రహస్య సర్వే

ABN , First Publish Date - 2022-08-13T07:42:51+05:30 IST

గత కొన్నేళ్ల నుంచి రాజకీయ పౌరవీలతో పాటు ఆర్థిక పరమైన, పరిపాలన పరమైన ఇబ్బందులతో అటకెక్కిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ ప్రక్రియకు ఎట్టకేలకు మోక్షం లభించబోతోంది.

రహస్య సర్వే
నిర్మాణం పూర్తయిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు

జిల్లాలో డబుల్‌ బెడ్‌రూం పైరవీలకు అడ్డుకట్ట 

నేతల ఒత్తిళ్లకు బ్రేక్‌ 

అర్హులైన వారి కోసం పకడ్బందీ స్ర్కీనింగ్‌ 

దసరాలోగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ 

నేరుగా దరఖాస్తుదారుల వివరాల సేకరణ 

నిర్మల్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి) : గత కొన్నేళ్ల నుంచి రాజకీయ పౌరవీలతో పాటు ఆర్థిక పరమైన, పరిపాలన పరమైన ఇబ్బందులతో అటకెక్కిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ ప్రక్రియకు ఎట్టకేలకు మోక్షం లభించబోతోంది. ఇప్పటికే జిల్లా కేంద్రమైన నిర్మల్‌లో పూర్తయిన దాదాపు 1400 ఇళ్ల్లను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇళ్లులేని నిరుపేదలకు మాత్రమే డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ తీసుకున్న నిర్ణయంతో రాజకీయ పైరవీలకు ఇక అడ్డుకట్ట పడబోతోంది. ఇందులో భాగంగానే అధికారులు సీరియస్‌గా కసరత్తు మొదలుపెట్టారు.  ఇప్పటికే ఈ ఇళ్ల పంపిణీకి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక పలుసార్లు వాయిదా పడింది. అడుగడుగునా రాజకీయ ఒత్తిళ్లు పెరిగిపోవడంతో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల ఎంపికతో పాటు పంపిణీ వ్యవహారం ఇటు ప్రజా ప్రతినిధులకు అటు అధికారులకు తీవ్రమైన ఇబ్బందులు సృష్టించింది. మొత్తం జిల్లాలో 2450 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా.. మరో 2029 ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇందులో నుంచి ఒక్క నిర్మల్‌టౌన్‌లోనే 1460 ఇళ్లు పూర్తయ్యి రెండు..మూడేళ్లు కావస్తోంది. ఎలాగైనా వీటిని పంపిణీ చేయాలని అధికారులు సిద్ధమవుతున్నారు. రాబోయే దసరాపండుగ వరకు లబ్దిదారుల ఎంపికను పూర్తిచేసి ఎంపికైన వారికి ఆ ఇళ్లను అందజేయాలని నిర్ణయించారు. అయితే మొదటి నుంచి డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల్లపై ఆశలు పెట్టుకున్న స్థానిక మున్సిపల్‌ కౌన్సిలర్‌లకు షాక్‌ ఇచ్చే విధంగా జిల్లా కలెక్టర్‌ సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. తమ వద్ద ఉన్న దరఖాస్తులను ఇప్పటికే స్ర్కూటీని చేసిన కలెక్టర్‌ 5248 దరఖాస్తులు అర్హతగా ఉన్నవి గుర్తించారు. ఇందులో నుంచి మరోసారి రీ వేరిఫికేషన్‌ చేసి ఏళ్ల నుంచి ఇళ్లు లేకుండా అద్దె ఇళ్లల్లో గడుపుతున్న వారికి గుర్తించాలని నిర్ణయించారు. దీనికోసం గానూ జిల్లా కలెక్టర్‌ మున్సిపల్‌ కౌన్సిలర్లు, అధికార పార్టీ నేతల ప్రమేయం లేకుండా చేసేందుకు రెవెన్యూ, మున్సిపల్‌, కో ఆపరేటివ్‌ శాఖలకు సంబంధించిన సిబ్బందితో వార్డుల వారిగా టీంలను ఏర్పాటు చేశారు. ఈ టీంలు రహస్యంగా దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి సర్వే జరుపుతున్నారు. వీరు ఆకస్మాత్తుగా తమ వద్ద ఉన్న దరఖాస్తుదారుల ఫోన్‌నంబర్‌లకు ఫోన్‌ చేసి మొదట వివరాలను తెలుసుకుంటున్నారు. ఆ తరువాత నేరుగా దరఖాస్తుదారుల ఇంటికి వచ్చి ఇంటి వివరాలను ఆరా తీస్తున్నారు. సొంతఇల్లా లేక... కిరాయిఇల్లా... అనే అంశాన్ని తెలుసుకుంటున్నారు. సర్వే ఆధారంగా కౌన్సిలర్‌లతో గాని, ఇతర టీఆర్‌ఎస్‌ నాయకులను దగ్గరికి రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మూడుశాఖల సిబ్బంది సర్వేటీంలో ఉన్న ఈ ఇంటింటా రహస్య సర్వే పూర్తి కానుందని చెబుతున్నారు. సర్వేపూర్తి కాగానే అర్హులైన లబ్దిదారుల జాబితాను సిద్ధం చేసి ఈ జాబితా వివరాలను సైతం రహస్యంగా ఉంచాలని నిర్ణయించినట్లు సమాచారం. దసరాపండుగకు వారం రోజుల ముందుగా లబ్ధిదారులకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు తెలిసింది. 

