పంజా విసురుతున్న సీజనల్‌ వ్యాధులు

ABN , First Publish Date - 2022-08-10T05:56:40+05:30 IST

సీజనల్‌ వ్యాధులు చాపకింద నీరులా ప్రబలుతున్నాయి. నెలరోజులుగా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలతో ఖాళీ ప్రదేశాలన్నీ వరదనీటితో నిండిపోయాయి.

పంజా విసురుతున్న సీజనల్‌ వ్యాధులు

- వణికిస్తున్న డెంగీ, వైరల్‌ ఫీవర్స్‌

- రోగులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రులు 

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

సీజనల్‌ వ్యాధులు చాపకింద నీరులా ప్రబలుతున్నాయి. నెలరోజులుగా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలతో ఖాళీ ప్రదేశాలన్నీ వరదనీటితో నిండిపోయాయి. దీంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దోమకాటుతో వచ్చే డెంగీ, వైరల్‌ ఫీవర్స్‌ కేసులు సంఖ్య పెరుగుతుండడం ఆందోళనకలిగిస్తున్నాయి. జిల్లా ఆసుపత్రితోపాటు ప్రైవేట్‌ ఆసుపత్రులన్నీ దగ్గు, జ్వరం వంటి వ్యాఽధులతో బాధపడుతున్న రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఓవైపు పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు, మరోవైపు విజృంభిస్తున్న సీజనల్‌ వ్యాధులు ప్రజలను వణికిస్తున్నాయి. నగరాలు, పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లో కూడా సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నాయి. 

రోజురోజుకు పెరుగుతున్న బాధితులు

జిల్లా ఆసుపత్రిలో జూలైలో 1,646 మంది వైరల్‌ ఫీవర్స్‌, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌ వంటి లక్షణాలు కలిగిన జ్వరపీడితులు పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 354 మంది ఇన్‌పేషెంట్లుగా చేరి చికిత్స తీసుకున్నారు. ఆగస్టులో  471 మంది జ్వరపీడితులు ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. ఇక ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కూడా దగ్గు, జలుబు, తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలతో పరీక్షలు చేయించుకొని చికిత్స పొందిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. 964 మంది రోగులు నగరంలోని వివిధ ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకోగా వారిలో 200 మంది డెంగీ, టైఫాయిడ్‌, మలేరియా వంటి విషజ్వరాల తీవ్రత అధికంగా ఉండడంతో ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందారు. హుజురాబాద్‌ ఏరియా ఆసుపత్రిలో జ్వరపీడిత రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. 40 రోజుల్లో ఇక్కడ 898 మంది జ్వరాలతో బాధపడుతూ చికిత్స తీసుకున్నారంటే జ్వరాల తీవ్రత ఎంతగా ఉందో తెలుస్తోంది. జిల్లాలో 2022 జనవరి 1 నుంచి జూలై మూడో వారం వరకు 85 డెంగీ కేసులు నమోదయ్యాయి. నెలరోజులుగా కురుస్తున్న వర్షాలతో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఆగస్టు 9వ తేదీ వరకు 110 డెంగీ జ్వరాలు నమోదు అయ్యాయి.  15 రోజుల వ్యవధిలోనే 25 కేసులు నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. 186 మంది చిన్న పిల్లలు జ్వరాలబారిన పడగా, చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా వైరల్‌ ఫీవర్‌ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కరీంనగర్‌, మానకొండూర్‌, తిమ్మాపూర్‌, కొత్తపల్లి, గంగాధర, హుజురాబాద్‌ ప్రాంతాల్లో జ్వరపీడితుల సంఖ్య అధికంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. 

దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన

రాష్ట్ర ప్రభుత్వం దోమల నివారణ చర్యలతోపాటు సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ వ్యాధిబారినపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేందుకు అన్నీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహిస్తున్నారు. ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు డ్రై డేగా పాటించి పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలని ప్రజలకు పిలుపునివ్వడంతోపాటు స్వయంగా మున్సిపల్‌, గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో దోమల నివారణ చర్యలను ముమ్మరంగా చేపడుతున్నారు. ఇళ్లలో ఉన్న టైర్లు, ఏసీలు, కూలర్లు, ప్లాస్టిక్‌ సీసాలు, కొబ్బరి చిప్పల్లో నీరు నిల్వకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. మంచినీరు నిలువ ఉండే ప్రాంతాల్లోనే డెంగ్యూ దోమలు వృద్ధిచెందుతాయని, నీటిని నిలువ ఉండకుండా చూసుకోవాలని, ఖాళీ స్థలాల్లో నీరు నిలువకుండా చూసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. దోమలు ఇళ్లలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసరాల పరిశుభ్రతతోపాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని సూచిస్తున్నారు. వర్షాలతో నీరు కలుషితమై వ్యాధులు ప్రబలే అవకాశాలుంటాయని, నీటిని కాచి వడపోసుకొని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయని, మరో నెల, రెండునెలలపాటు ప్రతి ఒక్కరూ సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పలుచోట్ల వైద్యఆరోగ్యశాఖ, ప్రైవేట్‌ ఆసుపత్రుల నిర్వహకులు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులను ఇస్తున్నారు. 

జాగ్రత్తగా ఉండాలి...

- డాక్టర్‌ రఘురామన్‌, సీనియర్‌ ిఫిజీషియన్‌

ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల కొత్తనీరు వస్తుంది. దీంతోపాటు దోమలు, ఈగలు బెడద కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇళ్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బయటి ఆహారం తీసుకోకపోవడమే ఉత్తమం. సాధారణ జలుబు, జ్వరం అని తేలికగా తీసుకోకుండా వెంటనే వైద్యుల దగ్గరికి వెళ్లి సలహాలు, సూచనలు తీసుకోవాలి. 

బయటి ఆహారం తీసుకోకూడదు...

- డాక్టర్‌ వెంకట్‌ రెడ్డి, ఫిజీషియన్‌

వర్షాకాలంలో బయటి ఆహారాన్ని సాధ్యమైనంత వరకు తీసుకోకూడదు. బయట తీసుకునే నీరు, ఆహారం వల్ల వాంతులు, వీరేచనాలు అవుతుంటాయి. జ్వరాల బారిన పడి అవి తీవ్రమై ప్రాణాంతకంగా మారుతుంది. కాచి చల్లార్చిన నీటిని తీసుకోవాలి. ఇంటి పరిసరాల్లో దోమలు పెరగకుండా ఎప్పటికప్పుడు శుభ్రపర్చుకోవాలి. 

Updated Date - 2022-08-10T05:56:40+05:30 IST