మన్యంలో జ్వరాల ముసురు

ABN , First Publish Date - 2022-06-26T05:45:21+05:30 IST

చినుకుపడితే పశ్చిమ ఏజెన్సీ గిరిజనులకు వణుకు పుడుతుంది. మన్యం పడకేస్తుంది. వైరల్‌ జ్వరాలతో పాటు మలేరియా, డెంగీ, విష జ్వరాలతో ఇక్కడి ప్రజలు అల్లాడి పోతుంటారు

మన్యంలో జ్వరాల ముసురు

వర్షాకాలం వచ్చిందంటే ఏజెన్సీలో హడల్‌

సీజన్‌లో మన్యం అంతా పడకే

ఏటా వందల సంఖ్యలో జ్వర పీడితులు

ఏజెన్సీలోనే అత్యధికంగా మలేరియా కేసులు 


చినుకుపడితే పశ్చిమ ఏజెన్సీ గిరిజనులకు వణుకు పుడుతుంది. మన్యం పడకేస్తుంది. వైరల్‌ జ్వరాలతో పాటు మలేరియా, డెంగీ, విష జ్వరాలతో ఇక్కడి ప్రజలు అల్లాడి పోతుంటారు.  ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతారు. వర్షాలు ప్రారంభమయ్యాయి. ఏజెన్సీ గ్రామాల్లో పదుల సంఖ్యలో జనం వైరల్‌ జ్వరాలతో ఆసుపత్రులకు వస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది..


జంగారెడ్డిగూడెం, జూన్‌ 25 : వర్షాకాలం పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో మలేరియా, డెంగీలతో పాటు సాధారణ జ్వరాలు విజృంభిస్తాయి. ప్రతీ ఏటా వందల సంఖ్యలో మలేరియా కేసులు నమోదవు తున్నాయి. వైద్యం సకాలంలో అందకపోతే ప్రాణాలను హరించే ప్రమాదకరమైన మలేరియా జ్వరం కొండరెడ్డి, గిరిజనులకు శాపంగా మారింది. కోట్లాది రూపాయలు వెచ్చించి నివారణ చర్యలు చేపడుతున్నా మలేరియా మాత్రం ఏటా తన ప్రతాపాన్ని చూపుతూ ఏజెన్సీలోనే తిష్ట వేస్తుంటుంది. ఏజెన్సీలో మలేరియా మహమ్మారిపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం


 133 మలేరియా ప్రభావిత గ్రామాలు 

ఏలూరు జిల్లాలో మొత్తం 63 పీహెచ్‌సీలు ఉండగా వాటిలో పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని బుట్టాయిగూడెం, పోలవరం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండ లాల్లో 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు) ఉన్నాయి. వీటిలో బుట్టాయిగూడెం, పోలవరం గ్రామాల్లో సామాజిక కేంద్రాల ద్వారా వైద్యసేవలు అందిస్తున్నారు. ఏజెన్సీలోని ఈ 5 మండలాల్లో 133 మలేరియా ప్రభావిత గ్రామాలను గుర్తించారు. బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల్లో మలాఽథియాన్‌ స్పేయింగ్‌ మొదటి విడత పూర్తయింది. రెండవ విడత జూలై 14 నుంచి ప్రారంభం కానుంది. మలాఽథియాన్‌ మూడు విడతలుగా పిచికారీ చేస్తారు. అలాగే కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఏసీఎంను రెండు రౌండ్‌లలో పిచికారీ చేస్తారు.


సీజనల్‌ జ్వరాలు ప్రారంభం..  

ఇటీవల వర్షాలకు సీజనల్‌ జ్వరాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రోజుకు పదుల సంఖ్యలో సీజనల్‌ జ్వరాలు వస్తున్నాయి. వీటి వల్ల ఇబ్బంది లేకపోయినా ప్రతీ ఏడాది వర్షాలు పడ్డాక ముందుగా వైరల్‌ ఫీవర్లతో ప్రారంభమై ఒక్కసారిగా మలేరియా విజృంభిస్తోంది. గత అనుభవాలు గిరిజనులను భయపెడుతున్నాయి. ప్రధానంగా అటవీ ప్రాంతంలోని వృక్షాలను, తుప్పులను, కొండవాగులు, గ్రామా ల్లోని మురికిగుంటలు, చెత్తాచెదారాల వద్ద ఈ దోమలు అధికంగా ఉంటున్నాయి. అక్కడే స్థిర నివాసాలను ఏర్పాటు చేసుకుని వృద్ధి చెందుతున్నాయి. అటవీ ప్రాంతంలోకి వెళ్లే కొండరెడ్డి, గిరిజనులకు ఈ దోమ కాటు తప్పడం లేదు. అయితే జ్వరం వచ్చినా చిన్నపాటి నీరసంగా భావించి వారు వారివారి పనుల్లో నిమగ్నమవుతుంటారు. జ్వర తీవ్రత పెరిగి లేవలేని స్థితిలో ఆసుపత్రులకు వెళ్తుంటారు. ఇదే ప్రమాదకరంగా మారుతోంది.


