ఒక్క గింజ కొంటే ఒట్టు

ABN , First Publish Date - 2022-05-13T05:09:13+05:30 IST

జిల్లాలో ఖరీఫ్‌ సీజనలో 63,474 హెక్టార్ల విస్తీర్ణంలో కంది సాగైంది.

ఒక్క గింజ కొంటే ఒట్టు

  1.  మద్దతు ధరకు చుక్కలే
  2. కంది రైతుల కన్నీళ్లు
  3. శనగ రైతుల పరిస్థితి దయనీయం 
  4. లక్ష్యం 30వేల టన్నులు
  5.  కొనింది 14 వేలే
  6.  ఈ నెల15తో కొనుగోళ్లు బంద్‌
  7.  ఆందోళనలో అన్నదాతలు

కర్నూలు (అగ్రికల్చర్‌), మే 12:   కర్నూలు (అగ్రికల్చర్‌), మే 12: జిల్లాలో ఖరీఫ్‌ సీజనలో 63,474 హెక్టార్ల విస్తీర్ణంలో కంది సాగైంది. సాగు మొదట్లో వర్షాభావం, పంట చేతికందే సమయంలో భారీ వర్షాల వల్ల పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. నాణ్యత కూడా అంతంత మాత్రమే.  క్వింటం కందులకు  రూ.6,300 మద్దతు ధర ప్రకారం రైతుల నుంచి దాదాపు 2 లక్షల టన్నులకు పైగానే కొనాలి.  అయితే ఇప్పటి దాకా ఒక్క గింజ కూడా మార్క్‌ఫెడ్‌ అధికారులు కొనలేదు.   రైతులకు వేరే దారి లేక  కర్నూలు మార్కెట్‌ యార్డుకు వచ్చి దళారులు, వ్యాపారులకు క్వింటం రూ.4,500లకే విక్రయిస్తున్నారు. ఈ పరిస్థితికి మార్క్‌ఫెడ్‌ అధికారులు విచిత్రమైన వాదన చేస్తున్నారు. రైతులు తెచ్చిన కందులు నాణ్యంగా లేవని, ఇలాంటి వాటిని కేంద్ర సంస్థ నాఫెడ్‌  ఒప్పుకోదని, అందువల్లనే తాము కొనడం లేదని అంటున్నారు. అదే విధంగా ఖరీ్‌ఫలో  48,579 హెక్టార్లలో మొక్కజొన్న,  3వేల హెక్టార్లలో  సజ్జలు నానా కష్టాలు పడి పండించారు.  మొక్కజొన్నలను  కేవలం 183 మంది రైతుల నుంచి 817 టన్నులు, సజ్జలు 21 మంది రైతుల నుంచి 125 టన్నులను కొన్నారు.  వీటిని  డీసీఎంఎస్‌ అధికారులు లారీల్లో నింపి గోదాములకు తరలించారు. అయితే ఆ సరుకులో కొంత   నాణ్యంగా  లేదని నాఫెడ్‌ అధికారులు వెనక్కి పంపించారు.  దీంతో డీసీఎంఎస్‌ అధికారులు రైతులను బతిమిలాడి వాళ్ల సరుకు వాళ్లకు ఇచ్చేశారు. మరికొంత మంది డీసీఎంఎస్‌ అధికారులు తామే వ్యాపారులకు అమ్మి రైతులకు డబ్బు ఇచ్చేశారు. ఈ ట్రాన్సపోర్టు ఖర్చులను  తమ నెత్తిపైనే వేశారని,  వాస్తవంగా మార్క్‌ఫెడ్‌ అధికారులే భరించాలని డీసీఎంఎస్‌ ఉద్యోగులు అంటున్నారు. 


