Coronavirus దేశాన్ని సునామీలా తాకింది: కిరణ్ మజుందార్ షా

ABN , First Publish Date - 2021-05-07T00:42:00+05:30 IST

భారత్‌లో కరోనా రెండో దశపై బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా స్పందించారు. భారత్‌ను రెండో దశలో

Coronavirus దేశాన్ని సునామీలా తాకింది: కిరణ్ మజుందార్ షా

వాషింగ్టన్: భారత్‌లో కరోనా రెండో దశపై బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా స్పందించారు. భారత్‌ను రెండో దశలో కరోనా వైరస్ ‘సునామీ’లా తాకిందని అన్నారు. రెండో దశలో కరోనా వైరస్ భారత్‌లో చెలరేగిపోతోందని, ఈ దశలో ఇది సునామీలా విరుచుకుపడిందన్నారు. దేశంలోని ఏ ఒక్క ప్రాంతాన్నీ ఇది విడిచిపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్లోబల్ వ్యాక్సిన్ ఈక్విటీపై ‘వన్ షేర్ వరల్డ్’ నిర్వహించిన వర్చువల్ ప్యానెల్ చర్చలో పాల్గొన్న కిరణ్ మజుందార్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.


అసెంబ్లీ ఎన్నికలు, పండుగలు పబ్బాలను యథేచ్ఛగా నిర్వహించడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని అన్నారు. వైరస్ కారణంగా ఈసారి పట్టణాలతోపాటు పల్లెలు కూడా విలవిల్లాడుతున్నాయన్నారు. వైరస్ ఇంత భయానకంగా చెలరేగిపోవడానికి ఎన్నికలు, మతపరమైన కార్యక్రమాలు  నిర్వహించడమేనని విమర్శించారు. 


కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఆసుపత్రులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆక్సిజన్, ఆసుపత్రిలో బెడ్లు దొరక్క వందలాదిమంది ప్రాణాలు పోతున్నారు. ఈ రోజు ఈ విలయాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన మానవ వనరులు మన వద్ద లేవని మజుందార్ అన్నారు.


రోగులకు చికిత్స అందించేందుకు మన వద్ద సరిపడా మందులు లేవని, మహమ్మారిని ఎదుర్కొనేందుకు అవసరమైన రకాల మందుల సరఫరా కూడా లేదన్నారు. అంతేకాదు, పైన పేర్కొన్నవాటితోపాటు టీకాలు కూడా సరిపడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో జనాభా విపరీతంగా ఉండడం సవాలుగా మారిందన్నారు. కాబట్టి భారత్‌ను ఆదుకునేందుకు ముందుకొస్తున్న అంతర్జాతీయ సమాజాన్ని ఆహ్వానించాలన్నారు. కాగా, దాదాపు 40 దేశాలు భారత్‌కు ఆపన్న హస్తం అందించాయి. భారత్ కనుక సురక్షితంగా లేకుంటే ప్రపంచం కూడా సురక్షితంగా ఉండదని తాను చెప్పగలనన్నారు.


ఈ ఏడాది మొదట్లో చాలా నిబ్బరంగా ఉన్న భారత్ వ్యాక్సిన్లను ఇతర దేశాలకు కూడా సరఫరా చేసిందని, కానీ ఇప్పుడు సరిపడా వ్యాక్సిన్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతోందన్నారు. ప్రస్తుత సంక్షోభాన్ని నివారించాలంటే టీకాల ఉత్పత్తిని పెంచడం ఒకటే మార్గమన్నారు.   

Updated Date - 2021-05-07T00:42:00+05:30 IST