రహస్యంగా కరోనా టెస్టులు? రూ. 4000 నుంచి 5000 దాకా వసూలు

ABN , First Publish Date - 2020-07-09T22:10:05+05:30 IST

ఒకవైపు కరోనాతో ప్రజలు భయాందోళనకు గురౌతుంటే, మరో వైపు కరోనా పేరుతో పరీక్షలు నిర్వహిస్తూ వేలకు వేలు డబ్బులు గుంజుతున్న

రహస్యంగా కరోనా టెస్టులు? రూ. 4000 నుంచి 5000 దాకా వసూలు

గద్వాల జిల్లా కేంద్రంలో ప్రైవేట్‌ ల్యాబుల నిర్వాకం

తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటాం : డీఎంహెచ్‌ఓ


గద్వాల (ఆంధ్రజ్యోతి) : ఒకవైపు కరోనాతో ప్రజలు భయాందోళనకు గురౌతుంటే, మరో వైపు కరోనా పేరుతో పరీక్షలు నిర్వహిస్తూ వేలకు వేలు డబ్బులు గుంజుతున్న వైనం జిల్లా కేంద్రంలో వెలుగుచూసింది. గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందిలో కొందరు సింగిల్‌గా, మరికొందరు పార్ట్‌నర్‌షిప్‌ పద్ధతిలో ల్యాబ్‌లను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిబందనల ప్రకారం ప్రవేట్‌ హాస్పిటళ్లు, ల్యాబ్‌లలో కరోనా పరీక్షలు నిర్వహించకూడదు. కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిర్వహిస్తున్న రెండు ల్యాబ్‌లలో నిబంధనలకు విర్ధుంగా కరోనా పరీక్షలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆ ల్యాబ్‌లో పట్టణానికి చెందిన ఓ యువకుడికి కరోనా పరీక్షలు చేసిన విషయం బయటకు పొక్కింది. కరోనా నిర్ధారణ పరీక్ష చేసేందుకు ఒక్కో వ్యక్తి నుంచి నాలుగు రూపాయల నుంచి, ఐదు వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఇలా ప్రతిరోజు దాదాపు 20 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా పరీక్షలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. 


పరీక్షలు నిర్వహించడం నేరం

ప్రభుత్వ ఆసుపత్రిలోని కొవిడ్‌ ల్యాబ్‌లో మినహా ప్రవేట్‌ ఆసుపత్రులు, ల్యాబ్‌లలో కరోనా పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరం. ప్రైవేట్‌ ల్యాబ్‌లలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనిఖీలు నిర్వహించి ఆధారాలుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రవేట్‌ ల్యాబ్‌లలో ఎవరూ కరోనా పరీక్షలు చేయించు కోవద్దు, భయాందోళనకు గురికావద్దు.

- డాక్టర్‌ భీంనాయక్‌, జిల్లా  వైద్య ఆరోగ్య శాఖాధికారి, గద్వాల.

Updated Date - 2020-07-09T22:10:05+05:30 IST