పైరవీల అడ్డుకట్ట కోసమే

కాగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన నాటి నుంచి అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు, మరికొంతమంది ప్రజా ప్రతినిధులు, నాయకులు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను తమ అనుచరులకు ఇప్పించుకునేందు కోసం పెద్దఎత్తున పైరవీలు మొదలుపెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. రోజు రోజుకు ఒత్తిళ్లు పెరిగిపోవడంతో జిల్లా కలెక్టర్‌ ఈ రాజకీయ పైరవీలకు చెక్‌ పెట్టే దిశగా యాక్షన్‌ప్లాన్‌ రూపొందించారు. గతంలో వచ్చిన ఈ ఆరోపణలపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కూడా సీరియస్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో నిర్మల్‌టౌన్‌ పరిధిలోని నిర్మాణం పూర్తి చేసుకున్న 1460 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను అర్హులైన వారికే పంపిణీ చేయాలని నిర్ణయించారు. బంగల్‌పేట్‌లో 444 ఇళ్లు, నాగనాయిపేట్‌లో 1016 ఇళ్లను పంపిణీ చేయాలని భావిస్తున్నారు. మొత్తం ఇళ్లనిర్మాణం కోసం రూ.144 ఇప్పటి వరకు ఖర్చు చేయగా... మరో రూ.24 కోట్లను సంబంధిత కాంట్రాక్టర్‌లకు చెల్లించాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లల్లో మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు ఇటీవల ప్రభుత్వం రూ.7.70 కోట్లను కూడా మంజూరు చేయడంతో గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలపై ఆర్థికభారం తప్పింది. 

అర్హులైన వారికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు

రాబోయే దసరా పండుగలోగా పూర్తయిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను అర్హులైన వారికి అందజేస్తాం. ఇప్పటికే అర్హులైన వారికి ఎంపి క ప్రక్రియ కొనసాగుతోంది. ఇళ్లు లేని నిరుపేదలకు కేటాయింపుల్లో ప్రాధాన్యతనిస్తాం. దీని కోసం పకడ్భందీగా సర్వే చేపట్టాం. ఎలాంటి పైరవీలకు తావు లేకుండా అనర్హులకు ఎట్టి పరిస్థితుల్లోనూ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను కేటాయించలేదు. 

- ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ, కలెక్టర్‌

Updated Date - 2022-08-13T07:42:51+05:30 IST