ఈ రైతు ఈ పేరు హుశేన రెడ్డి. ఐదెకరాల్లో శనగ సాగు చేశాడు. అధిక వర్షాలతో కేవలం 26 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. దాన్నయినా అమ్ముకోడానికి కాళ్లరిగేలా తిరుగుతున్నాడు. ఆర్‌బీకే పరిధిలోని డీసీఎంఎస్‌ ఉద్యోగే శనగలు కొనాలి. అయితే ఆ ఉద్యోగి అందుబాటులో లేడు. మార్క్‌ఫెడ్‌ అధికారులకు గోడు వెళ్ల్లబోసుకున్నాడు. ఆయనతో పాటు ఊళ్లోని మరో 8 మంది రైతులు అధికారులను కలిశారు. మార్క్‌ఫెడ్‌ మేనేజర్‌ రాజు మాట్లాడుతూ.. గోనెగండ్ల డీసీఎంఎస్‌ ఉద్యోగిని పంపుతానని అన్నారు. ఆయనే శనగలు కొంటాడని తెలిపారు. సదరు ఉద్యోగి అదిగో ఇదిగో అంటున్నాడు. శనగలు కల్లంలోనే ఉంటే  వాన కురిస్తే తడిసిపోతాయని రైతులు ఆందోళనపడుతున్నారు. విధిలేక గత శుక్రవారం వ్యాపారికి క్వింటం రూ. 4,600కు అమ్మేశారు. రెండు వారాలకు డబ్బు ఇస్తానని వ్యాపారి చీటీ రాసి ఇచ్చాడు. క్వింటం మీద  2 కేజీల సరుకు అదనంగా తీసుకున్నాడు. ఈ గ్రామంలో దాదాపు 2వేల క్వింటాళ్ల శనగలు ఇలా వ్యాపారులకు అమ్మేశారు. ప్రభుత్వం అయితే క్వింటానికి రూ.5230లకు కొనేది. ఈ లెక్కన రైతులు ఎంత నష్టపోయిందీ చూస్తే గుండె చెరువు అవుతుంది.  

శనగ రైతులు చుక్కలు చూశారు..

రబీలో   1.09 లక్షల హెక్టార్లలో రైతులు శనగ సాగు చేశారు. అధిక వర్షాల వల్ల సగం పంట కూడా  చేతికి అందలేదు. కనీసం చేతికందిన శనగలనైనా మద్దతు ధరకు అమ్ముకుందామని మార్క్‌ఫెడ్‌ కార్యాలయం చుట్టూ రైతులు తిరుగుతున్నారు.  నిబంధనల ప్రకారం మార్క్‌ఫెడ్‌ అధికారులు   క్వింటం  రూ.5,230 కొనాలి. ఇందులో కూడా నాఫెడ్‌ ఆదేశాల ప్రకారం కేవలం 30వేల టన్నుల శనగలే కొనాలని ప్రభుత్వం ఆదేశించిందని, ఇప్పటి దాకా 14వేల టన్నులు సేకరించామని మార్క్‌ఫెడ్‌ డీఎం రాజు తెలిపారు. ఇందులో  7వేల టన్నులకు  డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేశామని, ఇంకా 7వేల టన్నులకు ఇవ్వాలని చెబుతున్నారు. అయితే రైతులు మాత్రం శనగలు  మార్క్‌ఫెడ్‌ ద్వారా విక్రయించేందుకు నానా అవస్థలు పడ్డారు. కల్లూరు మండలంలోని రైతుల నుంచి శనగలు కొనడానికి డీసీఎంఎస్‌  ఉద్యోగులు అందుబాటులో లేకపోవడంతో దాదాపు వంద కి.మీల దూరంలో ఉన్న గోనెగండ్ల డీసీఎంఎస్‌ ఉద్యోగిని  మార్క్‌ఫెడ్‌ అధికారులు పిలిపించారు.  అయితే.. ఆ ఉద్యోగి కూడా  రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  శనగల నాణ్యత విషయంలో పేచీ పెడుతు న్నారని, లారీల,  హమాలీల ఖర్చు తమ మీదే వేస్తున్నా రని రైతులు అంటు న్నారు. ఈ బాధ పడటం కంటే  వ్యాపారులకే క్వింటం రూ.4,500ల ప్రకారం విక్రయించడం  నయమని  గోకులపాడు, పర్ల, చిన్నటేకూరు, నాగసముద్రం, పెంచికలపాడు నిర్ణయానికి వచ్చి అమ్మేశారు. పైగా  తూకం కాటాలను, కుట్టు మిషన్లను తామే కొనాలని  డీసీఎంఎస్‌ అధికారి అన్నారని రైతులు ఆవేదన చెందారు. దీనికితోడు  లారీలు సకా లంలో రావని కూడా అంటున్నారని, ఇలా అయితే ఈ వర్షాకా లంలో శనగలు ఎక్కడ భద్రపరచాలని ప్రశ్నిస్తున్నారు. అందుకే వ్యాపారులకు అమ్మేశామని చెబుతున్నారు.   


