ఎస్‌ఈసీగా నిమ్మగడ్డకు ‘నై’

ABN , First Publish Date - 2020-05-31T08:27:57+05:30 IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ‘స్వీయ పునరుద్ధరణ’ చెల్లదని అడ్వొకేట్‌ జనరల్‌ సుబ్రహ్మణ్యం శ్రీరామ్‌ తెలిపారు. ఆయనను ఎస్‌ఈసీగా కొనసాగించాలని చెప్పినప్పటికీ... తక్షణం బాధ్యతలు

ఎస్‌ఈసీగా నిమ్మగడ్డకు ‘నై’

  • ఆయన స్వీయ పునరుద్ధరణ చెల్లదు.. 
  • బాధ్యతలు చేపట్టడం చట్టవిరుద్ధం
  • ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాత్రమే తీర్పు.. 
  • పెండింగ్‌లో ‘యాక్షన్‌’
  • జస్టిస్‌ కనగరాజ్‌ నియామకం చెల్లదంటే, నిమ్మగడ్డ నియామకమూ చెల్లదు
  • తీర్పుపై సందిగ్ధతలు ఉన్నాయి.. 
  • అందుకే సుప్రీంకు వెళుతున్నాం: ఏజీ
  • అసాధారణ రీతిలో మీడియా ముందుకు అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌


అమరావతి, మే 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ‘స్వీయ పునరుద్ధరణ’ చెల్లదని అడ్వొకేట్‌ జనరల్‌ సుబ్రహ్మణ్యం శ్రీరామ్‌ తెలిపారు. ఆయనను ఎస్‌ఈసీగా కొనసాగించాలని చెప్పినప్పటికీ... తక్షణం బాధ్యతలు స్వీకరించాలని హైకోర్టు తన తీర్పులో చెప్పలేదన్నారు. అలా బాధ్యతలు తీసుకోవడం చట్ట విరుద్ధమే అవుతుందని తెలిపారు. అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ అసాధారణ రీతిలో శనివారం రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌, పంచాయతీరాజ్‌ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది కూడా పాల్గొన్నారు. శుక్రవారం హైకోర్టు ఇచ్చిన తీర్పునకు ఏజీ వివరణ ఇచ్చారు. ‘‘జస్టిస్‌ కనగరాజ్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించిన ఉత్తర్వును హైకోర్టు కొట్టివేసింది. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి... రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్‌ఈసీని నియమించేందుకు అర్హతలను నిర్దేశించే అధికారం ఉందా? రెండు... ఆ అధికారం రాష్ట్రానికి ఉంటే, దానిని గవర్నర్‌ వినియోగించుకునేటప్పుడు సీఎం లేదా మంత్రివర్గ సలహాను పాటించాల్సిన అవసరం ఉందా? పంచాయతీరాజ్‌ సెక్షన్‌ 200 ఒక ప్రిన్సిపల్‌ సెక్రటరీ స్థాయి అధికారిని ఎస్‌ఈసీగా నియమించాలని చెబుతోంది. అయితే... 243కె(2) ఆర్టికల్‌ మేరకు రాష్ట్రానికి ఆ అధికారం లేదని కోర్టు తీర్పు చెప్పింది. 


అంటే... సెక్షన్‌ 200 ప్రకారం నియమితులైన వారు ఎస్‌ఈసీ పదవిలో ఉండేందుకు అర్హులు కారని తెలిపింది. ఈ తీర్పు గతకాలానికీ, భవిష్యత్తుకూ వర్తిస్తుంది. దీనిప్రకారం... జస్టిస్‌ కనగరాజ్‌ నియామకం చెల్లకపోతే, 2016లో నిమ్మగడ్డ నియామకం కూడా చెల్లదు. ఇప్పుడు హైకోర్టు తీర్పు కొత్త విధానానికి తెరతీసిందన్నారు. ఇలాంటి సందిగ్ధత ఉన్నందునే నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అంశంపైనా, జస్టిస్‌ కనగరాజ్‌ను ఎస్‌ఈసీగా నియామకాన్ని సమర్థించుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నామని ఏజీ చెప్పారు.  హైకోర్టు తీర్పు వెలువరించిన సమయంలోనే.. తీర్పు అమలుపై స్టే ఇవ్వాలని మౌఖికంగా కోరేందుకు సిద్ధమయ్యాం. కానీ, వీడియో కాన్ఫరెన్సింగ్‌లో సాంకేతికపరమైన లోపాలు తలెత్తడం వల్ల న్యాయమూర్తులకు చెప్పలేకపోయాం’’ అని తెలిపారు. ఆ తర్వాత... హైకోర్టులో స్టే పిటిషన్‌ దాఖలు చేశామన్నారు. స్టే పిటిషన్‌ కాపీని నిమ్మగడ్డ తరఫు న్యాయవాదికి అందజేశామన్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదీలకు వివరించానని చెప్పారు. ‘‘ఎస్‌ఈసీ విషయంలో హైకోర్టు ఆదేశాలు ప్రభుత్వానికి చెంపపెట్టుగా కొందరు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. ఇదే సమయంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పరిగణనలోనికి తీసుకుంటుంది’’ అని తెలిపారు.


ప్రభుత్వం చర్యలు తీసుకున్నాకే...

ఎస్‌ఈసీ పునఃనియామకంపై చర్యలు తీసుకోవాలని మాత్రమే హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిందని ఏజీ శ్రీరామ్‌ చెప్పారు. ‘‘శుక్రవారం ఉదయం 11 గంటలకు తీర్పు వెలువడింది. మధ్యాహ్నం 3.30 గంటలకు న్యాయస్థానం ఆదేశాల మేరకు ఎస్‌ఈసీగా తాను తిరిగి బాధ్యతలు స్వీకరించానంటూ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ సమాచారం పంపారు. ఈ మేరకు సర్క్యులర్‌ జారీ చేయాలని జస్టిస్‌ కనగరాజ్‌కు కూడా సూచించారు. హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయానికి వాహనాలు పంపాలన్నారు. ఇవన్నీ చూస్తుంటే... న్యాయస్థానం తీర్పులో స్వీయ పునరుద్ధరణ చేసుకోవచ్చని ఉందన్న అభిప్రాయానికి రమేశ్‌ కుమార్‌ వచ్చారేమో అనిపిస్తోంది. నిజానికి... ఎస్‌ఈసీ పునఃనియామక వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆ చర్యలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి’’ అని ఏజీ వివరించారు.


కౌన్సిల్‌ను దిగిపొమ్మంటూ...

శనివారం ఉదయం 11 గంటలకు ఎస్‌ఈసీ స్టాండింగ్‌ కౌన్సిల్‌ ప్రభాకర్‌కు నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఫోన్‌ చేసి రాజీనామా చేయాలన్నారని అడ్వొకేట్‌ జనరల్‌ చెప్పారు. తనకు కొంత సమయం ఇవ్వాలని కోరినా కుదరదన్నారని తెలిపారు. ఎస్‌ఈసీ స్టాండింగ్‌ కౌన్సిల్‌లో కొత్తరక్తం ఎక్కించాల్సి ఉందన్నట్లుగా రమేశ్‌ కుమార్‌ మాట్లాడారన్నారు. ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్తున్నందున కొంత కాలం ఆగాలని ప్రభాకర్‌ను కోరామని తెలిపారు. రమేశ్‌ కుమార్‌ స్వీయపునరుద్ధరణ చెల్లదని, అందువల్ల ఆయన ఆదేశాలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.

Updated Date - 2020-05-31T08:27:57+05:30 IST