సెకండ్‌ వేవ్‌ సెగలు!

ABN , First Publish Date - 2021-04-07T06:09:15+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ వేగంగా వ్యాపిస్తోంది. సెకండ్‌ వేవ్‌లో సెగలుకక్కుతోంది. రోజురోజుకూ ఊహించని రీతిలో కేసులు పెరుగుతున్నాయి. గడిచిన పది రోజులుగా కేసులు పెరగడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య భారీగా పెరిగింది. టెస్టుల సంఖ్య పెంచిన విధంగానే

సెకండ్‌ వేవ్‌ సెగలు!
నిజామాబాద్‌లోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి

జిల్లాలో ఊహించని రీతిలో కరోనా వ్యాప్తి 

భారీగా పెరుగుతున్న కేసులు 

ఆసుపత్రుల్లో పెరిగిన రోగుల సంఖ్య 

కొత్తగా జిల్లాలో క్వారంటైన్‌ కేంద్రాల ఏర్పాటు

ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్‌ బెడ్స్‌ పెంపు 

అధికారులు, ప్రైవేటు ఆసుపత్రుల యజమానులతో సమీక్షించిన కలెక్టర్‌ నారాయణరెడ్డి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కొవిడ్‌ వేగంగా వ్యాపిస్తోంది. సెకండ్‌ వేవ్‌లో సెగలుకక్కుతోంది. రోజురోజుకూ ఊహించని రీతిలో కేసులు పెరుగుతున్నాయి. గడిచిన పది రోజులుగా కేసులు పెరగడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య భారీగా పెరిగింది. టెస్టుల సంఖ్య పెంచిన విధంగానే కేసులు పెరుగుతున్నాయి. గ్రామం, మున్సిపాలిటీ అనే తేడా లేకుండా వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో యంత్రాం గం అప్రమత్తమైంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తూనే హోం క్వారంటైన్‌ వారికి సేవలు అందించే విధంగా చర్యలు చేపట్టారు. ఇళ్ల లో ఉండలేనివారికి మొదటి విడతలాగానే క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. జిల్లా జనరల్‌ ఆసుపత్రిలో కొవిడ్‌ సేవల కోసం అదనపు సిబ్బంది కావాలని ప్రభుత్వానికి నివేదించారు. పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టేందుకు గ్రామస్థాయి నుంచి శాఖల మధ్య సమన్వయం చేసుకుంటూ వ్యాప్తిని అరికట్టేందుకు సిద్ధమవుతున్నా రు. జిల్లాలో మార్చి నుంచి కరోనా వ్యాప్తి భారీగా పెరిగింది. రెండో విడత మొదలైన ఈ కరోనా.. ఊహించని రీతిలో వ్యాప్తి చెందుతోంది. మహారాష్ట్ర సరిహద్దులు ఉన్న జిల్లాలో అన్ని గ్రామాల పరిధిలో కేసులు వస్తున్నాయి. నిజామాబాద్‌ నగరంతో పాటు బోధన్‌, ఆర్మూర్‌ మున్సిపాలిటీల పరిధిలో గత 15 రోజులుగా భారీగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తిపైన ప్రజలు నిర్లక్ష్యం వహించడంతో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. నగరం పరిధిలో షాపింగ్‌మాల్స్‌, ఆసుపత్రులలో కరోనా వ్యాప్తి అరికట్టేందుకు చర్యలు తీసుకోకపోవడం, టెస్టులు చేయకపోవడం వల్ల భారీగా వ్యాప్తి జరిగింది. మాల్స్‌, వాణిజ్య సంస్థల్లో కరోనా నిరోధానికి చర్యలు చేపట్టకపోవడం, మాస్కులు ధరించకపోవడం వల్ల ఈ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు వైద్య నిపుణులు అంచనా  వేస్తున్నారు. ఈ సంస్థల్లో ఎవరో ఒకరికి కరోనా రాగానే మిగతా వారికి వ్యాప్తి చెందడం వల్ల సంస్థల్లోకి వచ్చేవారికి సోకి ఎక్కువ మందికి పాజిటివ్‌ వస్తుంది. మొదట లక్షణాలు లేక టెస్టులు చేయించుకోక ఎక్కువ మంది తిరగడం వల్ల వ్యాప్తి ఎక్కువవుతున్నట్లు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. రెండో విడత తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాటు వ్యాప్తి కూడా ఎక్కువగా ఉంది. ఐసీఎంఆర్‌ కూడా జిల్లాలో కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చినా గ్రామాలు, నగరంలో ప్రజలు పట్టించుకోకపోవడం, భౌతికదూరం పాటించకపోవడం, ఫంక్షన్‌లు, తీర్థయాత్రలు ఎక్కువగా చేయడం వల్ల ఈ కేసులు భారీగా పెరిగాయి. కొన్ని గ్రామాల్లో శుభకార్యాలకు హాజరై నిబంధనలు పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడం వల్ల భారీగా కేసులు వచ్చాయి. ఆయా గ్రామాల పరిధిలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనాను వ్యాప్తి చెందకుండా అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. 

