దాడి అమానుషం

ABN , First Publish Date - 2022-06-28T05:24:04+05:30 IST

దాడి అమానుషం

దాడి అమానుషం
నందిగాం: నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు

- నల్లబ్యాడ్జీలతో సచివాలయ ఉద్యోగుల నిరసన 

- తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌

- జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, ర్యాలీలు


నందిగాం మండలం కవిటిఅగ్రహారం సచివాలయం డిజిటల్‌ అసిస్టెంట్‌ దివ్యాంగుడైన కరుకోల వాసుదేవరావుపై ఆ గ్రామ సర్పంచ్‌ భర్త, వైసీపీ నాయకుడు బొమ్మాళి గున్నయ్య దాడి అమానుషమని పలువురు ఖండించారు. ఈ మేరకు  జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి.  సోమవారం ఉద్యోగ, కార్మిక సంఘాలతోపాటు రాజకీయ పార్టీలు ఆందోళనలు, ర్యాలీలు చేశాయి. తక్షణమే గున్నయ్యను అరెస్టు చేయాలని  ఆయా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.


- మెళియాపుట్టి: నందిగాం మండలం కొత్తఅగ్రహరం సచివాలయం డిజిటల్‌ అసిస్టెంట్‌పై దాడిచేసిన సర్పంచ్‌ భర్తపై చర్యలు తీసుకోవాలని సోమవారం సచివాలయ ఉద్యోగులతో పాటు కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ మేరకు ర్యాలీ నిర్వహించి మూడు రోడ్లు కూడలిలో మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో ఏవో అనురాధ, సంఘ నాయకులు శివాజీ అప్పారావు, డేవిడ్‌, యుగంధర్‌ తదితరులు పాల్గొన్నారు.


- పాతపట్నం: సచివాలయ డిజిట ల్‌ అసిస్టెంట్‌పై దాడికిపాల్పడిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని స్థానిక సచివా లయ ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శుల సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో సోమవారం ర్యాలీ, నిరసన ప్రదర్శన చేపట్టారు. నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ పరిపాలానాధికారి కె.అప్పలనాయుడు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.


- నందిగాం: కవిటిఅగ్రహారం సచివాలయం డిజిటల్‌ అసిస్టెంట్‌ వాసుదేవరావుపై దాడికి నిరసనగా మండలంలోని సచివాలయాల సిబ్బంది నల్లబ్యాడ్జీలతో సోమవారం నిరసన తెలిపారు. రాష్ట్ర సంఘం పిలుపుమేరకు కార్యాలయాలు ఎదుట ఆందోళన చేపట్టారు. దాడిపై సమగ్ర విచారణ చేపట్టి బాధితుడికి న్యాయం అందించాలని డిమాండ్‌ చేశారు. 


- టెక్కలి రూరల్‌: గ్రామ సచివాలయ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరుతూ మండలంలోని వివిధ సచివాలయాలకు చెందిన ఉద్యోగులు సోమవారం సాయంత్రం టెక్కలి పోలీసులకు వినతిపత్రం అందజేశారు. నందిగాం మండలం కవిటి అగ్రహారంలో వైసీపీ నాయ కుడు ఉద్యోగిపై వీరంగం సృష్టించడమే కాకుండా సచివాలయ ఉద్యోగిపై దాడికి పా ల్పడడంతోపాటు మిగిలిన సిబ్బందిని హెచ్చరించడం దారుణమన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


- కవిటి: నందిగాం మండలం కవిటి అగ్రహారంలో సచివాలయ  డిజిటల్‌ అసిస్టెంట్‌  కరుకోల వాసువురావుపై దాడికి కవిటి మండల సచివాలయ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ మేరకు సోమవారం ఎంపీడీవో పి.సూర్యనారాయణ, తహసీల్దార్‌ కార్యాలయంలో డీటీ రామచంద్రరావుకు వినతిపత్రాలు అందజేశారు.


రక్షణ కల్పించాలని ఆర్డీవోకి వినతి

పలాసరూరల్‌: భౌతిక దాడుల నుంచి రక్షణ కల్పించాలని ఆర్డీవో సీతారామమూర్తికి సోమవారం ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు. నందిగాం మండలం కవిటిఅగ్రహారం సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కె.వాసుదేవరావుపై దాడి చేయడాన్ని నిరసిస్తూ ఆ సచివాలయం ఉద్యోగులంతా తమకు భద్రత కల్పించాలని ఆర్డీవోను వేడుకున్నారు. గత మూడు నెలలుగా భౌతికదాడులు, అసభ్య పదజాలంతో దూషించడం వంటి ఘటనలు జరుగుతున్నాయని వివరించారు.  


వైసీపీ నాయకుడిని అరెస్టు చేయాలి

టెక్కలి: నందిగాం మండలం కవిటి అగ్రహారం గ్రామ సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న దివ్యాంగ ఉద్యోగి కరుకోల వాసుదేవరావుపై దాడికి పాల్పడిన సర్పంచ్‌ భర్త, వైసీపీ నాయకుడు బొమ్మాళి గున్నయ్యను తక్షణమే అరెస్ట్‌ చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు ఆవుల వేణుగోపాల్‌ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. మద్యం మత్తులో గ్రామ సచివాలయానికి వచ్చి విధుల్లో ఉన్న ఉద్యోగిపై దాడి అమానుషం అన్నారు. తక్షణమే ఆ వ్యక్తిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. 


తక్షణమే అరెస్టు చేయండి: టీడీపీ

నందిగాం: కవిటిఅగ్రహారం గ్రామ సచివాలయం డిజిటల్‌ అసిస్టెంట్‌ కరుకోల వాసుదేవరావు (దివ్యాంగుడు) పై భౌతిక దాడికి పాల్పడిన ఆ గ్రామ సర్పంచ్‌ భర్త, వైసీపీ నాయ కులు బొమ్మాళి గున్నయ్యను తక్షణ మే అరెస్టు చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్‌ చేసింది. సోమవారం సచివాలయ ఉద్యోగిపై దాడిని నిరసి స్తూ నందిగాం పార్టీ కార్యాలయం నుంచి మండల పరిషత్‌ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కార్యాలయ పరిపాలనాధికారిణి ఆర్‌.సుధారాణికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు పి.అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ... దాడికి పాల్పడిన గున్నయ్యను అరెస్టు చేయడంతో పాటు బాధితుడు వాసుదేవరావు, ఎంపీ డీవో కె.ఫణీంద్రకుమార్‌కు క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. కవిటిఅగ్రహారంలో ప్రభుత్వ పథకాలు అనర్హులకే అందుతున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎం.బాలకృష్ణ, పి.చం ద్రశేఖరరావు, కె.ప్రసాదరావు, పి.ఉమా మహేశ్వరరావు, వి.లక్ష్మణరావు, ఎన్‌.నాగరాజు, డి.శివ, ఎం.సింహాచలం, టి.సింహాద్రినాయుడు, బి.బారికి, ఎస్‌.కూ ర్మినాయకులు, కె.తాతయ్య, పి.రవికుమార్‌, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే సీపీఎం నాయకులు ఎన్‌.షన్ముఖరావు పి.సాంబమూర్తి డిజిటల్‌ అసిస్టెంట్‌ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. సోమ వారం స్థానిక మండల కాంప్లెక్స్‌ ఆవరణలో వారు విలేఖరులతో మాట్లాడారు. విధుల్లో ఉన్న ఉద్యోగిపై దాడి చేయడం హేయ మైన చర్యని, దాడికి పాల్పడ్డ  గున్నయ్యను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-06-28T05:24:04+05:30 IST