రెండో విడత వ్యాక్సిన్‌కు కోటిమంది దూరం

ABN , First Publish Date - 2022-02-08T13:41:40+05:30 IST

రాష్ట్రంలో కోటిమందికిపైగా రెండో విడత వ్యాక్సిన్‌ వేసుకునేందుకు ఆసక్తి కన బరచకపోవడం ఆందోళన కలి గిస్తోందని ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్‌ జె.రాధాకృష్ణన్‌ పేర్కొన్నారు. స్థానిక కీల్పాక్‌ వైద్యకళాశాల ఆస్పత్రిలో సోమవారం ఉదయం

రెండో విడత వ్యాక్సిన్‌కు కోటిమంది దూరం

- కోవై, తేని, తిరుప్పూర్‌, తిరువళ్లూరు జిల్లాల్లో కేసులు ఆందోళనకరం

- ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాధాకృష్ణన్‌


చెన్నై: రాష్ట్రంలో కోటిమందికిపైగా రెండో విడత వ్యాక్సిన్‌ వేసుకునేందుకు ఆసక్తి కన బరచకపోవడం ఆందోళన కలి గిస్తోందని ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్‌ జె.రాధాకృష్ణన్‌ పేర్కొన్నారు. స్థానిక కీల్పాక్‌ వైద్యకళాశాల ఆస్పత్రిలో సోమవారం ఉదయం ప్రత్యేక వార్డుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితులను ఆయన పీపీఈ కిట్‌ ధరించి వైద్యులతో కలిసి పరామర్శించారు. వారికి అందిస్తున్న వైద్యంపై సమీక్షించారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... జనవరిలో కరోనా, ఒమైక్రాన్‌ల వ్యాప్తి ఉగ్రరూపం దాల్చిందని, ఈ నెల రెండు వైరస్‌ల వ్యాప్తి బాగా తగ్గుముఖం పట్టిందని చెప్పారు. ప్రజలంతా కొవిడ్‌ నిబంధనలను పాటించాలని, అప్పుడే ఈ వైరస్‌లను కట్టడి చేయగలుగుతామని చెప్పారు. ముఖ్యంగా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్కులు పెట్టుకోవడం మానకూడదని ఆయన హెచ్చరించారు. అన్ని జిల్లాల్లోనూ వైరస్‌ తగ్గుముఖం పడుతున్నా కేరళ రాష్ట్రానికి ఆనుకుని ఉన్న కోయంబత్తూరు, తేని, తిరుప్పూరు జిల్లాలు, ఆంధ్ర రాష్ట్రానికి చేరువగా ఉన్న తిరువళ్లూరు జిల్లా, పర్యాటక ప్రాంతం నీలగిరి జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గడం లేదన్నారు. ఆ జిల్లాలపై ప్రత్యేక దృష్టిసారించి వ్యాక్సినేషన్‌ ముమ్మరం చేస్తున్నామని, ఆరోగ్యశాఖ అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు విరివిగా కరోనా ముందస్తు వైద్య పరీక్షలు జరుపుతున్నారని ఆయన వివరించారు.  ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌ బాధితుల కోసం ఏర్పాటైన ప్రత్యేక వార్డుల్లో నాలుగు శాతం పడకల్లోనే బాధితులు చికిత్స పొందుతు న్నారని తెలిపారు. దీనికితోడు జనవరి నుంచి రెండు విడతల టీకాలు వేసుకున్న బూస్టర్‌ డోస్‌లకు అర్హులైనవారిగా 7.5లక్షల మందిని గుర్తించామని, వీరిలో నాలుగు లక్షల మందికిపైగా బూస్టర్‌ డోస్‌ వేశామని తెలిపారు. మొదటి విడత వ్యాక్సిన్‌ వేసుకునేందుకు ఆసక్తి చూపిన ప్రజలు రెండో డోస్‌ వేసుకునేందుకు రాకపోవడం శోచనీయమన్నారు. ఇకనైనా రెండో డోస్‌ వ్యాక్సిన్‌ వేసుకునేందుకు ప్రజలు ముందుకురావాలని రాధాకృష్ణన్‌ విజ్ఞప్తి చేశారు. 


చెన్నైలో తగ్గుముఖం...

రాజధాని నగరం చెన్నైలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోందని అధికారులు తెలిపారు. గత జనవరిలో ఎనిమిదివేలు దాటిన పాజిటివ్‌ కేసుల సంఖ్య ప్రస్తుతం వెయ్యికంటే తక్కువగా నమోదైనట్టు తెలిపారు. ఈ నెల ఒకటి నుంచి కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గుతోందని, నగరంలో ఈ నెల ఒకటిన 2348 కేసులు నమోదు కాగా, ఆదివారం ఆ సంఖ్య 972కు తగ్గిందన్నారు. ప్రస్తుతం అడయార్‌ జోన్‌లోనే అధికంగా 1879 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారనీ, వీరిలో యాభైశాతం మంది ఇంటిదగ్గరే చికిత్స పొందుతున్నారని వివరించారు. తిరువొత్తియూరు జోన్‌లో 639, మనలి జోన్‌లో 650 మంది, మాధవరం జోన్‌లో 819 కరోనా కేసులు నమోద య్యాయని వెల్లడించారు.

Updated Date - 2022-02-08T13:41:40+05:30 IST