రెండో రోజూ బారులే

ABN , First Publish Date - 2020-03-31T09:20:08+05:30 IST

రేషన్‌ సరుకుల కోసం షాపులకు వెళ్తున్న లబ్ధిదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పంపిణీలో స్పష్టత లేకపోవడం, ఉదయం నుంచే భారీ సంఖ్యలో కార్డుదారులు షాపులకు పోటెత్తడంతో గంటల తరబడి క్యూ

రెండో రోజూ బారులే

  • కార్డుదారులకు ‘రేషన్‌’ చుక్కలు.. 
  • క్యూ లైన్లలో గంటల తరబడి నిరీక్షణ
  • ‘కరోనా’ భౌతిక దూరానికి చెల్లుచీటీ.. 
  • 2 రోజుల్లో 16.89 లక్షల మందికి సరుకులు
  • వలంటీర్లతో ఇంటికే పంపాలని వినతులు 


అమరావతి, మార్చి 30(ఆంధ్రజ్యోతి): రేషన్‌ సరుకుల కోసం షాపులకు వెళ్తున్న లబ్ధిదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పంపిణీలో స్పష్టత లేకపోవడం, ఉదయం నుంచే భారీ సంఖ్యలో కార్డుదారులు షాపులకు పోటెత్తడంతో గంటల తరబడి క్యూ లైన్లలో నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాక్‌డౌన్‌ వల్ల బహిరంగ మార్కెట్‌లో నిత్యావసరాలు కొనలేక కష్టాలు పడుతున్న పేదలు రేషన్‌ సరుకుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నెల 29వ తేదీ నుంచే రేషన్‌ దుకాణాల్లో సరుకులు లభ్యమవుతున్నా లబ్ధిదారులు అందరూ ఒకే సమయంలో రావడం, లాక్‌డౌన్‌ సమయం కుదించిన నేపథ్యంలో భౌతిక దూరం పాటించడం కూడా కష్టమైపోతోంది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రేషన్‌ పంపిణీని పరిశీలిస్తే ఒక్కో షాపు ఎదుట వందల మంది లబ్ధిదారులు బారులు తీరారు. మరోవైపు రేషన్‌ దుకాణాల దగ్గర ఉండి పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించినా వలంటీర్లు అటువైపు వెళ్లడం లేదు. కరోనా కారణంగా లబ్ధిదారులు వేలిముద్రలు తీసుకోకుండా వీఆర్‌ఏ వేలిముద్రతో ప్రస్తుతం సరుకులు ఇస్తున్నారు. కానీ కొన్ని చోట్ల వీఆర్‌ఏలు సమయానికి రాకపోవడంతో డీలర్లు, కార్డుదారులు వారికోసం ఎదురుచూడాల్సి వస్తోంది.  రేషన్‌ కోసం దుకాణాలకు వస్తున్న వినియోగదారులు కరోనా నేపథ్యంలో పాటించాల్సిన భౌతిక దూరాన్ని పట్టించుకోవడం లేదు. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 8 గంటలకే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో షాపుల వద్ద భౌతిక దూరాన్ని పాటించే గీసిన బరుల్లో.. సంచీలను పెడుతున్న లబ్ధి దారులు సమీపంలోని చెట్లు, నీడగా ఉన్న ప్రాంతాల్లో గుంపులుగా కూర్చుని సేదదీరుతున్నారు. దీంతో భౌతిక దూరం దూరమవుతోంది.


అందరికీ ఇచ్చే వరకూ..: పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని

రేషన్‌ సరుకుల కోసం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని చెప్పారు. అందరికీ రేషన్‌ ఇచ్చే వరకూ షాపులు తెరిచే ఉంచుతామన్నారు. కాగా, రాష్ట్రంలో ప్రతి లబ్ధిదారునికీ రేషన్‌ సరుకులు అందజేస్తామని, సరుకులకు కొరత లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ తెలిపారు. చాలా చోట్ల రేషన్‌ షాపుల్లో కార్డుదారులు పరిమితికి మించి రావడంతో రద్దీ పెరుగుతోందన్నారు. ఏ సమయానికి ఎవరు రావాలనేది వలంటీర్లు స్లిప్పులు పంచి చెబుతున్నారని, సమయపాలన పాటించాలని విజ్ఞప్తి చేశారు. కార్డుదారులు సహకరిస్తే ఐదారు రోజుల్లోనే పంపిణీ ప్రక్రియ పూర్తవుతుందన్నారు.

Updated Date - 2020-03-31T09:20:08+05:30 IST