Abn logo
Feb 28 2021 @ 09:21AM

అమిత్‌షా చెంతకు అన్నాడీఎంకే కూటమి ‘సీట్ల పంచాయతీ’

పీఎంకేకు 23 స్థానాలు ఖరారు 

డీఎండీకేతోనూ చర్చలు షురూ

చెన్నై(ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకేలో సీట్లసర్దుబాటు పంచాయతీ బీజేపీ అగ్రనేత, కేంద్రహోంమంత్రి అమిత్‌షా చెంతకు చేరింది. ఇప్పటివరకూ సీట్ల సర్దుబాటుపై రాష్ట్ర నేతలతో మంతనాలు జరిపిన అన్నాడీఎంకే అధిష్ఠానం శనివారం జాతీయనాయకత్వంతో చర్చలు జరిపింది. కనీసం 60 స్థానాలు కావాలని బీజేపీ నేతలు మొదటి నుంచి కోరుతుండగా, 22 స్థానాలు ఇచ్చేందుకు అన్నాడీఎంకే సుముఖత వ్యక్తం చేసింది. ఏప్రిల్‌ 6వ తేదీన జరుగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు కేంద్రమంత్రులు, బీజేపీ తమిళనాడు ఎన్నికల ఇన్‌చార్జులు కిషన్‌రెడ్డి, వీకే సింఘ్‌, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తమిళనాడు బీజేపీ ఇన్‌చార్జి సీటీ రవి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.మురుగన్‌ శనివారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వంతో భేటీ అయ్యారు. సీఎం నివాసానికి వెళ్లిన బీజేపీ నేతలు ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. మొత్తం 234 సీట్లకు గాను తమకు కనీసం 60 సీట్లు కావాలని బీజేపీ నేతలు చాలాకాలంగా కోరుతున్నారు. అయితే 22 స్థానాలు ఇచ్చేందుకు అన్నాడీఎంకే సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం.


అయితే ఈ భేటీ అనంతరం అన్నాడీఎంకే ఉద్దేశాన్ని బీజేపీ సీనియర్‌ నేత, కేంద్రహోంమంత్రి అమిత్‌షాకు కూడా తెలపాలని నిర్ణయించారు. కాగా, ఆదివారం పుదుచ్చేరి, తమిళనాడులో జరుగనున్న పార్టీ బహిరంగ సభల్లో పాల్గొనేందుకు శనివారం అర్ధరాత్రి కేంద్ర మంత్రి అమిత్‌షా చెన్నైకి చేరుకోగా, విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, వీకే సింగ్‌, రాష్ట్ర ఇన్‌ఛార్జి సీటీ రవి, రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్‌ స్వాగతం పలికారు. వీరు అన్నాడీఎంకే కూటమి, పార్టీల బలాబలాలు, పార్టీ పోటీచేసే సీట్లు తదితరాలపై అమిత్‌షాకు వివరించినట్లు సమాచారం. ఆయన అభిప్రాయం మేరకే తగిన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. మరో వైపు సీనియర్‌ నటుడు విజయకాంత్‌ నేతృత్వంలోని డీఎండీకే పార్టీతోనూ అన్నాడీఎంకే నేతలు శనివారం రాత్రి కీలక చర్చలు జరిపారు. మంత్రులు తంగమణి, వేలుమణి, పార్టీ ఉపసమన్వయకర్త మునుస్వామి విజయకాంత్‌తో భేటీ అయి సీట్ల సర్దుబాటుపై చర్చించారు. అయితే ఆ సమయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమలత లేకపోవడంతో మరోమారు భేటీ కావాలని నిర్ణయించారు. 


పీఎంకేకు 23 స్థానాలు

అన్నాడీఎంకే కూటమిలో పాట్టాలి మక్కల్‌ కట్చి (పీఎంకే)కి  23 శాసనసభ స్థానాలను కేటాయించినట్టు ఉపముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం అధికారపూర్వకంగా ప్రకటించారు. శనివారం స్థానిక రాజాఅన్నామలైపురంలోని లీలా ప్యాలెస్‌లో అన్నాడీఎంకే, పీఎంకేల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు కొలిక్కివచ్చాయి. అన్నాడీఎంకే తరఫున ఆ పార్టీ సమన్వయకర్త, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, ఉప సమన్వయకర్త, ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, సీనియర్‌ నేతలు కేపీ మునుస్వామి, పొల్లాచ్చి జయరామన్‌, మంత్రులు తదితరులు చర్చల్లో పాల్గొన్నారు. అదే విధంగా, పీఎంకే అధ్యక్షుడు జీకే మణి, పార్లమెంటు సభ్యుడు డా.అన్బుమణి రాందాస్‌, కేంద్ర మాజీ మంత్రి ఏకే మూర్తిలు పాల్గొన్నారు.


సుమారు 30 నిముషాల పాటు జరిగిన చర్చల అనంతరం ఉప ముఖ్యమంత్రి ఓపీఎస్‌, తమ కూటమిలో ఉన్న పీఎంకేకు 23 సీట్లు కేటాయించామని, ఆ పార్టీ ఏయే నియోజకవర్గంలో పోటీచేయాలనుకున్న వివరాలు త్వరలో చర్చించి వెల్లడిస్తామని తెలిపారు. ఈ రెండు పార్టీలకు సంబంధించిన ఒప్పందపత్రాల్లో ఓపీఎస్‌, ఈపీఎస్‌, పీఎంకే వ్యవస్థాపకుడు డా.రాందాస్‌, జీకే మణిలు సంతకాలు చేశారు. సీట్ల కేటాయింపుపై అన్బుమణి రాందాస్‌ మీడియాతో మాట్లాడుతూ... 20 ఏళ్ల తరువాత మళ్లీ అన్నాడీఎంకేతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని తెలిపారు. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేశామని, మళ్లీ ఇన్నాళ్లకు అది సాధ్యమైందని వివరించారు. వన్నియర్లకు అంతర్గత రిజర్వేషన్‌ కల్పించాలన్న 40 ఏళ్ల కోరికను అన్నాడీఎంకే ప్రభుత్వం నెరవేర్చేందుకు ముందుకొచ్చినందునే తక్కువ సీట్లతోనే సర్దుకుంటున్నామని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement