భారం భరించలేం

ABN , First Publish Date - 2021-04-08T05:16:37+05:30 IST

పరిషత్‌ ఎన్నికల ఖర్చు తమకు భారంగా మారిందని పంచాయతీ కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు అప్పుచేసి పెట్టినా, బిల్లులు రాలేదని వాపోతున్నారు. ఈ తరుణంలో పరిషత్‌ ఎన్నికల ఖర్చు భరించలేమని కొంతమంది చేతు

భారం భరించలేం




 ఎన్నికల ఖర్చుపై చేతులెత్తేసిన కార్యదర్శులు

పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాట్లకు వెనుకంజ

(ఇచ్ఛాపురం రూరల్‌)

పరిషత్‌ ఎన్నికల ఖర్చు తమకు భారంగా మారిందని పంచాయతీ కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు అప్పుచేసి పెట్టినా, బిల్లులు రాలేదని వాపోతున్నారు. ఈ తరుణంలో పరిషత్‌ ఎన్నికల ఖర్చు భరించలేమని కొంతమంది చేతులేత్తేస్తున్నారు. ఎన్నికల సమయంలో కొత్తగా వచ్చిన ఎంపీడీవోలు ఎంతకాలం ఆ సీటులో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. వారు వెళ్లిపోతే తాము బిల్లులు ఎలా చేసుకోగలమని కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పరిషత్‌ ఎన్నికల ఖర్చు విషయంపై అధికారుల్లో గందరగోళం నెలకొంది. పోలింగ్‌, ఓట్ల లెక్కింపు ఏర్పాట్లకు అవసరమైన ఆర్థికభారంపై తర్జనభర్జన జరుగుతోంది. కార్యదర్శులే ఎన్నికల ఖర్చు భరించాలని ఎంపీడీవోలు చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికలకు పెట్టిన ఖర్చులకే ఇప్పటి వరకు దిక్కులేదని, మళ్లీ పరిషత్‌ ఎన్నికలకు ఖర్చులు భరించలేమని కార్యదర్శులు వాపోతున్నారు. గతంలో జిల్లాలో 1164 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఒక్కో కార్యదర్శి సుమారు రూ.30 వేలు వరకు ఖర్చు చేశారు. జిల్లా వ్యాప్తంగా రూ.మూడు కోట్ల వరకు ఖర్చు చేశారు. ఆ డబ్బులే ఇంతవరకు రాకపోవడంతో గురువారం నిర్వహించనున్న పోలింగ్‌ ఏర్పాట్లు, సిబ్బంది భోజనాలు మా వల్ల కాదంటూ కార్యదర్శులు వెనుకంజ వేస్తున్నారు. వాస్తవానికి ఎంపీడీవోలు భరించాల్సిన ఈ ఖర్చులను తమపై నెట్టేస్తున్నారంటూ కొంతమంది కార్యదర్శులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల ఖర్చులు తమకు తడిసిమోపెడు కాగా.. ప్రభుత్వం జమ చేసిన నిధుల్లో ఎంపీడీవోలు మొక్కుబడిగా తమకు బిల్లులు చెల్లించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీడీవోలు ఎప్పుడు ఏ మండలానికి బదిలీ అవుతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ అప్పు చేసి ఖర్చు పెట్టినా.. తమకు బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని కార్యదర్శులు వాపోతున్నారు. 


పంచాయతీ ఎన్నికల అప్పే తీరలేదు 

  పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కేంద్రాల నిర్వహణకు అప్పుచేసి పెట్టాం. ఆ డబ్బులే ఇంత వరకు అందలేదు. ప్రస్తుతం అప్పులు దొరికే అవకాశం లేదు. ఈ పెట్టుబడులు కార్యదర్శులకు భార మవుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు ఆలోచించాలి.

- బీవీ రమణ, కార్యదర్శుల సంఘం, జిల్లా అధ్యక్షుడు 


ఎంపీడీవోల ఖాతాలో జమ చేశాం 

 పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కార్యదర్శులు చేసిన ఖర్చులను ఎంపీడీవోల ఖాతాల్లో రెండు రోజుల కిందటే జమ చేశాం. వాటిని పంచాయతీల వారీగా, ఎంత ఖర్చు చేశారో వివరాలు తీసుకొని పంపిణీ చేస్తాం. పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి నిధులు మంజూరు చేస్తాం.

 రవి కుమార్‌, జిల్లా పంచాయతీ అధికారి.

Updated Date - 2021-04-08T05:16:37+05:30 IST