కోవిడ్-19 సెకండ్ వేవ్‌ చిన్నారులకు మరింత ప్రమాదకరమా?

ABN , First Publish Date - 2021-04-07T22:34:46+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి సెకండ్ వేవ్‌లో మరింతగా విజృంభిస్తోంది. ప్రాణాంతకంగా మారి.. కేసులు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. తొలి దశలో చిన్నారులకు, వృద్ధులకు పెద్దగా ప్రమాదం లేదన్న ...

కోవిడ్-19 సెకండ్ వేవ్‌ చిన్నారులకు మరింత ప్రమాదకరమా?

ఇంటర్నెట్ డెస్క్: కోవిడ్-19 మహమ్మారి సెకండ్ వేవ్‌లో మరింతగా విజృంభిస్తోంది. ప్రాణాంతకంగా మారి.. కేసులు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. తొలి దశలో చిన్నారులకు, వృద్ధులకు పెద్దగా ప్రమాదం లేదన్న ప్రచారం జరిగినా.. ఇప్పుడు మాత్రం అత్యంత ప్రమాదకరమన్న వార్తలు వెలువడుతున్నాయి. కోవిడ్ వైరస్‌తో చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోగనిరోధక శక్తిని, యాంటీ బాడీలను ఎదుర్కోవడంలో కొత్త వైరస్ చాలా బలంగా పనిచేస్తోందని చెబుతున్నారు. స్కూళ్లలో, విద్యా సంస్థల్లో పెరుగుతున్న కేసులే దీనికి నిదర్శనమని అంటున్నారు. కొత్త స్ట్రెయిన్స్ చిన్నారుల రోగనిరోధక శక్తిని తగ్గిస్తున్నాయని ఎపిడెమియోలజిస్టులు చెబుతున్నారు. చిన్నారుల్లో త్వరితగతిన ఇది వ్యాప్తి చెందుతుందన్న ఆందోళనను వైద్యులు వ్యక్తం చేస్తున్నారు. 


ప్రస్తుతానికి పరిశోధనలు కొనసాగుతున్నాయని, గతంలో కంటే చిన్నారుల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా 2 నుంచి 16 ఏళ్ల లోపు వారిలో ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ‘మల్టీ సిస్టమ్ ఇన్‌ప్లేమటరీ సిండ్రోమ్’ బారిన పడుతున్నారని వైద్యులు అంటున్నారు. ఇది మరణాల సంఖ్యను పెంచుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘జర్నల్ ఆఫ్ ట్రోపికల్ పిడియాట్రిక్స్’ కథనం ప్రకారం ప్రతి ముగ్గురిలో ఒకరు కరోనా వైరస్‌తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, వారికి సరైన వైద్య వసతి కల్పించాలని తెలిపింది. సెకండ్ వేవ్‌ను తేలిగ్గా తీసుకోరాదని హెచ్చరించింది. 


గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది చిన్నారులు బయటకు రావడం... నిబంధనలు పాటించకపోవడం, జనసందోహాల మధ్యకు వెళ్లడం, ప్రయాణాలు చేయడం వారిని రిస్క్‌లో పెడుతోందని నిపుణులు అంటున్నారు. కోవిడ్ లక్షణాలను ఎలా గుర్తించాలి? అనే దానిపై కూడా నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. సాధారణంగా కనిపించే జ్వరం, తలనొప్పి, దగ్గు, జలుబుతో పాటుగా దద్దుర్లు, ఎర్రబారిన కళ్లు, కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులు, ఉదర సంబంధితమైనవి, వాంతులు, పెదవులు పగలడం, రంగు మారడం(ఎరుపు, నీలం), శరీరం మంటలెక్కడం, నిద్రలేమి లక్షణాలు చెబుతున్నారు. ఇక నవజాత శిశువులపైనా ఇది ప్రభావం చూపనుందని.. వాంతులు, కండరాల నొప్పులు, అధిక ఉష్ణోగ్రతలు, ఆకలి లేకపోవడం, పొక్కులు రావడం, గాయాలు కావడం తదితరాలను చెబుతున్నారు.   


అయితే, పిల్లలకు వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి రానుందన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఇప్పుడప్పుడే సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. కనీసం ఏడాది సమయం పడుతుందని చెబుతున్నారు. 16 ఏళ్ల లోపు వారికి గుర్తింపు పొందిన వ్యాక్సిన్ అందుబాటులో లేదని తేల్చి చెబుతున్నారు. క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయన్నారు. మోడెర్నా అనే సంస్థ.. 2 నుంచి 12 ఏళ్ల మధ్య ఉన్నవారికి వ్యాక్సిన్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రయోగాల్లో చక్కని ఫలితాలు సాధిస్తోందని అంటున్నారు.  

Updated Date - 2021-04-07T22:34:46+05:30 IST