అపోలోలో సెకండ్‌ ఒపీనియన్‌ సేవలు

ABN , First Publish Date - 2022-01-25T07:02:09+05:30 IST

చికిత్సపొందుతున్న రోగుల కోసం అంతర్జాతీయ వైద్యుల సెకండ్‌ ఒపీనియన్‌ సేవలను

అపోలోలో సెకండ్‌ ఒపీనియన్‌ సేవలు

చికిత్సపొందుతున్న రోగుల కోసం అంతర్జాతీయ వైద్యుల సెకండ్‌ ఒపీనియన్‌ సేవలను దేశంలోనే తొలిసారిగా అపోలో ఆస్పత్రి ప్రారంభించింది. ఇందుకోసం అమెరికాకు చెందిన ‘ది క్లినిక్‌ బై క్లీవ్యాండ్‌ క్లినిక్‌’తో జట్టు కట్టింది. సోమవారం నిర్వహించిన వెబినార్‌లో అపోలో ఆస్పత్రి జాయింట్‌ ఎండీ డాక్టర్‌ సంగీతారెడ్డి, అమెరికాకు చెందిన ‘ది క్లినిక్‌ బై క్లీవ్యాండ్‌ క్లినిక్‌’ సీఈవో ఫ్రాంక్‌ మెక్గిలిన్‌  ఈవిషయాన్ని వెల్లడించారు. రోగికి చికిత్స విషయంలో ప్రస్తుతం వైద్యం అందిస్తున్న వైద్యుడితోపాటు మరో డాక్టర్‌ అభిప్రాయాన్ని తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని డాక్టర్‌ సంగీతారెడ్డి తెలిపారు.




క్లిష్టమైన సమస్యలున్న రోగుల చికిత్సకు ప్రణాళికను రూపొందించేందుకు అపోలో వైద్యులు, ది క్లినిక్‌ బై క్లీవ్యాండ్‌ క్లినిక్‌ వైద్యులతో కలిసి పనిచేస్తారని అపోలో ఆస్పత్రుల గ్రూప్‌ మెడికల్‌ డైరెక్టర్‌ అనుపమ్‌ సిబల్‌ తెలిపారు. ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని భావించేవారు అపోలో కన్సల్టెంట్‌ను సంప్రదించి, తమ వైద్య నివేదికలను సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం ఈ వివరాలను ‘ది క్లినిక్‌ బై క్లీవ్యాండ్‌ క్లినిక్‌’లోని వైద్య నిపుణులకు పంపుతారు. వాటి పరిశీలన తర్వాత అంతర్జాతీయ వైద్య నిపుణుడితో రోగిని కాన్ఫరెన్స్‌ ఫోన్‌ కాల్‌లో మాట్లాడిస్తారు. అనంతరం ఆ రోగికి ఎలాంటి చికిత్స అవసరమనే దానిపై వైద్యుడు లిఖితపూర్వక సూచనలను రాసి పంపిస్తారు. 


Updated Date - 2022-01-25T07:02:09+05:30 IST