‘ముంపు’లో సీజనల్‌ ముప్పు

ABN , First Publish Date - 2022-08-06T06:07:03+05:30 IST

‘ముంపు’లో సీజనల్‌ ముప్పు

‘ముంపు’లో సీజనల్‌ ముప్పు

వరద ప్రభావిత ప్రాంతాల్లో వ్యాధుల భయం

ఇప్పటికే ప్రబలుతున్న మలేరియా, డెంగ్యూ 

వర్షాలు, మళ్లీ వరద హెచ్చరికలతో మరింత ఆందోళన

భద్రాచలం, ఆగస్టు 5 : ఊహించని విధంగా సుమారు 20రోజుల క్రితం రికార్డుస్థాయిలో వచ్చిన వరదతో అతలాకుతమైన భద్రాద్రి జిల్లాలోని గోదావరి పరివాహక ప్రజలు.. ప్రస్తుతం సీజనల్‌ వ్యాధుల భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. వరదల అనంతరం.. ఇటీవల భద్రాచలం ఏజెన్సీకి చెందిన వారు మలేరియా, డెంగ్యూ, తదితర సీజనల్‌ వ్యాధుల బారిన పడి ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యశాలలను ఆశ్రయించి చికిత్స పొందుతున్నారు. గోదావరి వరదల అనంతరం ఈ పరిస్థితి ఏర్పడిందని వైద్య వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. ఇటీవల ముంపు ప్రాంతాల్లో పారిశుధ్య పనుల నిర్వహణకు వివిధ జిల్లాల నుంచి 4,100 మంది సిబ్బందిని తీసుకురావడంతో కొంత మేర సీజనల్‌ వ్యాధుల ప్రమాదం నుంచి తప్పించుకున్నట్టు తెలుస్తోంది. లేదంటే చాలా ఇబ్బందికర పరిస్థితి ఉండేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 


రాష్ట్రంలోనే మలేరియాలో జిల్లా ప్రథమం

మలేరియా కేసుల నమోదులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో ఉందని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 168 మలేరియా కేసులు నమోదవగా.. గతేడాది ఇదే సమయంలో 210 కేసులు ఉన్నాయి. ఈ సారి ఆ సంఖ్య తగ్గినా రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో ఉండటంతో నియంత్రణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని వైద్యఆరోగ్యశాఖ మంత్రి టి.హరీ్‌షరావు జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కలెక్టర్‌ అనుదీప్‌ కూడా మలేరియా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై వైద్యఆరోగ్యశాఖ అధికారులతో కీలక సమీక్ష నిర్వహించి జిల్లాలోని 29పీహెచసీల పరిధిలో మలేరియా అదుపునకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే వైద్యఆరోగ్య శాఖ పరిధిలోని మలేరియా విభాగం ఆధ్వర్యంలో దోమల నివారణకు ఫాగింగ్‌, మురికి గుంతల్లో ఆయిల్‌బాల్స్‌, సిమోఫాస్‌, డిప్లూబెంజరన పౌడరు వేయడం, గంబూషియా చేపలను వదిలినట్టు అధికారులు తెలిపారు. ఇక  కలెక్టర్‌ ఆదేశాల మేరకు నీట మునిగిన 125 గ్రామాల్లో దోమల మందు పిచికారీ చేశామని, జూలై నెలలో 20,365 మంది జ్వర పీడితులకు రక్త పరీక్షలు నిర్వహించగా 53మలేరియా కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. అయితే గోదావరి పరివాహకంలోని అశ్వాపురం, మణుగూరు, చర్ల తదితర మం డలాల్లో ఈ కేసులు నమోదవుతున్న ట్లు తెలుస్తుండగా ఈనెల 5వ తేదీ వరకు వెయ్యిమందికి పైగా జ్వర పీడితులు నమోదవగా మూడు మలేరియా కేసులు నమోదయ్యాయి. 


ఏరియా వైద్యశాలలో రోజుకు 15 మంది ఇనపేషెంట్లు..

వర్షాలు, వరదలతో భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో జ్వరాల తీవ్రత గతంతో పోలిస్తే అధికమైంది. భద్రాచలం ఏరియా వైద్యశాలకు రోజుకు సుమారు 500మంది రోగులు వస్తుండగా వారిలో 60శాతంపైన జ్వర పీడితులే ఉంటున్నారు. ఇందులో 10 నుంచి 15మంది ఇనపేషెంట్లుగా చేరుతున్నారని వైద్యులు చెబుతున్నారు. వీరిలో వైరల్‌ ఫీవర్స్‌, ప్లేట్‌లెట్లు తగ్గడం, మలేరియా, డెంగ్యూ సమస్యలతో బాధపడుతున్న వారున్నారు. భద్రాచలం ఏరియా వైద్యశాలలో జూలై 20 నుంచి ఆగస్టు 4 వరకు 80మంది జ్వరపీడితులు చికిత్స కోసం చేరగా 12 మంది మలేరియా బాధితులున్నారు. వీరిలో తొమ్మిది మంది భద్రాచలం సరిహద్దు ఏపీలోని ముంపు మండలాలైన చింతూరు, కుక్కునూరు, వరరామచంద్రాపురం, కూనవరానికి చెందిన వారున్నారు.


భవిష్యతపై భయం

ప్రస్తుతం భద్రాద్రి ఏజెన్సీలో ఉన్న జ్వరాల తీవ్రత ఓ మోస్తరు మాత్రమేనని రాబోయే రోజుల్లో తారస్థాయికి వెళ్లే అవకాశం లేకపోలేదని వైద్యవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందుకు వరదల అనంతరం క్రమంగా జ్వర పీడితుల సంఖ్య పెరుగుతుండటమే నిదర్శనమంటున్నారు. ముఖ్యంగా సరిహద్దు ఏపీలోని ముంపు ప్రాంతాల్లో మలేరియా కేసుల సంఖ్య పెరుగుతుండటం, అక్కడి వారు భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం తదితర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు వస్తుండటంతో సైలెంట్‌ క్యారియర్‌  మలేరియా వ్యాపిస్తోందని చెబుతున్నారు. ఇక ఈనెలలో భారీ వర్షాలు ఉంటుండటం, ఇప్పటికే చాలా ప్రాంతాలు బురదమయంగా ఉండి దోమలవ్యాప్తి పెరగడం, కంపుకొడుతు న్న పరిసరాలతో పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉం దన్నభయం కనిపిస్తోంది. అయితే గోదావరికి మళ్లీ వరద ముప్పు ఉందన్న హెచ్చరికలతో మన్యం వాసులు బిక్కుబిక్కుమంటున్నారు.గోదావరి పరివాహకంలో ఆగస్టు నెల అత్యంత కీలకమైంది గత 69 ఏళ్లల్లో ఆగస్టు నెలలో 34 సార్లు గోదావరి మొదటి ప్రమాద హెచ్చరికస్థాయి దాటి ప్రవహించింది. 23 సార్లు రెండో ప్రమాద హెచ్చరిక, 17సార్లు మూడో చివరి ప్రమాద హెచ్చరిక దాటింది. ఇదే పరిస్థితి ఈ ఏడాది కూడా ఉంటే తమ పరిస్థితేంటోనని ఏజెన్సీవాసులు వణికిపోతున్నారు. ఈ క్రమంలో సీజనల్‌ వ్యా ధుల బారిన పడకుండా జాగ్రత్తలు పాటి ంచాలని వైద్యాధికారులుసూచిస్తున్నారు.





ఈ యువకుడు చర్ల మండలం తేగడ గ్రామానికి చెందిన అలవాల బసవ తారక్‌. వరదల అనం తరం జ్వరం బారిన పడి ఇతడు ఇంటి వద్దే ఆ ఆర్‌ఎంపీని ఆశ్రయించి చికిత్స పొందాడు. నాలుగు రోజులైనా జ్వరం తగ్గకపోవడం, తీవ్రత అధికం కావవంతో భద్రాచలంలోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలలో చేరాడు. పరీక్షించిన అక్కడి వైద్యులు ప్లేట్‌లెట్స్‌ తగ్గాయని గుర్తించి చికిత్స అందిస్తున్నారు. 



ఈ ఫొటోలో ఉన్నది దుమ్ముగూడెం మండలంలోని గంగోలుకు చెందిన బత్తుల అర్జున్‌. ఇతడికి వరదల అనంతరం జ్వరం రావడం, ప్లేట్‌లెట్లు తగ్గడంతో ఐదురోజులుగా భద్రాచలం ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. 



Updated Date - 2022-08-06T06:07:03+05:30 IST