రెండో విడతలో భారీగా పెరిగిన కేసులు

జిల్లాలో రెండో విడతలో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గత నెల మొదటి వారంలో మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ విధించినా.. సరిహద్దు జిల్లాలు అప్రమత్తం కాకపోవడం వల్ల అక్కడ నుంచి వ్యాప్తి ఎక్కువగా జరిగింది. జిల్లాలోని ప్రజలు కూడా శుభకార్యాలు, ఇతర అవసరాల కోసం బయటకి వచ్చి నిబంధనలు పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడం వల్ల ఈ కేసులు భారీగా పెరిగాయి. ప్రతీరోజు 80 నుంచి వంద మధ్యలో కేసులు వస్తున్నాయి. జిల్లాకేంద్రం, గ్రామం, మండలం అనే తేడా లేకుండా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఎక్కడ పరీక్షలు నిర్వహించిన కేసులు వస్తునే ఉన్నాయి. బయటకి వచ్చేవారు మాస్కులు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడం, శానిటైజర్‌లు ఉపయోగించకపోవడం వల్ల కేసులు భారీగా పెరిగాయి. దీంతో జిల్లావ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీల పరిధిలో టెస్టుల సంఖ్యను పెంచారు. మొబైల్‌ వాహనాలు, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మాల్స్‌, బస్టాండ్‌, వాణిజ్య సంస్థలు, గ్రామాల్లో పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ కేసులను గుర్తించే ప్రయత్నం మొదలుపెట్టారు. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రుల్లో గడిచిన ఐదు రోజులుగా ఆర్టీపీసీఆర్‌ ద్వారా పరీక్షలను నిర్వహిస్తున్నారు. జిల్లాతో పాటు కామారెడ్డి, నిర్మల్‌, ఆదిలాబాద్‌కు చెందిన షాంపిల్స్‌ పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం రోజుకు వంద వరకు టెస్టులు చేస్తుండగా.. మరికొద్ది రోజుల్లో భారీగా పెంచేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. 

రోగులతో ఆసుపత్రులు కిటకిట

గడిచిన పదిహేను రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో తీవ్రత ఉన్నవారు ఎక్కువగా ఆసుపత్రులలో చేరుతున్నారు. గత నెల 20 వరకు జిల్లా జనరల్‌ ఆసుపత్రిలో 20మందిలోపే కరోనా వచ్చినవారు చికిత్స పొందగా.. ప్రస్తుతం 180 మంది చేరారు. ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం వల్ల చికిత్స అందిస్తున్నారు. కరోనా వచ్చినవారికోసం 272 పడకలను సిద్ధం చేశారు. ఆక్సిజన్‌తో పాటు వెంటిలేటర్‌లను అందు బాటులో ఉంచారు. జిల్లా వారితో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చి చేరడంతో చికిత్సను అందిస్తున్నారు. ప్రతీరోజు కేసులు పెరుగుతుండడంతో బోధన్‌, ఆర్మూర్‌ ఆసుపత్రుల్లో కూడా చికిత్స అందించేందుకు ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేటు ఆసుపత్రులను కూడా చికిత్స అందించే విధంగా ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రిలో కూడా బెడ్స్‌ అందుబాటులో ఉండే విధంగా  ఏర్పాట్లను చేస్తున్నారు. కేసులు భారీగా పెరగడంతో ముందస్తు చర్యలను చేపట్టారు. అవసరమైన మేరకు మందులు, ఇతర పరికరాలను తెప్పించారు. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉండడంతో ఉన్నతాధికారులకు నివేదించారు. శానిటేషన్‌, ఇతర సిబ్బందిని నియమించాలని కోరారు. అంతేకాకుండా కొవిడ్‌ పేషంట్‌లు పెరగడంతో పాటు సాధారణ రోగులు కూడా చికిత్స కోసం ఆసుపత్రికి వస్తుండడంతో సిబ్బంది సరిపోవడం లేదని సంబంధిత అధికారులకు నివేదించారు. మరో వారం రోజుల్లో కొంతమందిని కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 

