Abn logo
Dec 2 2020 @ 23:58PM

ఇంకా వెనకడుగే..

 సెకండ్‌ వేవ్‌ భయంతో స్కూళ్లలో పెరగని హాజరు 

టెన్త్‌లో హాజరు సగమే.. 8,9 తరగతులకు 30 శాతమే

వ్యాక్సిన్‌ వచ్చే వరకు వేచి చూసే ధోరణిలో తల్లిదండ్రులు

అప్పటి వరకు ఆన్‌లైన్‌ తరగతుల వైపే మెజారిటీ మొగ్గు


భీమవరం ఎడ్యుకేషన్‌, డిసెంబరు 2 :  పాఠశాలలు తెరిచి నెల రోజులు గడుస్తున్నా.. విద్యార్థుల హాజరు సంఖ్య అంతంత మాత్రంగానే ఉంది. ప్రస్తుతం ఇంటర్‌ సెకండియర్‌, పది, తొమ్మిది, ఎనిమిది తరగతులు నడుస్తున్నాయి. ఈ 14వ తేదీ నుంచి ఆరు, ఏడు తరగతులు, సంక్రాంతి తర్వాత ఒకటి నుంచి ఐదో తరగతి క్లాసులు జరగనున్నాయి. ఇప్పుడే విద్యార్థుల హాజరు అంతంతమాత్రంగా ఉండటంతో రాబోయే రోజుల్లో ఇంకెలా ఉంటుందన్న సందేహాలు ఉపాధ్యాయులు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 455 పాఠశాలల్లో ఎనిమిది నుంచి పదో తరగతి వరకు 88,777 మంది విద్యార్థులు ఉండగా, బుధవారం 27,911 మందే హాజరయ్యారు. అంటే 30 శాతం కన్నా తక్కువ మంది వచ్చారు. పదో తరగతిలో 31,472 మంది విద్యార్థులకు 15,618 మంది, తొమ్మిదో తరగతి 30,603 మందికి 9,645 మంది, ఎనిమిదో తరగతిలో 26,702 మందికి 2,648 మంది బుధవారం పాఠశాలకు వచ్చారు. ఈ నెల ఒకటో తేదీ 10వ తరగతిలో 15,791 మంది, 9వ తరగతికి 3,420 మంది, 8వ తరగతికి 6,810 మంది హాజరయ్యారు. నెల రోజుల నుంచి తరగతులు నిర్వహిస్తున్నా తొమ్మిది, పది విద్యార్థుల హాజరులో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. గత నెల 23 నుంచి ప్రారంభమైన 8వ తరగతిలోనూ ఇదే పరిస్థితి. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా విద్యార్థులను పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు ఇంకా భయపడుతున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ ఇతర దేశాలలో, దేశంలోని కొన్ని రాష్ట్రాలలో మొదలైందన్న ప్రచారమే దీనికి ప్రధాన కారణం. వ్యాక్సిన్‌ వచ్చినప్పుడు పంపవచ్చన్న ఆలోచనలో ఎక్కువ తల్లిదండ్రులు ఉన్నారు. పాఠశాలలు ప్రారంభమయ్యాక కొన్ని ప్రాంతాలలో పలువురు ఉపాధ్యాయులు కరోనా బారిన పడటం విద్యార్థులు మరింత వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఇలా కరోనా భయం పాఠశాలకు విద్యార్థులు వెళ్లకుండా నిలువరిస్తుందని అనుకోవాలి.


మార్చిలో ఇంటర్‌ ఫైనల్‌ పరీక్షలు 

ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 2 : 

ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు   ఈ నెలలో రెండో యూనిట్‌ పరీక్షలు, జనవరిలో అర్ధ సంవత్సర పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించినట్లు  జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి మణేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఇంటర్‌ విద్య బోర్డు వార్షిక తాత్కాలిక క్యాలెండర్‌ను విడుదల చేసింది. కళాశాలల వెసులుబాటును బట్టి మూడు, నాలుగు యూనిట్‌ పరీక్షలు నిర్వహించు కోవచ్చు. ప్రీ ఫైనల్‌ పరీక్షలు ఫిబ్రవరి చివరి వారంలో జరుగుతాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో రెండో శనివారం సెలవులు ఉండవు. సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థులకు మార్చి మొదటి వారంలో ప్రాక్టికల్‌  పరీక్షలు, చివరి వారంలో పబ్లిక్‌ పరీక్షలు నిర్వహిస్తారు. 

ప్రథమ సంవత్సరం ఇంటర్‌ అడ్మిషన్లు, తరగతుల నిర్వహణపై ఇంత వరకూ స్పష్టత లేదు. తరగతికి అనుమతించిన అడ్మిషన్ల సంఖ్యపై ప్రభుత్వం, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించడంతో ఈ న్యాయ వివాదం తేలే వరకూ అడ్మిషన్లు, తరగతుల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశాలు లేవు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం ఇంటర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానాల్లో తరగతులు జరుగుతుండగా వీలైనంత మేర ఎక్కువ మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement