అవినీతిలో స్పెషల్‌...!

ABN , First Publish Date - 2021-10-20T04:41:01+05:30 IST

మద్యం, గంజాయి, ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాల్సిన ఎస్‌ఈబీ(స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో)కి అవినీతి చెదలు పట్టింది.

అవినీతిలో స్పెషల్‌...!

ఎస్‌ఈబీ రూటుమారే!

స్టేషన్లలో దసరా మాముళ్లు గోల

ఇసుక వ్యాపారం చేస్తున్న ప్రత్యేకాధికారి

అక్రమ వ్యాపారంపై నిఘా కొదువ

విచ్చలవిడిగా మద్యం బెల్ట్‌ విక్రయాలు


-తీరప్రాంతంలో ఉన్న ఓ సర్కిల్‌లో ఇసుక వ్యాపారులు, నాటుసారా రవాణాదారులు అధికంగా ఉంటారు. వారి వద్ద దసరా మాముళ్లు వసూలు చేసిన సిబ్బందిని ఓ అధికారి ప్రశ్నించడంతో ఆయనకు ఎదురుతిరిగారు. దీనిపై స్టేషన్‌లో రాద్ధాంతం జరిగింది. ‘మీరు నెల మామూళ్లు తీసుకుంటారు. మరి మా సంగతేమిటీ’ అని సిబ్బంది నిలదీసినట్లు సమాచారం. ఈ వ్యవహారం పైస్థాయికి వెళ్లడంతో వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని అంతా సర్దుబాటు చేశారు. 


- అద్దంకి మండలంలోని సజ్జాపురంలో మద్యం అక్రమ నిల్వలను పట్టుకునేందుకు ఇటీవల ఎస్‌ఈబీ అధికారులు పక్కా సమాచారం మేరకు దాడులకు వెళ్లారు. తనిఖీలకు వచ్చిన సిబ్బందే అధికారులను తప్పుదోవ పట్టించారనే ఆరోపణలున్నాయి. భారీగా నిల్వలు ఉన్న ఇంటిని వదిలేసి మరో చోట కేవలం 7 బాటిళ్లు నిల్వ ఉంచిన వ్యక్తిని పట్టుకున్నారు.


- కొండపి ప్రాంతంలోని దాబాలలో మద్యం అక్రమ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గోవా, కర్ణాటక నుంచి తెచ్చిన బాటిళ్లను బహిరంగంగానే అమ్ముతున్నారు. వాటిని మందుబాబులు అక్కడే తాగుతున్నారు. అయినా కన్నెత్తి చూసే అధికారి ఎవరూ లేరు. కాగా సెబ్‌లో ప్రత్యేకంగా పనిచేసే ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారే ఇసుక వ్యాపారం చేస్తున్నట్లు ప్రచారం ఉంది.


- ఇవి జిల్లాలో అక్రమ రవాణాను అడ్డుకోవడం కోసం ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అవినీతి పుట్టలు. అక్రమాలను అడ్డుకోవడం ఏమో కానీ సిబ్బందే ఆ బాట పట్టినట్లున్నారు. వారికి కొన్నిచోట్ల అధికారపార్టీ నేతల అండ ఉండగా, కొన్నిచోట్ల అధికారుల సహకారం ఉందనే ఆరోపణలున్నాయి. ఇందుకు జిల్లాలో భారీగా తరలిపోతున్న ఇసుక.. ఎక్కడ చూసినా బెల్టుషాపుల జోరు.. మద్యం అక్రమ విక్రయాలు.. గుప్పుమంటున్న నాటుసారా..దాబాలలో పారుతున్న పరాయి మద్యమే నిదర్శనం.


ఒంగోలు(క్రైం), అక్టోబరు 19 : మద్యం, గంజాయి, ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాల్సిన ఎస్‌ఈబీ(స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో)కి అవినీతి చెదలు పట్టింది. రాష్ట్రప్రభుత్యం ఎక్సైజ్‌ శాఖను రెండు ముక్కలుగా చేసి కేవలం అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ఎస్‌ఈబీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అందుకు విరుద్ధంగా వారి వ్యవహారాలు ఉన్నాయి. మేము మారం అన్నట్లుగా అధికారులు, సిబ్బంది అవినీతి ఊబిలో కూరుకుపోయి తిరిగి పాత పద్ధతులకు తెరలేపారు. దీంతో ఇసుక అక్రమ రవాణా, మద్యం తరలింపు జోరుగా సాగుతోంది. మాముళ్ల మత్తులో ము నిగిపోయి అక్రమార్కుల దందాలకు పచ్చజెండా ఊపారు. కొన్నిచోట్ల అధికారులను సైతం లెక్కచేయకుండా సిబ్బందే వసూళ్లకు పాల్పడుతుండడం గమనార్హం. దీంతో స్టేషన్లలో విభేదాలు నెలకొంటున్నాయి. గతంలో ఇదేవిధంగా యర్రగొండపాలెం స్టేషన్‌లో అక్రమ ఆర్జన పంపకాల విషయలో గొడవలు పడిన సిబ్బంది రచ్చకెక్కారు. అదేవిధంగా పొదిలిలో కల్లుగీత కార్మికుల వద్ద లంచం తీసుకుంటూ ఎస్‌ఈబీ ఇన్‌స్పెక్టర్‌ ఏసీబీకి పట్టుబడ్డారు. ఇలా అనేక ఘటన లు చోటుచేసుకున్నాయి. తాజాగా మద్యం బెల్ట్‌షాపు ల నిర్వాహకుల వద్ద వాటాలు మాట్లాడుకున్న సిబ్బం ది తనిఖీల సమయంలో వారికి ముందస్తు సమాచా రం ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల తీర ప్రాంతంలోని ఓ స్టేషన్‌ సిబ్బంది దసరా మామూళ్ల పంచాయితీ రచ్చకెక్కింది. 


