ఒట్టు పెట్టు.. ఇసుక ఎత్తు

ABN , First Publish Date - 2021-12-27T06:15:12+05:30 IST

మండల పరిధిలోని నాగులపహాడ్‌ గ్రామంలో ఇసుక తరలింపులో మూఢ నమ్మకాలను జోడించి ప్రమాణాల వరకు తీసుకెళ్లారు. గ్రామస్థులపై దౌర్జన్యాలకు దిగుతున్న ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మండల పరిఽధిలోని నాగులపహాడ్‌ గ్రామానికి చెందిన

ఒట్టు పెట్టు.. ఇసుక ఎత్తు
మూసీ వాగు నుంచి ఇసుక తరలిస్తున్న స్థానికులు

ప్రమాణాల వరకూ వెళ్లిన ఇసుక తరలింపు వ్యవహారం

కూపీ లాగుతున్న పోలీసులు

పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు?

పెన్‌పహాడ్‌, డిసెంబరు 26: మండల పరిధిలోని నాగులపహాడ్‌ గ్రామంలో ఇసుక తరలింపులో మూఢ నమ్మకాలను జోడించి ప్రమాణాల వరకు తీసుకెళ్లారు. గ్రామస్థులపై దౌర్జన్యాలకు దిగుతున్న ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మండల పరిఽధిలోని నాగులపహాడ్‌ గ్రామానికి చెందిన మహేష్‌ అనే యువకుడు అనుమతి లేకుండా ఇసుక తరలిస్తుండగా అతని ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకున్న ఎస్‌ఐ కేసు నమోదు చేశారు. గ్రామంలోని ఇసుక ట్రాక్టర్ల యజమానులే పోలీసులకు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారని, తద్వారా ఇసుక ట్రాక్టర్‌ను పట్టించారని హల్‌చల్‌ చేస్తూ గ్రామంలోని మూసీ వాగులోకి ఎవరూ వెళ్లకుండా కొందరు భయాభ్రాంతులకు గురిచేశారు. గ్రామంలో ఇసుక వ్యాపారం నడవాలంటే మహేష్‌ ట్రాక్టర్‌ను తాము పట్టించలేదని, భవిష్యత్‌లో కూడా అతని ట్రాక్టర్‌ను పట్టించబోమని మూసీ నదిలో తలస్నానం చేసి గంగాదేవి గుడి దగ్గర ప్రమాణం చేయాలని మహేష్‌ తరుఫు పెద్దమనుషులు తీర్మానం చేసినట్లు సమాచారం. కొందరు ట్రాక్టర్‌ యజమానులు ప్రమాణం చేయగా, ఇష్టం లేని మరికొంతమంది ట్రాక్టర్‌ యజమానులు మాత్రం ఈ రోజుల్లో మూఢనమ్మకాలు ఏమిటని ప్రమాణం చేయడానికి ఒప్పకోలేదు. ప్రమాణం చేయని వారి ట్రాక్టర్లలో ఇసుక నింపడానికి పెద్దమనుషుల హెచ్చరిక మేరకు కూలీలు ముందుకు రావడం లేదు. ప్రమాణం చేయడానికి నిరాకరించిన గ్రామ ఉప సర్పంచ్‌ ట్రాక్టర్‌ను సైతం మూసీ లోకి అనుమతి ఇవ్వడం లేదు. ఈ తతంగమంతా రెండు రోజుల క్రితం పెద్ద మనుషుల సమక్షంలో జరిగినట్లు సమాచారం. ఈ విఽధంగా చేయడం గ్రామానికి అరిష్టమని గ్రామస్థులు హెచ్చరించినా కూడా వినకుండా దౌర్జన్యంగా ప్రమాణాలు చేయించినట్లు గ్రామస్థులు వాపోతున్నారు. మూసీ నదిలో ఇసుక అక్రమ రవాణా, మూఢ నమ్మకాలపై పోలీసు నిఘా వర్గాలు కూపీ లాగుతున్నట్లు సమాచారం. 

ఊరి నిండా ఇసుక డంపులే

గ్రామంలో జరిగిన ప్రమాణాల ఘటన బయటికి పొక్క డంతో ఏ క్షణమైనా పోలీసులు రంగ ప్రవేశం చేయవచ్చనే ఆలోచనతో మూడు రోజులుగా గ్రామంలో ఇసుక డంప్‌ చేస్తున్నారు. దీంతో ఎక్కడ చూసినా గ్రామంలో ఇసుక కుప్పలే దర్శనమిస్తున్నాయి.

Updated Date - 2021-12-27T06:15:12+05:30 IST