. దీంతో ఒక గ్రూపుపై మరో గ్రూపు రాళ్లు రువ్వింది. ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. పోలీస్ సూపరింటెండ్ లక్ష్మీప్రసాద్, ఇతర సీనియర్ పోలీసు అధికారులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఉడిపి ఎంజీఎం కాలేజీ పరిసరాల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం నిరవధికంగా కాలేజీకి సెలవులను ప్రకటించింది. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపు చేస్తున్నారు.

Updated Date - 2022-02-08T20:58:55+05:30 IST