 పారిశుధ్య లోపం 

దోమలు వృద్ధి చెందడానికి పరిసరాల అపరిశుభ్రతే కారణమని వైద్యులు చెబుతున్నారు. కానీ వాస్తవానికి పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్యం లోపించింది. ఏజెన్సీలో డ్రైనేజీ వ్యవస్థలు లేక పంచాయతీలకు ఆదాయం తక్కువగా ఉండడం వల్ల అక్కడ పారిశుధ్య పనులు అంతంత మాత్రంగానే సాగిస్తున్నారు. పట్టణాల్లో ఇళ్ల మధ్యలో ఉండే ఖాళీ స్థలాలను దోమలు స్ధిర నివాసాలుగా ఏర్పాటు చేసు కుంటున్నాయి. ఏళ్ల పాటు అక్కడే మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలు పెరిగి పందులు అక్కడే దొర్లడంతో వ్యాధులు ప్రబలుతున్నాయిని పట్టణ ప్రజలు వాపోతున్నారు. 


నివారణ చర్యలు

ఇంటి పరిసరాలలో దోమలు పెరిగేందుకు దోహదపడే మురికి నీటి నిల్వలను తొలగించాలి. తాగి పారవేసిన కొబ్బరి బొండాలను ముక్కలుగా చేసి దూరంగా పారేయాలి. ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు, నీటి నిల్వ పాత్రలను, డ్రమ్ములను పూర్తిగా ఖాళీ చేసి శుభ్రం చేసుకోవాలి. కాల్వల్లో వ్యర్థాలు, చెత్త, చెట్ల కొమ్మలు వేయరాదు. వారానికి ఒకసారి పూలతొట్టెలు, పూల కుండీల్లో నీరు మార్చాలి. దోమలు లోపలకి రాకుండా జాగ్రత్త పడాలి. దోమతెరలు వాడాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.


ఆడ ఎనాఫిలస్‌ దోమ వల్లే మలేరియా

చిన్న దోమే కదా అని చులకన వద్దు.  ఆడ ఎనాఫిలస్‌ దోమ ప్రాణాంతకమైన మలేరియా జ్వరాన్ని ఇట్టే అంటిస్తుంది. ఏజెన్సీ ప్రాంతంలోని చెట్లు, చెట్ల ఆకులు, రాలిన ఆకుల చెత్తలపై, కొండవాగులు, మురికిగుంటల వద్ద ఇవి ఎక్కువగా ఉంటాయి. వీటిని స్థావరాలుగా ఏర్పాటు చేసుకుని గుడ్ల ద్వారా సంతతిని వృద్ధి చెందిస్తుంది. మలేరియా వ్యాప్తికి కారకాలైన పరాన్న జీవు లను మానవ శరీరానికి ఎక్కిస్తుంది. ఒక్క సారి కుడితే చాలు దాని ప్రభావం ప్రమాద కరం. మలేరియా జ్వరం వచ్చిన వారు మొదటిలోనే గుర్తించి వైద్యం పొందకపోతే అది మెదడుకు పాకి ప్రాణాలను హరిస్తుంది.


డెంగీకి కారణం ఏడిస్‌ దోమ

ఏడిస్‌ అనే దోమ కాటుకు గురైతే డెంగీ తప్పదు. ఇది ఉదయం పూట కాటు వేస్తుంది. ఇది 14 రోజుల నుంచి మూడు వారాల వరకు జీవిస్తుంది. ఇది ఎంతో ప్రమాదకరమైంది. తీవ్రమైన జ్వరం, తల నొప్పి, కీళ్ళనొప్పులు, ఒళ్లు నొప్పులు, చర్మంపై ఎర్రని దద్దుర్లు, నోరు ఎండిపోవడం, అధిక దాహం డెంగీ జ్వరం లక్షణాలు.


 ఏజెన్సీలో మలేరియా తిష్ట

జిల్లాలో అత్యధికంగా ఏజెన్సీలోనే మలేరియా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఏటా జిల్లా వ్యాప్తంగా నమోదు అయ్యే కేసుల్లో 90 శాతానికి పైగా ఏజెన్సీ ప్రాంతంలోనే నమోదవుతు న్నాయి. 2022లో ఇప్పటి వరకు జిల్లాలో 13 కేసులు నమోద వగా వాటిలో 11 కేసులు ఏజెన్సీలో నమోదయ్యాయి. 


సంవత్సరం      జిల్లాలో       మన్యంలో

2016    730   712

2017     504   476 

2018       209   206 

2019    145   138 

2020    133   124 

2021           79     66  


జ్వరాలపై సర్వేలు చేయిస్తున్నాం

ప్రసాద్‌, డీఎంవో, కేఆర్‌ ఫురం

సీజనల్‌, మలేరియా వంటి జ్వరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గతంలో నమోదైన కేసుల ఆధారంగా బుట్టాయి గూడెం, జీలుగుమిల్లి, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 133 మలేరియా ప్రభావిత గ్రామాలను గుర్తించాం. ఆయా గ్రామాల్లో ప్రత్యేకంగా మలాఽథియాన్‌, ఏసీఎంలను పిచికారీ చేయిస్తున్నాం.గతేడాది ఈ ప్రాంత వాసులకు ఇచ్చిన 2.53 లక్షల దోమ తెరలు అందించాం. జ్వరాలపై సర్వేలు చేయించి నమూనాలను సేకరిస్తున్నాం.



Updated Date - 2022-06-26T05:45:21+05:30 IST