రెండో రోజూ వర్షబాధిత ప్రాంతాల్లో Central team

ABN , First Publish Date - 2021-11-24T15:19:52+05:30 IST

కడలూరు సహా డెల్టా జిల్లాల్లో కేంద్ర బృందం మంగళవారం వర్షబాధిత ప్రాంతాల్లో పర్యటించింది. ఆ సందర్భంగా ఆస్తి, పంట నష్టాలను స్థానిక ప్రజలు, రైతుల నుంచి అడిగి తెలుసుకున్నారు. కేంద్ర హోంశాఖ డిప్యూటీ కార్యదర్శి

రెండో రోజూ వర్షబాధిత ప్రాంతాల్లో Central team

చెన్నై: కడలూరు సహా డెల్టా జిల్లాల్లో కేంద్ర బృందం మంగళవారం వర్షబాధిత ప్రాంతాల్లో పర్యటించింది. ఆ సందర్భంగా ఆస్తి, పంట నష్టాలను స్థానిక ప్రజలు, రైతుల నుంచి అడిగి తెలుసుకున్నారు. కేంద్ర హోంశాఖ డిప్యూటీ కార్యదర్శి రాజీవ్‌శర్మ నేతృత్వం వహిస్తున్న ఈ బృందంలో కేంద్ర ఆర్థిక శాఖ ఖర్చుల విభాగం సలహాదారుడు ఆర్బీ కౌల్‌, కేంద్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ విజయ్‌ రాజ్‌మోహన్‌, చెన్నైలోని కేంద్ర నీటివనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న నీటివనరుల సంస్థ సంచాలకులు ఆర్‌.తంగమణి, కేంద్ర ఇంధన శాఖ సహాయ సంచాలకులు భవ్యా పాండే, చెన్నైలోని కేంద్ర హైవేస్‌ ప్రాంతీయ అధికారి రణజయ్‌సింగ్‌, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఎంవీఎన్‌ వరప్రసాద్‌ సభ్యులుగా ఉన్నారు. వీరు రెండు బృందాలుగా ఏర్పడి సోమవారం నుంచి వర్షబాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రెండో రోజు కడలూరు జిల్లాలో కేంద్ర హోం శాఖ డిప్యూటీ కార్యదర్శి రాజీవ్‌శర్మ నేతృత్వంలోని ఈ బృందం వర్షబాధిత ప్రాంతాలను సందర్శించింది. పెరియ కంగనాకుప్పంలో నీట మునిగిన పంటలను పరిశీలించారు. ఆ సందర్భంగా స్థానిక రైతులతో అధికారులు మాట్లాడి పంటనష్టం గురించి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్‌ బాలసుబ్రమణ్యం, శాసనసభ్యుడు అయ్యప్పన్‌ తదితరులు వీరితోపాటు ఉన్నారు. అనంతరం కేంద్ర బృందం నాగ పట్టినం, తిరువారూరు, తంజావూరు జిల్లాల్లో వరద ప్రాంతాలను సందర్శించారు. ఇదేవిధంగా కేంద్ర ఆర్థికశాఖ ఖర్చుల విభాగం సలహా దారుడు ఆర్బీకౌల్‌ నాయకత్వంలోని మరో బృందం వేలూరు, రాణిపేట జిల్లాల్లో వర్ష బాధిత, వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి ఆస్తినష్టాలు, పంట నష్టాలను స్థానికులు, రైతుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ రెండు బృందాలు తమ పర్యటనలను ముగించుకుని మంగళవారం రాత్రి చెన్నై చేరుకున్నాయి. బుధవారం ఉదయం కేంద్ర బృందం సభ్యులు ముఖ్యమంత్రి స్టాలిన్‌ అధ్యక్షతన జరిగే సమావేశంలో పాల్గొని మధ్యాహ్నం విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళతారు. కేంద్ర ప్రభుత్వానికి సమగ్రమైన నివేదికను సమర్పించనున్నారు.

Updated Date - 2021-11-24T15:19:52+05:30 IST