యూజీ, పీజీ కోర్సుల్లో స్థానికేతరులకు 20% కోటా..

ABN , First Publish Date - 2022-05-17T16:30:36+05:30 IST

రాష్ట్రంలోని పీజీ, యూజీ కోర్సుల్లో స్థానికేతరులకు మరిన్ని సీట్లు దక్కనున్నాయి. ఇంటిగ్రేషన్‌ కోటా కింద ఇప్పటి వరకూ ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల వారికి కేటాయిస్తున్న 5 శాతం సీట్లు ఇక నుంచి 20 శాతానికి పెరగనున్నాయి. డిగ్రీ కోర్సుల్లోనూ ఫ్రెంచ్‌ వంటి...

యూజీ, పీజీ కోర్సుల్లో స్థానికేతరులకు 20% కోటా..

విదేశీయులు, ఇతర రాష్ట్రాల వారికి పెరగనున్న సీట్లు

ఇంటర్మీడియట్‌లో మార్కుల ఆధారంగా డిగ్రీలో ప్రవేశం

యూనివర్సిటీల్లో ప్రవేశానికి సీపీ గేట్‌ ద్వారా అవకాశం

అన్ని విశ్వవిద్యాలయాల్లో కామన్‌ క్యాలెండర్‌ అమలు

ఏ డిగ్రీ చేసినా అన్ని పీజీ కోర్సుల్లో చేరేందుకు చాన్స్‌

డిగ్రీ కోర్సుల్లో అందుబాటులోకి మరిన్ని విదేశీ భాషలు

జీరో అడ్మిషన్లున్న కాలేజీలు, కోర్సులు ఇక మూత

వైస్‌ చాన్సలర్ల సమావేశంలో కీలక నిర్ణయాలు

ఉన్నత విద్యా మండలి వెబ్‌సైట్‌ 27 భాషల్లో 


హైదరాబాద్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పీజీ, యూజీ కోర్సుల్లో స్థానికేతరులకు మరిన్ని సీట్లు దక్కనున్నాయి. ఇంటిగ్రేషన్‌ కోటా(Integration‌ quota) కింద ఇప్పటి వరకూ ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల వారికి కేటాయిస్తున్న 5 శాతం సీట్లు ఇక నుంచి 20 శాతానికి పెరగనున్నాయి. డిగ్రీ కోర్సుల్లోనూ ఫ్రెంచ్‌ వంటి పలు విదేశీ భాషలు అందుబాటులోకి రానున్నాయి. వరుసగా మూడేళ్లపాటు జీరో అడ్మిషన్లు ఉన్న కాలేజీలు మూతపడనున్నాయి. జీరో అడ్మిషన్లు(Zero admissions) ఉన్న కోర్సులు కూడా రద్దుకానున్నాయి. అన్ని యూనివర్సిటీల్లో కామన్‌ క్యాలెండర్‌ అమలు కానుంది. ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి అధ్యక్షతన సోమవారం జరిగిన యూనివర్సిటీల వైస్‌ చాన్సలర్ల సమావే శంలో ఈ మేరకు నిర్ణయించారు. ఇందులో పలు అంశాలపై చర్చించారు. అనేక నిర్ణయాలను తీసుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ విద్యార్థులను రాష్ట్రానికి రప్పించడం, వర్సిటీల్లో చదివేలా ప్రోత్సహించడమే ధ్యేయంగా స్థానికేతరులకు 20 శాతం సీట్లను కేటాయించాలని నిర్ణయించారు. కొత్తగా అందుబాటులోకి రానున్న 15 శాతం సీట్లను సూపర్‌ న్యూమరరీ కోటా కింద పెంచనున్నారు. ఇంటర్మీడియట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా డిగ్రీలో ప్రవేశం కల్పిస్తారు. వర్సిటీల్లో సీట్లు పొందాలనుకునే అభ్యర్థులను సీపీ గేట్‌ ద్వారానే ఎంపిక చేస్తారు. వర్సిటీలు నిర్దేశించిన ఫీజులను అభ్యర్థులు చెల్లించాల్సి ఉంటుంది. వీరికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌(Fee Reimbursement‌) వర్తించదు. హైదరాబాద్‌లో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ విద్య, ఉద్యోగాల కోసం పెద్ద ఎత్తున దేశ, విదేశాల నుంచి వస్తున్నారు. ఇక్కడే చదువు పూర్తి చేసుకుని, ఇక్కడే ఉద్యోగం చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే, ఇంటిగ్రేషన్‌ కోటాను పెంచాలని నిర్ణయించారు. సంబంధిత సమాచారం విద్యార్థులకు చేరడానికి ఉన్నత విద్యా మండలి వెబ్‌సైట్‌ను 27 భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉస్మానియా వర్సిటీ వెబ్‌సైట్‌లో కూడా దీనిని ఉంచనున్నారు.


డిగ్రీ ఏదైనా అన్ని పీజీ కోర్సుల్లో చేరొచ్చు

రాష్ట్రంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ (పీజీ) కోర్సుల నిర్వహణలో భారీ మార్పులను తీసుకొచ్చారు. ఇందులో భాగంగా డిగ్రీలో ఏ సబ్జెక్టులో చదివినా పీజీలో ఏ కోర్సులోనైనా చేరవచ్చు. ప్రస్తుతానికి ఏ డిగ్రీ చేసినా ఇస్లామిక్‌, జర్నలిజం, లైబ్రరీ సైన్స్‌, ఫిలాసఫీ, సామాజిక శాస్త్రం వంటి కోర్సుల్లో చేరడానికే అవకాశం ఉంది. ఇక నుంచి పొలిటికల్‌ సైన్స్‌, చరిత్ర, పబ్లిక్‌ అడ్మినిస్ర్టేషన్‌, కామర్స్‌, ఇంగ్లీషు, తెలుగు వంటి అన్ని రకాల పీజీ కోర్సుల్లో చేరడానికి అర్హులుగా నిర్ణయించారు. తద్వారా ఇంజనీరింగ్‌ చేసిన విద్యార్థులు కూడా అన్ని పీజీ కోర్సుల్లో చేరడానికి అర్హులవుతారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలోని 6 వర్సిటీల్లో అమలు పరచనున్నారు. కొత్త విద్యా సంవత్సరం నుంచే ఈ విధానం అమల్లోకి రానుంది. నిజానికి, పీజీలో ఏ కోర్సులో చేరాలన్నా సంబంధిత సబ్జెక్టులో 40 శాతం మార్కులు రావడం తప్పనిసరి. ఇప్పుడు ఒక సబ్జెక్టు నుంచి మరొక సబ్జెక్టుకు మారుతున్నారు కనక.. పీజీలో ఏ కోర్సులో చేరాలన్నా సంబంధిత సబ్జెక్టులో సీపీ గేట్‌ ఎంట్రన్స్‌లో ర్యాంకు రావడం తప్పనిసరి. ఈ విధానం ఇప్పటికే సెంట్రల్‌ యూనివర్సిటీల పరిధిలో అమల్లో ఉంది. దీనిని రాష్ట్రంలో కూడా అమలు చేయాలని నిర్ణయించారు. కాగా, కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సీపీ గేట్‌)ను ఈ ఏడాది కూడా ఉస్మానియా యూనివర్సిటీయే నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను నెలాఖరులో జారీ చేయనున్నారు.


డిగ్రీ కోర్సుల్లోనూ విదేశీ భాషలు

డిగ్రీ కోర్సుల్లో మరిన్ని విదేశీ భాషలను ప్రవేశపెట్టాలని వీసీల సమావేశంలో నిర్ణయించారు. ఫ్రెంచ్‌, జర్మన్‌, అరబిక్‌, జపనీస్‌, స్పానిష్‌, చైనీస్‌ వంటి వాటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటిని రెండో భాషగా ప్రవేశపెట్టనున్నారు. ఇక, న్యాక్‌ గుర్తింపు పొందిన కాలేజీలు, అటానమస్‌ కాలేజీల్లో అకడమిక్‌ క్రెడిట్‌ బ్యాంక్‌ (ఏబీసీ)ని అమలు చేయనున్నారు. ఇందుకు యాక్షన్‌ ప్లాన్‌ను సిద్ధం చేయాలని ఉస్మానియా, కాకతీయ వర్సిటీలను ఆదేశించారు. డిగ్రీలో కొన్ని సబ్జెక్టులను మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సెస్‌ (మూక్స్‌) ద్వారా పూర్తి చేసే అవకాశముండగా.. తాజాగా వాటిని దూరవిద్య ద్వారా సైతం అనుమతించాలని నిర్ణయించారు. డిగ్రీ కాలేజీలు న్యాక్ గుర్తింపు సాధించేలా అవగాహన కల్పించేందుకు ఈనెల 20న హైదరాబాద్‌లో ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-05-17T16:30:36+05:30 IST