ఎస్‌ఈబీ స్టేషన్లలో దసరా మాముళ్ల గోల

ఇటీవలి దసరా పండగ సందర్భంగా జిల్లాలో కొం తమంది సిబ్బంది మాముళ్ల వసూళ్లకు సిద్ధపడ్డారు. ముఖ్యంగా తీర ప్రాంతంలోని ఓ స్టేషన్‌ పరిధిలో ఒకరిద్దరు సిబ్బంది వసూళ్లకు తెరతీయగా, దానిని అధికారులు ప్రశ్నించారు. దీంతో వారు ఎదురుతిరిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సిబ్బంది, అధికారుల మధ్య వివాదాలు నెలకొన్నాయి. ఈ విషయం తెలిసి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఉన్న ఎస్‌ఈబీ సిబ్బంది దసరా పేరుతో వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. ముఖ్యంగా ఇసుక, మద్యం అక్రమ వ్యాపారులు లక్ష్యంగా కొందరు బలవంతంగా వసూళ్ల పర్వానికి తెరతీశారు. ట్రాక్టర్‌కు రూ.1500, టిప్పర్‌కు రూ.5వేల చొప్పున తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారం దాదాపు అన్ని ప్రాంతాల్లో గుట్టుగా నడిచింది. ఒకటి, రెండుచోట్ల సిబ్బంది మధ్య వ చ్చిన వి భేదాలతో బయటికొచ్చింది. దీంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తీవ్రస్థాయిలోహెచ్చరికలు చేసినట్లు సమాచారం.


యథేచ్ఛగా మద్యం అక్రమ వ్యాపారం

మద్యం ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చి నిల్య ఉంచి వ్యాపారం చేయడం జిల్లాలో ఎక్కువైంది. ఇటీవల కందుకూరు ప్రాంతంలో భారీగా మద్యం నిల్వలు ఎస్‌ఈబీ అధికారులకు పట్టుబడటం అందుకు నిదర్శనం. తెలంగాణ నుంచి ట్రావెల్స్‌ బస్సుల్లోనూ మద్యం వచ్చేస్తోంది. వాటిని గుట్టుగా అమ్ముతున్నారు. అలాగే తెలిసిన దాబాలలోనూ విక్రయిస్తున్నారు. అదేవిధంగా కంటైనర్లు, కార్లలో ఇతర రాష్ట్రాల మద్యం జోరుగా వస్తోంది. అక్రమ రవాణాదారులతో చేతులు కలిపిన కొందరు సిబ్బంది ఎక్కడెక్కడ తనిఖీలు చేయనున్నారో అక్రమార్కులకు ముందుగానే సమాచారాన్ని పంపిస్తున్నారు. సరుకు పక్కకు తప్పించిన తర్వాత వారి వద్ద భారీఎత్తున దండుకుంటున్నారు. దీంతో మద్యం అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.


ప్రత్యేకాధికారే ఇసుక వ్యాపారం

ఎస్‌ఈబీలో పనిచేస్తున్న ఓ అధికారి నేరుగా రంగంలోకి దిగి ఇసుక వ్యాపారం చేస్తున్నారు. తన బంధువుల పేరుతో రెండు టిప్పర్లు, నాలుగు ట్రాక్టర్లు నడుపుతున్నారు. చీమకుర్తి, జరుగుమల్లి ప్రాంతాల నుంచి ఇసుకను ఆ వాహనాల ద్వారా తరలిస్తూ అమ్ముకుంటే లక్షలు పోగేసుకుంటున్నారు. గతంలో అనేకమార్లు ఆ వాహనాలపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయనే పర్యవేక్షణాధికారి కావడంతో కంచే చేను మేసినట్లుగా పరిస్థితి తయారైంది. 


ఎక్కడచూసినా బెల్ట్‌ దుకాణాలు

జిల్లాలో బెల్టు దుకాణాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ప్రభుత్వ దుకాణాల వద్ద మద్యం కొనుగోలు చేసిన కొందరు మొబైల్‌ విక్రయాలు చేస్తుండగా, మరికొందరు బెల్ట్‌ దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి వారి వద్ద వాటాలు తీసుకుంటున్న సిబ్బంది అధికారుల దాడుల విషయాన్ని చేరవేస్తున్నారు. అధికారులు చేసేదేమీ లేక అరకొరగా దొరికిన బాటిళ్లు చూపించి కేసును మమ అనిపిస్తున్నారు. 

Updated Date - 2021-10-20T04:41:01+05:30 IST