పంచాయతీలపై సచివాలయ భారం

ABN , First Publish Date - 2021-10-10T11:07:59+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మానస పుత్రికైన గ్రామ సచివాలయాల భారాన్ని పంచాయతీలపై నెట్టేశారు. నిధులు లేక గ్రామ పంచాయతీలు నీరసిస్తున్నాయి. కనీస మౌలిక వసతులు కల్పించలేని స్థితికి వెళ్లిపోయాయి.

పంచాయతీలపై సచివాలయ భారం
ఎగువ రామాపురంలోని గ్రామ సచివాలయం

నిర్వహణకు నెలకు రూ.6 వేల నుంచి 8 వేల పైమాటే 

నిధులు లేక నీరసిస్తున్న పంచాయతీలు 

అదనపు భారం మాపై మోపుతారా... సర్పంచ్‌ల ఆవేదన 

కడప, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మానస పుత్రికైన గ్రామ సచివాలయాల భారాన్ని పంచాయతీలపై నెట్టేశారు. నిధులు లేక గ్రామ పంచాయతీలు నీరసిస్తున్నాయి. కనీస మౌలిక వసతులు కల్పించలేని స్థితికి వెళ్లిపోయాయి. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ఇస్తామన్న నిధులు ఇవ్వలేదు. నిధులు లేకపోవడంతో పంచాయతీలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపధ్యంలో పంచాయతీలను ఆదుకోవాల్సి ప్రభుత్వం గ్రామ సచివాలయాల నిర్వహణ భారం కూడా పంచాయతీలపై నెట్టడాన్ని పలు సర్పంచ్‌లు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో జగన్‌ సర్కార్‌ సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. జనాభా ప్రాతిపదికన వీటిని ఏర్పాటు చేసింది. 633 గ్రామ సచివాలయాలు, 233 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసింది. 


సచివాలయం సరే నిర్వహణకు డబ్బులేవి...

ప్రభుత్వం ఆర్భాటంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. వాటి నిర్వహణకు అవసరమైన నిధులను ఇంతవరకు బడ్జెట్‌లో కేటాయించలేదు. సచివాలయాల నిర్వహణకు ఆయా సచివాలయాన్ని బట్టి స్టేషనరీ, కంప్యూటర్లు, ప్రింటర్లు, బయోమెట్రిక్‌ మిషన్‌ నిర్వహణ, ఇంటర్‌నెట్‌, కరెంట్‌, స్వీపర్‌, తాగునీటి ఏర్పాట్లు తదితర వాటికి రూ.6 వేల నుంచి 8 వేల రూపాయలు ఖర్చు అవుతున్నట్లు చెబుతున్నారు. వీటి నిర్వహణ ఖర్చును గ్రామ పంచాయతీ నిధుల నుంచే ఖర్చు చేస్తుండగా, మరికొన్ని చోట్ల పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో సచివాలయ సిబ్బందే తలా కొంత పోగేసుకొని సొంతంగా జేబు నుంచి ఖర్చు చేస్తున్నారు. సచివాలయాల ద్వారా 545 రకాల సేవలను అందిస్తున్నారు. ఒక్కో సేవను బట్టి రూ.35 నుంచి రూ.500 వరకు ఫీజు తీసుకుంటున్నారు. ఈ సొమ్మంతా ప్రభుత్వ ఖజానాలోకి వెళుతుంది. సచివాలయం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నప్పటికీ వాటి నిర్వహణకు నిధులు కేటాయించకపోవడం విమర్శలకు తావిస్తోంది. వార్డు సచివాలయాల నిర్వహణ ఖర్చు మున్సిపాలిటీలు భరిస్తున్నాయి. గ్రామ సచివాలయాల భారాన్ని పంచాయతీలు మోయలేకపోతున్నాయి.

Updated Date - 2021-10-10T11:07:59+05:30 IST