తీరప్రాంతాలు... వేలాది ఎకరాలు... అక్రమ చెరువులు...

ABN , First Publish Date - 2021-03-08T21:43:33+05:30 IST

ఆక్వా సాగులో కోట్ల రూపాయలనార్జించిన బడాబాబులు... ఇప్పుడు సముద్రతీర ప్రాంతం వేపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే... నిబంధనలకు పాతరేస్తూ తీరంలోని వేలాది ఎకరాల్లో అక్రమంగా చెరువులు తవ్వేస్తున్నారు.

తీరప్రాంతాలు... వేలాది ఎకరాలు... అక్రమ చెరువులు...

విజయవాడ : ఆక్వా సాగులో  కోట్ల రూపాయలనార్జించిన  బడాబాబులు... ఇప్పుడు సముద్రతీర ప్రాంతం వేపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే... నిబంధనలకు పాతరేస్తూ తీరంలోని వేలాది ఎకరాల్లో అక్రమంగా చెరువులు తవ్వేస్తున్నారు. మచిలీపట్నం రెవెన్యూ డివిజన్‌లో ఈ ప్రహసనం భారీగా నడుస్తోంది. వివరాలిలా ఉన్నాయి.పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పాలకొల్లు, నరసాపురం, భీమవరం, మైనవానిలంక తదితర ప్రాంతాలకు చెందిన బడాబాబులు కృత్తివెన్ను మండలంలో  చిన్న, సన్నకారు ఆక్వా సాగుదారుల భూములను లీజుకు తీసుకుంటు న్నారు. అయితే... ఈ భూములకు పక్కనే ఉన్న మడ అడవులను ఆక్రమించుకుంటూ, విచ్చలవిడిగా చెరువులు తవ్వేస్తున్నారు. రెవెన్యూ అధికారుల అండతోనే విచ్చలవిడిగా తీర ప్రాంత భూములను ఆక్రమించుకుంటున్నారన్న ఆరోపణలు తారస్థాయిలో వినిపిస్తున్నాయి.


  కాంపన్‌సేటరీ ఎఫారిస్టేషన్‌ (కంపా), జాతీయ విస్తరణ ప్రాజెక్టు (ఎన్‌ఎపి) కింద మచిలీపట్నం, కృత్తివెన్ను, నాగాయలంక, కోడూరు మండలాల్లోని తీర ప్రాంతంలో 250 ఎకరాల్లో మడ అడవుల విస్తరణకు అటవీశాఖ ప్రణాళికలు రూపొందించింది. 2014 డిసెంబరులో వచ్చిన సునామీ సమయంలోనూ తీరంలోని పలు గ్రామాలను సముద్రపు నీరు ముంచెత్తకుండా మడ అడవులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే...  మడ విస్తరణకు అటవీశాఖ ప్రణాళికలు రూపొందిస్తుండగా. కొందరు బడాబాబులు మాత్రం... తీర ప్రాంతాన్ని ఆక్రమిస్తున్నారు. 


తాజాగా కృత్తివెన్ను మండలంలోని ఇంతేరు, పార్వతీపురం, సత్రపాలెం గ్రామాల సమీపంలోని సర్వే నెంబర్‌ 94 లో రెండు వేల ఎకరాల పరిధిలోని మడ, బంజరు భూములపై పెద్దల కన్ను పడింది. సుమారు 500 ఎకరాల్లో మడ అడవులు, బంజరు భూములను ఆక్రమించి చెరువులు తవ్వేస్తున్నారు.

 

సిఆర్‌జెడ్‌ నిబంధనలకు పాతర...

 మడ విస్తరించని ప్రాంతాల్లో మూడడుగుల లోతు చెరువుల్లో రసాయనాలు, ఇతరత్రా మందులు ఉపయోగించకుండా స్థానిక మత్స్యకారులు, గ్రామస్తులు కుటుంబ పోషణకు) సహజ సిద్దంగా పీతలు, రొయ్యలు సాగు చేసేవారు. గ్రామస్తులు, మత్స్యకారుల చేతుల్లోని స్వల్ప విస్తీర్ణంలో ఉన్న భూములను బడాబాబులు లీజుకు తీసుకుని, తమ పలుకుబడితో వందల ఎకరాల్లో మడ అడవులనాక్రమించి చెరువులు తవ్వేస్తున్నారు. మడ అడవికి, మత్స్య సంపదకు నష్టం కలగకుండా తీరంలో ఆక్వా సాగు చేపట్టాలన్న కోస్తా రెగ్యులేటరీ జోన్‌(సీఆర్‌జెడ్‌) నిబంధనలను తుంగలో తొక్కేస్తున్నారు. 


ఇక కృత్తివెన్ను తీరంలో భూముల ఆక్రమణకు కొందరు అధికారుల అండదండలున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎకరానికి రూ. 20 వేలు చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. సమీప గ్రామాల నుంచి ఫిర్యాదులందినా, అధికారులు ఈ నేపధ్యంలోనే స్పందించడం లేదంటూ స్థానిక గ్రామాల ప్రజల నుంది ఆగ్రహం వ్యక్తమవుతోంది. 


ఫిర్యాదందితే... విచారణ : తహసిల్దార్‌, కృత్తివెన్ను మండలం :     కృత్తివెన్ను మండలంలోని పార్వతీపురం, ఇంతేరు, సత్రపాలెం గ్రామాల సమీపంలోని సర్వే నెంబర్‌ 94 లో వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూముల్లో చెరువులు తవ్వుతున్న విషయమై రెవిన్యూ అధికారులు పెద్దగా దృష్టి సారించడంలేదని సమీప గ్రామాల ప్రజలు విమర్శిస్తున్నారు. 


ఫిర్యాదులందలేదు...  

భూములు ఆక్రమణలకు గురవుతున్నాయంటూ ఎలాంటి ఫిర్యాదులు అందలేదని రెవిన్యూ అధికారులు చెబుతున్నారు. ఫిర్యాదులు వచ్చినపక్షంలో విచారణ జరిపిస్తామని వెల్లడించారు. 

Updated Date - 2021-03-08T21:43:33+05:30 IST