పెద్దపులిని పట్టుకునేందుకు చర్యలు

ABN , First Publish Date - 2021-01-16T04:25:48+05:30 IST

ఇద్దరి ప్రాణాలు బలిగొన్న పెద్దపులిని పట్టుకునేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఫారెస్టు కన్జర్వే టర్‌ వినోద్‌ కుమార్‌ అన్నారు.

పెద్దపులిని పట్టుకునేందుకు చర్యలు
మాట్లాడుతున్న ఫారెస్టు కన్జర్వేటర్‌ వినోద్‌కుమార్‌

 - ఫారెస్టు కన్జర్వేటర్‌ వినోద్‌కుమార్‌

బెజ్జూరు, జనవరి 15: ఇద్దరి ప్రాణాలు బలిగొన్న పెద్దపులిని పట్టుకునేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఫారెస్టు కన్జర్వే టర్‌ వినోద్‌ కుమార్‌ అన్నారు. గురువారం మండలంలోని కందిభీమన్న అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపు వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెద్దపులిని పట్టుకోవడానికి రెండు నెలలుగా విస్త్రృతంగా పర్యవేక్షణ చేపడుతున్నామని వివరించారు. ఇద్దరు వ్యక్తులపై దాడి చేసిన పులి ఒక్కటేనని గుర్తించామన్నారు.  దాడికి పాల్పడ్డ పులి నవంబరులో మహారాష్ట్రలోని తడోబా అటవీ ప్రాంతం నుంచి ఆసిఫాబాద్‌ జిల్లాలోని అడవుల్లోకి ప్రవేశించినట్లు గుర్తించామ న్నారు.  అదే పులి గోలేటి, బెల్లంపల్లి, మంచిర్యాల ప్రాంతా ల్లో సంచరించి నట్లు  వివరించారు. పులి ఎక్కువగా తిరిగే ఎనిమిది ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేసి దాని కదలికలను పసిగడుతున్నట్లు పేర్కొన్నారు.  టైగర్‌ ట్రాకర్లతో పాటు బోన్లు, సీసీ కెమేరాలు అమర్చి కదలికలను పరిశీలిస్తున్నామని చెప్పారు. టైగర్‌ ట్రాకింగ్‌లో ప్రత్యేక నైపుణ్యం కలిగిన వ్యక్తులను మహారాష్ట్ర నుంచి తీసక వచ్చి వేట కొనసాగిస్తున్నామని తెలిపారు. పశువుపై దాడి చేసిన వెంటనే అప్పటి నుంచి ప్రత్యేక నిఘా పెంచినట్లు తెలిపారు. సాదారణంగా పశువులపై దాడి చేసిన పులి మూడు సార్లు దాని కళేబరాన్ని తినేందుకు వస్తుందని అన్నారు. అందు కోసం కంది భీమన్న అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మంచెపై నుంచి నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. మత్తు మందు ఇచ్చి పట్టుకునేందుకు ప్రత్యేక షూటర్లను మహారాష్ట్ర నుంచి రప్పించి ఆపరేష న్‌ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎఫ్‌వో శాంతారాం, కాగజ్‌నగర్‌ ఎఫ్‌డీవో విజయ్‌కుమార్‌, రేంజ్‌ అధికారులు దయాకర్‌, వేణుగోపాల్‌, డిప్యూటి రేంజ్‌ అధికారి శీలానంద్‌ పాల్గొన్నారు.

ఆపరేషన్‌ కొనసాగుతోంది: డీఎఫ్‌వో శాంతారాం

బెజ్జూరు: మనుషులపై దాడి చేసి హతమార్చిన పెద్దపులిని పట్టుకునే వరకు ఆపరేషన్‌ కొనసాగిస్తామని  డీఎఫ్‌వో శాంతారాం అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఐదు రోజులుగా దాని కదలికలు గుర్తించి అది ఎటువైపు వెళ్తుందో పసిగడుతున్నామని చెప్పారు. ఎక్కడైనా పులి పశువులపై దాడి చేస్తే కనుక అక్కడ కూడా ఆపరేషన్‌ ఏర్పాటు చేస్తామని వివరించారు. ఒక్కసారి పశువులపై దాడి చేసిన పులి మళ్లీ అదే ప్రాంతంలో సంచ రించే అవకాశం ఉండడంతో మత్తు మందు షూటర్లతో బంధించేందుకు ఏర్పాట్లు చేశా మని అన్నారు. ఎన్‌టీసీఏ నిబంధనలకు అనుగుణంగా పగలంతా వేట చేపడుతూ రాత్రి పూట నిలిపివేస్తున్నామని తెలిపారు.

Updated Date - 2021-01-16T04:25:48+05:30 IST