రెండో రోజూ వరుణుడిదే

ABN , First Publish Date - 2020-08-15T09:04:43+05:30 IST

ఇంగ్లండ్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టును వరుణుడు ఇబ్బందిపెడుతున్నాడు. వర్షం కారణంగా రెండో రోజైన శుక్రవారం తొలి సెషన్‌ గంటన్నర ఆలస్యంగా ఆరంభం

రెండో రోజూ వరుణుడిదే

సౌతాంప్టన్‌: ఇంగ్లండ్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టును వరుణుడు ఇబ్బందిపెడుతున్నాడు. వర్షం కారణంగా రెండో రోజైన శుక్రవారం తొలి సెషన్‌ గంటన్నర ఆలస్యంగా ఆరంభం కాగా ఆ తర్వాత కూడా ఆట సజావుగా సాగింది లేదు. దట్టమైన మేఘాలతో వెలుతురు మందగించడంతో చాలా ఆట తుడిచిపెట్టుకుపోయింది. చివరి సెషన్‌ కేవలం పది నిమిషాలపాటే సాగగా మొత్తంగా కేవలం 41 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. మ్యాచ్‌ ముగిసే సమయానికి పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 86 ఓవర్లలో 9 వికెట్లకు 223 పరుగులు చేసింది. అయితే పేసర్లు ఆధిక్యం చూపిన ఈ మ్యాచ్‌లో కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ (60 బ్యాటింగ్‌) అండగా నిలిచి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించగలిగాడు. బాబర్‌ ఆజమ్‌ (47) ఫర్వాలేదనిపించాడు. అండర్సన్‌, బ్రాడ్‌కు మూడేసి వికెట్లు దక్కాయి.

రిజ్వాన్‌ పోరాటం..: 126/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన పాక్‌ ఈ సెషన్‌లో అతి జాగ్రత్తగా ఆడి మరో 29 పరుగులు మాత్రమే చేసింది. కానీ బ్రేక్‌ తర్వాత కొద్దిపేసటికే బాబర్‌ ఆజమ్‌ రూపంలో పేసర్‌ బ్రాడ్‌ పాక్‌ కీలక వికెట్‌ తీశాడు. అటు కీపర్‌ రిజ్వాన్‌ మాత్రం ఓపిగ్గా క్రీజులో నిలిచి ఇంగ్లండ్‌ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. కానీ మరో వైపు పాక్‌ యాసిర్‌ షా (5), షహీన్‌ అఫ్రీది (0) వికెట్లను కోల్పోయింది. 176/8 స్కోరుతో ఇబ్బందుల్లో పడిన వేళ.. మహ్మద్‌ అబ్బాస్‌ (2) కాస్త నిలబడడంతో రిజ్వాన్‌ అర్ధసెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు జట్టు స్కోరును 200 దాటించాడు. ఈసమయంలో వెలుతురు లేమితో ముందుగానే టీ బ్రేక్‌కు వెళ్లారు. ఇక చివరి సెషన్‌ ఆరంభమైన పది నిమిషాలకే మరోసారి వెలుతురు మందగించడంతో ఆటను నిలిపేశారు. అయితే ఆ లోపే అబ్బాస్‌ వికెట్‌ను కూడా పాక్‌ కోల్పోయింది. రెండు గంటలపాటు వేచి చూసినా సరైన వెలుతురు రాకపోవడంతో ఆటను రద్దు చేశారు.


సంక్షిప్త స్కోరు:

పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌: 86 ఓవర్లలో 9 వికెట్లకు 223 (అబిద్‌ అలీ 60, బాబర్‌ ఆజమ్‌ 47, మహ్మద్‌ రిజ్వాన్‌ 60 బ్యాటింగ్‌, అండర్సన్‌ 3/48, బ్రాడ్‌ 3/56).

Updated Date - 2020-08-15T09:04:43+05:30 IST