సచివాలయ ఉద్యోగుల నిరసన

ABN , First Publish Date - 2022-01-11T06:52:23+05:30 IST

సచివాలయ ఉద్యోగులు జిల్లావ్యాప్తంగా విధులు బహిష్కరించి ధర్నాలకు దిగారు.

సచివాలయ ఉద్యోగుల నిరసన
వి.కోట ఎంపీడీవో కార్యాలయాన్ని దిగ్బంధించిన సచివాలయ ఉద్యోగులు

అధికారుల బెదిరింపులకు తలొగ్గి నిరసనలకు దూరంగా పలువురు సంఘ నాయకులు

ఖాతరు చేయకుండా నిరసనలో పాల్గొన్న ఉద్యోగులు

ఓటీఎస్‌ మేళానూ బహిష్కరించిన వైనం

హాజరుకాని వారి జాబితాను సిద్ధం చేయాలంటూ జిల్లా అధికారుల ఆదేశాలు


చిత్తూరు, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రొబేషన్‌లో ఉండీ ధర్నాలు చేయడం పెద్ద తప్పు. అందులోనూ ముందస్తుగా ప్రభుత్వం ప్రకటిస్తే, సోమవారం నిర్వహించిన ఓటీఎస్‌ మేళాను బహిష్కరించడం మరింత తప్పు. సచివాలయ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తున్నా.. నిరసన చేయడం తగదు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు సచివాలయ ఉద్యోగుల నుంచి లాగిన్‌ ఐడీ, పాస్‌ వర్డ్స్‌ తీసుకుని ఓటీఎస్‌ పేమెంట్స్‌ నమోదు చేయండి. ఓటీఎస్‌ మేళాకు సహకరించని సచివాలయ ఉద్యోగుల జాబితాను తయారుచేసి మాకు పంపండి’’ అని జిల్లా కేంద్రం నుంచి మండలస్థాయి అధికారులకు సోమవారం ఆదేశాలందాయి.దీంతో ‘సచివాలయ ఉద్యోగులు ధర్నాలో పాల్గొనకుండా చూడాలి’ అంటూ మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు..  ఆ సంఘ నేతలకు గట్టిగానే చెప్పారు. దీంతో జిల్లాలో చాలావరకు సచివాలయ ఉద్యోగ సంఘ నేతలు నిరసన కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అంతటితో ఆగకుండా నిరసన వ్యక్తం చేయొద్దంటూ వాట్సాప్‌ గ్రూపుల్లో మెసేజ్‌లు కూడా పెట్టారు.అయితే  సచివాలయ ఉద్యోగులు మాత్రం ఖాతరు చేయకుండా జిల్లావ్యాప్తంగా విధులు బహిష్కరించి ధర్నాలకు దిగారు.


బెదిరింపులను ఖాతరు చేయకుండా నిరసన

జిల్లాలోని 1275 సచివాలయాల్లో 11,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయాలంటూ వారంతా సోమవారం విధులను బహిష్కరించారు.అర్బన్‌ ప్రాంతాల్లో మున్సిపల్‌ కమిషనర్లకు,మండల కేంద్రాల్లో ఎంపీడీవోలకు, తహసీల్దార్లకు వినతి పత్రాలను అందజేశారు. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తమకు తక్షణం ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయడంతో పాటు పీఆర్సీని కూడా జనవరి నుంచి అమలు చేయాలని డిమాండు చేశారు. 


మధ్యాహ్నం నుంచి విధులకు హాజరు

ఓటీఎస్‌ వసూళ్లలో సచివాలయ ఉద్యోగులు కీలకం కాగా.. సోమవారం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ఓటీఎస్‌ మేళాను కూడా బహిష్కరించారు. దీంతో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్లు ఆగ్రహించినట్లు తెలిసింది. ఓటీఎస్‌ పేమెంట్స్‌ జనరేట్‌ అయ్యే లాగిన్‌ ఐటీ, పాస్‌వర్డ్స్‌ను సచివాలయ ఉద్యోగుల నుంచి ఎంపీడీవోలు, తహసీల్దార్లు తీసుకుని ఇతర ఉద్యోగులతో పనులు చేయించుకోవాల్సి వచ్చింది. కొన్ని మండలాల్లో వాటిని సచివాలయ ఉద్యోగులు మార్చేయడంతో జిల్లా కేంద్రం నుంచి కొత్త పాస్‌వర్డ్స్‌ తయారుచేయాల్సి వచ్చింది. ఓటీఎస్‌ మేళాకు సహకరించని సచివాలయ ఉద్యోగుల జాబితాను సిద్ధం చేసి పంపాలని మున్సిపల్‌ కమిషనర్లకు, తహసీల్దార్లకు, ఎంపీడీవోలకు ఓ జాయింట్‌ కలెక్టర్‌  సూచించారు. దీంతో కొందరు ఉద్యోగులు మధ్యాహ్నం 12.30 గంటలకు, చాలామంది 3 గంటలకు సచివాలయాలకు వెళ్లి బయోమెట్రిక్‌ వేశారు. ఉదయం ధర్నాలు చేసినా.. అధికారుల బెదిరింపులతో మధ్యాహ్నం తరువాత విధులకు హాజరుకావాల్సి వచ్చింది. 


ప్రొబేషన్‌ ప్రపోజల్స్‌ పంపండి: కలెక్టర్‌

చిత్తూరు కలెక్టరేట్‌, జనవరి 10: జిల్లావ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ప్రొబేషన్‌ కోసం అర్హత పొందిన వారి వివరాలను 24 గంటల్లోగా పంపాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ సంబంధిత అధికారులను  ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.తొలి విడతలో ఉద్యోగాల్లో చేరి అర్హత పొందిన వారి ప్రొబేషన్‌  వివరాలను సంబంధిత హెచ్‌వోడీ కార్యాలయాలకు, గ్రామ, వార్డు సచివాలయ శాఖకు పంపి వారికి అందినట్లు  నిర్థారించుకోవాలన్నారు.పంచాయతీ సెక్రటరీ, వీఆర్వో, ఏఎన్‌ఎం, పశు సంవర్థక, వ్యవసాయ, సెరికల్చర్‌, చైల్డ్‌ వెల్పేర్‌, ఇంజనీరింగ్‌, వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌, వార్డు ఎమినిటీస్‌, ఫిషరీస్‌, శానిటేషన్‌ ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీలు, ఎనర్జీ అసిస్టెంట్ల వివరాలు పూర్తి  చేయాలన్నారు.డీఆర్వో మురళి, డీపీవో దశరథరామిరెడ్డి, పంచాయతీ రాజ్‌ ఎస్‌ఈ అమరనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-11T06:52:23+05:30 IST