జిల్లాలో క్వారంటైన్‌ కేంద్రాల ఏర్పాటు

జిల్లాలో మళ్లీ క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. గతంలో లాగా మాక్లూర్‌తో పాటు ఆర్మూర్‌, బోధన్‌లో ఒకటి, రెండు రోజుల్లో క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇళ్లలో ఉండలేనివారికి క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉండేవిధంగా ఏర్పాట్లను చేస్తున్నారు. పాజిటివ్‌ వచ్చి తీవ్రత లేనివారిని ఈ కేంద్రాలకు తరలించి చికిత్స అందిస్తారు. వారికి కావాల్సిన మందులతో పాటు భోజన వసతులను కల్పిస్తారు. హోం ఐసోలేషన్‌లో ఉండేవారికి కూడా మెరుగైన సేవలను అందించే విధంగా ఏర్పాట్లను చేస్తున్నారు.

అధికారులు, వైద్యులతో కలెక్టర్‌ సమీక్ష

రాష్ట్ర సీఎస్‌ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు, హాస్పిటల్స్‌ యాజమన్యాలతో కొవిడ్‌పై కలెక్టర్‌ నారాయణరెడ్డి మంగళవారం సమీక్షించారు. నివారణకు ప్రతీఒక్కరు కృషి చేయాలని ఆదేశాలు ఇచ్చారు.  గ్రామస్థాయి నుంచి శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రతీఒక్కరు నిబంధన లు పాటించే విధంగా చూడాలని కోరారు. అన్ని మండలాల అధికారుల తో సెల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించిన కలెక్టర్‌.. అన్ని స్థాయిల్లో తనిఖీలు పెం చాలని కోరారు. నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. కరోనా ఉధృతిని కట్టడి చేసేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీలు, గ్రామ, మండలస్థాయిలలో అధికారులు పరీక్షల ను పెంచి.. కొవిడ్‌ వచ్చినవారిని గుర్తించాలన్నారు. వారిని హోం ఐసొలేషన్‌లో ఉంచడంతో పాటు అవసరమైన వారిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించాలన్నారు. సీరియస్‌గా ఉన్నవారిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలన్నారు. టెస్టులు పెరిగిన విధంగానే వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని కూడా పెంచాలన్నారు. అలాగే, ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా పడకల సంఖ్య పెంచాలని కోరారు. వారితో సమీక్షించి కరోనా ఉధృతిని అరికట్టేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఆసుపత్రికి వచ్చేవారికి కరోనా లక్షణాలు ఉంటే పరీక్షలు నిర్వహించాలని, వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి వందశాతం ప్రైవేటు ఆసుపత్రులు సేవలు అందించాలని సూచించారు. కొన్ని ఆసుపత్రుల్లో వైద్యులకు కరోనా వచ్చినా సేవలు అందిస్తున్నారని, ఎవరైనా ఆ విధంగా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు పెడతామని తెలిపారు. వ్యాక్సిన్‌ వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సీపీ కార్తీకేయ, అదనపు కలెక్టర్‌లు చంద్రశేఖర్‌, లత, జడ్పీ సీఈవో గోవింద్‌, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ప్రతిమారాజ్‌, డీఎం హెచ్‌వో సుదర్శన్‌, డీపీవో జయసుద, అధికారులు సత్యనారాయణ, డాక్టర్‌ తుకారాం, డాక్టర్‌ రాజేష్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-07T06:09:15+05:30 IST