Abn logo
Sep 24 2021 @ 22:43PM

సీఐటీయూ ఆధ్వర్యంలో స్కీమ్‌ వర్కర్ల ఆందోళన

ముత్తుకూరు : ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు

ముత్తుకూరు, సెప్టెంబరు 24: సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దారు కార్యాలయం ఎదుట స్కీమ్‌ వర్కర్లు ఆందోళన చేశారు. అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, మధ్యాహ్న భోజన కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తున్నారని సీఐటీయూ నాయకులు గడ్డం అంకయ్య తెలిపారు. వీరిని వర్కర్లుగా గుర్తించి కనీస వేతనం, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, పెన్షన్‌ సదుపాయాలు కలుగజేయాలని డిమాండ్‌ చేశారు. కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొంటూ, సేవలు అందించిన వర్కర్లను అభినందించిన ప్రధానమంత్రి సుప్రీంకోర్టు తీర్పు మేరకు రూ.21వేల వేతనం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. తమ డిమాండ్లు   నెరవేర్చే వరకు పోరాటం సాగిస్తామన్నారు. ఈ మేరకు వినతి పత్రాన్ని తహసీల్దారు సోమ్లానాయక్‌కు అందజేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.   

మనుబోలు : అఖిల భారత స్కీమ్‌ వర్కర్స్‌ సంఘం పిలుపు మేరకు సీఐటీయూ, సీపీఎం ఆఽధ్వర్యంలో శుక్రవారం మనుబోలులో స్కీమ్‌ వర్కర్స్‌ విధులు బహిష్కరించి ర్యాలీ నిర్వహించారు. మండలంలోని అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, మధ్యాహ్న భోజన కార్మికులు స్థానిక ఉన్నత పాఠశాల నుంచి ర్యాలీగా బయలుదేరి వైఎస్‌ విగ్రహం వరకు చేరుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏళ్ల తరబడి ఒప్పంద కార్మికులుగా పనిచేస్తున్న తమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెగ్యులర్‌ ఉద్యోగులుగా తీసుకోవాలన్నారు. జీవితభద్రత కోసం 50లక్షల ప్రమాదబీమా చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం కార్యదర్శి దేవదానం,  సీఐటీయూ కార్యదర్శి ఆదిశేషయ్య, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం అధ్యక్షుడు తోకలపూడి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

తోటపల్లిగూడూరు  : స్కీం వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ మండల కార్యదర్శి వేగూరు వెంకయ్య డిమాండ్‌ చేశారు. స్కీం వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా చేపడుతున్న సమ్మెలో భాగంగా శుక్రవారం  మండల  కేంద్రంలో ఆందోళన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ స్కీం వర్కర్ల రెగ్యులరైజేషన్‌ చేయాలన్నారు. అఖిల భారత సమ్మెలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, మధ్యాహ్నం భోజన కార్మికులు, వెలుగు కార్మికులు హాజరయ్యారు. స్కీంలన్నింటిని సంస్థాగతం చేసి, స్కీం వర్కర్లను రెగ్యులరైజ్‌ చేయాలని వెంకయ్య తెలిపారు.  అనంతరం అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు.  కార్యక్రమంలో సీఐటీయూ అధ్యక్షుడు పావురాయల మధు, ఆటో యూనియన్‌ అధ్యక్షుడు మారుబోయిన రాజా, మస్తానమ్మ, అనిత, మధుసూదనమ్మ, తదితరులు పాల్గొన్నారు. 

 భారత్‌ బంద్‌ వాల్‌పోస్టర్‌ విడుదల 

వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 27న నిర్వహించనున్న భారత్‌ బంద్‌ను పురస్కరించుకుని వెంకయ్య వాల్‌పోస్టర్‌ విడుదల చేశారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అన్నదాతలకు అనుకూలంగా చేపడుతున్న ఈ భారత్‌ బంద్‌ లో రాజకీయాలకు అతీతంగా ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని వెంకయ్య కోరారు.  

బుచ్చిరెడ్డిపాళెం : దేశ వ్యాప్తంగా ఉన్న  స్కీమ్‌ వర్కర్లను రెగ్యులర్‌ చేయాలని బుచ్చి సీఐటీయూ మండల కార్యదర్శి  చల్లకొలుసు మల్లికార్జున డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం తహసీల్దారు కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఆటో యూనియన్‌ నాయకులు నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దారు హమీద్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం బస్టాండ్‌ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ కొవిడ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో   ప్రజలకు అందుబాటులో ఉండి, ఇంటింటికి వెళ్లి సేవలందిస్తే ప్రభుత్వం వారిని కనీసం ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా కూడా గుర్తించకపోవడం విచారకరమన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు మునీర్‌ అహ్మద్‌,  శ్రీనివాసులు,  జానీబాషా, అంగన్‌వాడీ నాయకులు శేషమ్మ, పద్మలత, కేవీ. శేషమ్మ,  అనీలమ్మ,  మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.