ప్రభుత్వం ఏం చేస్తోంది..?

  మేం ఎందుకు నష్టపోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. నానా కష్టాలుపడి పంట పండిస్తే తమను దళారులకు, వ్యాపారులకు వదిలేసి ప్రభుత్వం వినోదం చూస్తోందా? అని నిలదీస్తున్నారు. కానీ రైతుల బాధ అధికారులకు పట్టలేదు. ప్రభుత్వం గిట్టుబాటు ధరల గురించి లెక్కలేనని వాగ్దానాలు చేసింది. చట్టాలు తయారు చేసింది. అన్నీ గాలిలోనే ఉన్నాయి. ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వడం ఏమోగాని రైతులకు చుక్కలు చూపిస్తోందనే విమర్శలు ఉన్నాయి. అనావృష్ఠి, అతివృష్ఠి మధ్య సేద్యం చేసి పంటలు పండిస్తే  మార్క్‌ఫెడ్‌ అధికారులు గిట్టుబాటు ధరకు కొనడం లేదని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మద్దతు ధర ఇవ్వడానికి ప్రభుత్వం ప్రభుత్వం విధిస్తున్న నిబంధనల వల్ల చాలా మంది రైతులు అనర్హులవుతున్నారు.  నిబంధనలను కఠినం చేయడం వల్ల.. వాటిని అమలు చేయకపోతే తమ ఉద్యోగాలు ఉండవని మార్క్‌ఫెడ్‌, డీసీఎంఎస్‌ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడం పట్ల  రైతులు మాత్రం తమనే బాధ్యులను చేస్తున్నారని, తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తే ఏం చేస్తామని ఉద్యోగులు అంటున్నారు. జిల్లాలో ఖరీఫ్‌, రబీ సీజన్లలో పంట దిగుబళ్లలో 4వ భాగం  రైతుల నుంచి మద్దతు ధర ఇచ్చి మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అది కూడా ఈ నెల 15తో కొనుగోళ్లు ఆగిపోతాయి. గిట్టుబాటు ధరల గురించి ప్రభుత్వం చెబుతూ వచ్చిన మాటలన్నీ కాగితాలపైనే ఉన్నాయి. కొద్ది రోజులపాటు నామమాత్రంగా  కొని, నెలకో.. ఆర్నెల్లకో డబ్బు బ్యాంకుల్లో జమ చేస్తున్నారని రైతులు అంటున్నారు. 

  నిబంధనల ప్రకారమే కొనుగోలు  

 రైతుల నుంచి పంట ఉత్పత్తులను ప్రభుత్వ నిబంధనల మేరకే కొంటున్నాం. కందులు నాణ్యంగా  లేకపోవడం వల్ల కొనలేదు. కొన్ని చోట్ల డీసీఎంఎస్‌ కేంద్రాలతో పాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు రైతుల పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. అందువల్లనే రైతులకు ఇబ్బందులు లేకుండా దూర ప్రాంతంలోని డీసీఎంఎస్‌ ఉద్యోగుల ద్వారా కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నాం. రైతులు  తక్కువ ధరకే వ్యాపారులకు అమ్ముకుంటే మాకు సంబంధం లేదు. రైతుల నుంచి కొనగానే డబ్బు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నాం. 

 - రాజు, మార్క్‌ఫెడ్‌ మేనేజర్‌  


Read more