సచివాలయాలకు నిధులేవి ?

ABN , First Publish Date - 2021-12-09T06:09:36+05:30 IST

గ్రామ సచివాలయాలకు ప్రత్యేక నిధులు మంజూరుకాకపోవడంతో ఏ ఒక్క స్టేషనరీ కొనుగోలు చేయాలన్నా సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సచివాలయాలకు నిధులేవి ?
వెంకటాపురం సచివాలయం

 స్టేషనరీ కొనుగోలుకు అవస్థలు 

పంచాయతీ అకౌంట్‌ నుంచి ఖర్చుచేస్తే ఆడిట్‌ అభ్యంతరాలు

 సొంత సొమ్ము వదిలించుకుంటున్న సిబ్బంది


ఏలూరు రూరల్‌, డిసెంబరు 8 :గ్రామ సచివాలయాలకు ప్రత్యేక నిధులు మంజూరుకాకపోవడంతో ఏ ఒక్క స్టేషనరీ కొనుగోలు చేయాలన్నా సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సచివాలయ వ్యవస్థ ప్రారంభం తరువాత మండల కేంద్రం ద్వారా కుర్చీలు, టేబుళ్ళు, ప్రింటర్‌, రికార్డుల నిర్వహణకు సంబంధించిన పుస్తకాలు తదితర వాటిని మాత్రమే పంపించారు. స్టేషనరీ కొనుగోలుకు సంబంధించి రూపాయి మంజూరు చేయని పరిస్థితి నెలకొంది. ఏలూరు నగరంలో 49 సచివాలయాలు ఉండగా డీడీవోగా ఉన్న గ్రామ కార్యదర్శులే పంచాయతీలకు మంజూరైన  అభివృద్ధి నిధుల నుంచి కొంతమేర ఖర్చు చేస్తుంటారు. ఒక్కో పంచాయతీ నుంచి ప్రతీ నెలలో మూడు నుంచి ఐదు వేల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నిధులు పంచాయ తీల నుంచి తీసి ఉపయోగిస్తే  ఏడాదికి ఒకసారి జరిగే ఆడిట్‌లో అధికారులు అభ్యంతరం చెబుతున్నారు. 2020–21 సంవత్సరానికి సంబంధి ఆడిట్‌లో  పంచాయతీ నిధుల నుంచి గ్రామ సచివాలయ నిర్వహణకు నిధులు ఉపయోగించకూడదని స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాల్లో స్టేషనరీ కోసం సిబ్బంది అత్యవసర పరిస్థితిలో  సొంత సొమ్ము ఖర్చు చేస్తున్నారు.

పర్యవేక్షణ ఫుల్‌.. నిధులు నిల్‌..

మండల స్థాయి అధికారి నుంచి జిల్లా కలెక్టర్‌ వరకు గ్రామ సచివాలయాల పనితీరుపై నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సేవల గురించి ఆరా తీసే అధికారులు ఇక్కడ ఉన్న కనీస సమస్యలను పరిష్కరించడంలేదు. సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మాట వరుసకైన అడిగిన సందర్భాలు లేవన్నది ఉద్యోగుల ఆవేదన. సమయానికి సిబ్బంది రాలేదని, సేవలు సక్రమంగా అందించడంలేదని ఉన్నతాధికారులు సచివాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం తరచూ చూస్తున్నాం. ఇదే సమయంలో నిధుల సమస్యపై దృష్టి సారించాల్సి ఉంది.

Updated Date - 2021-12-09T06:09:36+05:30 IST