ట్రంప్‌కు రెండోసారి 'కరోనా' టెస్టు.. రిజ‌ల్ట్ ఇదే

ABN , First Publish Date - 2020-04-03T20:23:26+05:30 IST

అమెరికాలో కరోనా వైరస్ వేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గురువారం వైద్యులు రెండోసారి కరోనా పరీక్ష చేశారు.

ట్రంప్‌కు రెండోసారి 'కరోనా' టెస్టు.. రిజ‌ల్ట్ ఇదే

వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ వేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గురువారం వైద్యులు రెండోసారి కరోనా పరీక్ష చేశారు. ఈ కరోనా పరీక్షల్లో ట్రంప్‌కు కరోనా నెగిటివ్ వ‌చ్చింద‌ని వైట్ హౌస్ ఫిజీషియన్ డా. సీన్ కాన్లీ చెప్పారు. కొత్త ర్యాపిడ్ పాయింట్ కేర్ సహాయంతో ఒక్క నిమిషంలోనే శాబ్స్ శాంపిల్ సేక‌రించి కొవిడ్-19 పరీక్ష చేశామ‌ని, 15 నిమిషాల్లోనే రిపోర్టు వ‌చ్చింద‌ని ఆయ‌న‌ తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యంగా ఉన్నారని, ఆయనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని సీన్ కాన్లీ స్ప‌ష్టం చేశారు. 


ఈ క‌రోనా టెస్టు త‌ర్వాత మీడియాతో మాట్లాడిన ట్రంప్ త‌న‌కు నిర్వ‌హించిన ప‌రీక్ష ఫ‌లితాల్లో క‌రోనా నెగెటివ్ అని తేలింద‌ని, చాలా త‌క్కువ స‌మ‌యంలో క‌చ్చిత‌మైన రిపోర్ట్ వ‌చ్చింద‌న్నారు. ప్ర‌స్తుతం దేశంలో నెల‌కొన్న విప‌త్క‌ర ప‌రిస్థితుల దృష్ట్యా ఆంక్ష‌ల‌ను మ‌రో నాలుగు వారాల పాటు పొడిగిస్తున్న‌ట్లు చెప్పారు. క‌రోనా మ‌హ‌మ్మారిని స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొట్టాలంటే ప్ర‌జలు ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని సూచించారు. వ్య‌క్తిగ‌త శుభ్ర‌త‌, సామాజిక దూర‌మే మ‌న‌ల్ని ఈ వైర‌స్ నుంచి కాపాడుతుంద‌ని పేర్కొన్నారు. 


ఇక అగ్ర‌రాజ్యం అమెరికా క‌రోనా వైర‌స్ కార‌ణంగా చిగురుటాకులా వ‌ణికిపోతోంది. దేశ వ్యాప్తంగా శ‌ర‌వేగంగా ప్ర‌బ‌లుతున్న ఈ మ‌హ‌మ్మారి అమెరిక‌న్ల‌ను కంటి మీద క‌నుకు లేకుండా చేస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు యూఎస్‌లో 2,45,373 మంది క‌రోనా బారిన‌ప‌డ‌గా, 6,095 మంది మృత్యువాత ప‌డ్డారు. న్యూయార్క్ న‌గరంలో కొవిడ్‌-19 వీర‌విహారం చేస్తోంది. ఒక్క న్యూయార్క్ న‌గ‌రంలోనే ఈ వైర‌స్ 2,538 మందిని పొట్ట‌న‌బెట్టుకుంది. 93,053 మంది బాధితులు ఉన్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా 10 ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 53,293 మంది మ‌ర‌ణించారు.       

Updated Date - 2020-04-03T20:23:26+05:30 IST