అల్‌ఖైదా ఉగ్రవాది ఇంట్లో రహస్య గది

ABN , First Publish Date - 2020-09-21T13:36:47+05:30 IST

అల్ ఖైదా ఉగ్రవాది అబూ సుఫియాన్ ఇంట్లో రహస్య గదిని పశ్చిమబెంగాల్ పోలీసులు తాజాగా కనుగొన్నారు....

అల్‌ఖైదా ఉగ్రవాది ఇంట్లో రహస్య గది

పోలీసుల తాజా దర్యాప్తులో వెలుగుచూసిన వైనం

బహరాంపూర్ (పశ్చిమబెంగాల్): అల్ ఖైదా ఉగ్రవాది అబూ సుఫియాన్ ఇంట్లో రహస్య గదిని పశ్చిమబెంగాల్ పోలీసులు తాజాగా కనుగొన్నారు. ముర్షిదాబాద్ జిల్లాలోని బహరాంపూర్ నగరంలో ఆరుగురు అల్ ఖైదా ఉగ్రవాదులను ఇటీవల జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. ఈ అరెస్టు అనంతరం దర్యాప్తు జరిపిన పశ్చిమబెంగాల్ పోలీసులకు ఓ అల్ ఖైదా ఉగ్రవాది ఇంటిలోపల రహస్య గదిని నిర్మించుకున్నాడని తేలింది. రాణినగర్ ప్రాంతంలోని అల్ ఖైదా ఉగ్రవాది అబూ సూఫియాన్ ఇంట్లో 10 అడుగుల పొడవు, ఏడు అడుగుల వెడల్పు ఉన్న ఓ రహస్య గదిని గుర్తించామని ముర్షిదాబాద్ జిల్లా సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. ఒక అంతస్తు ఉన్న ఈ భవనంలోని రహస్య గదిలో ఎలక్ట్రానిక్ పరికరాలు, ఓ బోర్డుపై బల్బు లభించాయి. అటాచ్ డ్ టాయ్ లెట్ కోసం సెప్టిక్ ట్యాంకు కోసం తవ్విన గుంత రహస్య గదిగా ఉందని సూఫియన్ భార్య చెప్పింది. 


అబూ సూఫియన్ ఇంటరాగేషన్ లో తన ఇంట్లో ఉన్న రహస్య గది గురించి వెల్లడించాడని పోలీసులు చెప్పారు. ఆరుగురు అల్ ఖైదా ఉగ్రవాదులను కోల్ కతా నగరంలో ఇంటరాగేట్ చేసి, అనంతరం వారిని రిమాండుకు తరలించారు. అల్ ఖైదా ఉగ్రవాదులపై అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. దేశంలో పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరిపేందుకు అల్ ఖైదా ఉగ్రవాదులు కుట్ర పన్నారని ఎన్ఐఏ అధికారులు వివరించారు.

Updated Date - 2020-09-21T13:36:47+05:30 IST