రూపేకార్డుల మాయంపై రెండోరోజు ఆందోళన

ABN , First Publish Date - 2020-07-09T11:18:23+05:30 IST

తల్లాడ సొసైటీ పరిధిలో రూపేకార్డులు మాయమై నగదు డ్రాచేసిన విషయమై రెండోరోజు బుధవారం ..

రూపేకార్డుల మాయంపై రెండోరోజు ఆందోళన

తల్లాడ, జూలై 8: తల్లాడ సొసైటీ పరిధిలో రూపేకార్డులు మాయమై నగదు డ్రాచేసిన విషయమై రెండోరోజు బుధవారం సొసైటీ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన కొనసాగించారు. 18నెలల క్రితం తల్లాడ సొసైటీ పరిధిలోని కొందరు రైతులకు సంబంధించిన రూపేకార్డులను మండలంలోని మల్లవరం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అపహరించి ఏటీఎం ద్వారానగదు డ్రా చేశారు. సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నగదు డ్రాచేసిన ఇరువురు వ్యక్తులను సొసైటీ అధికారులు గుర్తించి వారిరువురిని విచారించారు. రూపేకార్డులు ఎత్తుకెళ్లి వాటి ద్వారా నగదు డ్రాచేసినట్లు, డ్రాచేసిన నగదును తిరిగి చెల్లించేందుకు ఇరువురు సొసైటీ అధికారులకు అప్పట్లో అంగీకార పత్రాన్ని అందజేశారు.


ఈమేరకు రూ.3.50లక్షల నగదును ఇరువురు వ్యక్తులు సొసైటీ అధికారులకు తెలిపారు. ఇదిలా ఉండగా రెండురోజుల నుంచి మల్లవరం గ్రామానికి చెందిన కొందరు రైతులు తమ రూపేకార్డులు మాయం చేసి నగదు డ్రాచేసిన ఇరువురు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన నిర్వహించి కార్యాలయానికి తాళాలు వేశారు. ఈనేపథ్యంలో బుధవారం సొసైటీ కార్యాలయాన్ని డీసీసీబీ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ప్రసాద్‌ సందర్శించి సొసైటీలో కొందరు రైతులకు చెందిన రూపేకార్డులను ఇరువురు వ్యక్తులు ఎత్తుకెళ్లి ఏటీఎం ద్వారా నగదు డ్రాచేసిన విషయమై వివరాలను సేకరించారు. ఈమేరకు డీసీసీబీ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నట్లు ప్రసాద్‌ తెలిపారు.

Updated Date - 2020-07-09T11:18:23+05:30 IST