సమైక్య స్ఫూర్తిగా బాపు, బాబాసాహెబ్

ABN , First Publish Date - 2020-02-03T23:59:33+05:30 IST

న్యూఢిల్లీలో విద్యార్థుల నిరసనలలో అంబేడ్కర్, గాంధీ పోస్టర్లను కలిసికట్టుగా ప్రదర్శించడాన్ని చూసినప్పుడు దేవనూర్ మహదేవ మాటలను...

సమైక్య స్ఫూర్తిగా బాపు, బాబాసాహెబ్

న్యూఢిల్లీలో విద్యార్థుల నిరసనలలో అంబేడ్కర్, గాంధీ పోస్టర్లను కలిసికట్టుగా ప్రదర్శించడాన్ని చూసినప్పుడు దేవనూర్ మహదేవ మాటలను నేను గుర్తు చేసుకున్నాను. బాపు, బాబాసాహెబ్ చిత్రాలను పక్కపక్కనే ప్రదర్శించడం ఇదే మొదటిసారి కానప్పటికీ చాలా అరుదైన విషయం. గతంలో గాంధీ అభిమానులు, ఈ ఇరువురినీ పరస్పర ప్రత్యర్థులుగా చూసేవారు. సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్న హిందూత్వ శక్తులను ఓడించేందుకు అంబేడ్కర్, గాంధీ ఒకే పక్షాన ఉండవలసిన అవసరమున్నది.
 
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, మహాత్మా గాంధీ పరస్పర ప్రత్యర్థులూ, విరోధులా? ఇరవయ్యో శతాబ్ది మహోన్నత భారతీయులైన ఆ ఇరువురినీ అలా భావించవద్దని ప్రజాస్వామిక వాదులకు దేవనూర్ మహదేవ (కన్నడ రచయిత, సామాజిక క్రియాశీలి) విజ్ఞప్తి చేశారు. నిజమైన సమానత్వ సాధనా ప్రస్థానంలో సహ యాత్రికులుగా వారిని చూడాలని ఆయన అన్నారు. ‘నిద్రాణ స్థితిలో వున్న దళితులను అంబేడ్కర్ మేలుకొలిపారు. ఆ జాగృతితో సమానత్వ వెలుగుల దిశగా జాతి పయనమయింది. కుల మతాల సంకుచితత్వంలో వున్న హిందువులను మానవతా వెలుగుల వైపు నడిపించడానికి గాంధీ మహా ప్రయత్నం చేశారు. అంబేడ్కర్ ఉనికి లేకపోయినట్టయితే, బహుశా, గాంధీ తన లక్ష్య సాధనలో అంతగా ముందుకు వెళ్ళగలిగివుండేవారు కాదేమో?! అదే విధంగా హిందువులలో గాంధీ ఉదారవాద, సహనశీల వైఖరులను పెంపొందించి వుండక పోయినట్టయితే అంబేడ్కర్‌ను ఈ క్రూర సవర్ణ సమాజం అంతగా సహించి, గౌరవించి వుండేది కాదు’ అని కూడా మహదేవ వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా ఇలా అన్నారు:
 
‘భారత్ తననుతాను కుల శృంఖలాల నుంచి విముక్త పరచుకోవాలంటే సవర్ణులు మారవలసిన అవసరమున్నది. ఇందుకు గాంధీ అవసరం. దళితుల పౌర హక్కుల పోరాటానికి అంబేడ్కర్ తప్పనిసరి. అందుకే వారిరువురినీ ఒకే పక్షానికి తీసుకురావాలని నేను అంటున్నాను’. మహదేవ తన అభి ప్రాయాలను మరింత విపులంగా వెల్లడిస్తూ ఇలా అన్నారు: ‘‘అస్పృశ్యతను గాంధీ ఒక ‘పాపం’గా పేర్కొనగా, అంబేడ్కర్ ఒక ‘నేరం’గా అభివర్ణించారు. ఆ రెండిటినీ మనం పరస్పర వ్యతిరేకమైవిగా ఎందుకు చూస్తున్నాం? అస్పృశ్యత దురాచార నిర్మూలనకు ఆ రెండు భావనలు తప్పనిసరి అని అర్థం చేసుకోవడమే విజ్ఞత అవుతుంది’’.
 
న్యూఢిల్లీలో విద్యార్థుల నిరసనలలో అంబేడ్కర్, గాంధీ పోస్టర్లను కలిసికట్టుగా ప్రదర్శించడాన్ని చూసినప్పుడు దేవనూర్ మహదేవ మాటలను నేను గుర్తు చేసుకున్నాను. బాపు, బాబాసాహెబ్ చిత్రాలను పక్కపక్కనే ప్రదర్శించడం ఇదే మొదటిసారి కానప్పటికీ చాలా అరుదైన విషయం. గతంలో గాంధీ అభిమానులు, ఈ మహోన్నత భారతీయులు ఇరువురినీ పరస్పర ప్రత్యర్థులుగా చూసేవారు. 1930, 40 దశకాలలో అంబేడ్కర్ తరచు గాంధీ, ఆయన భావాలపై వివాదాత్మక భాషలో విమర్శలు చేస్తుండేవారు. కాంగ్రెస్ వాదులకు అవి తీవ్ర ఆగ్రహావేశాలు తెప్పించేవి. తమ ప్రియతమ బాపును ‍అలా విమర్శించడాన్ని వారు సహించేవారు కాదు. బ్రిటిష్ వలసపాలనకు అంబేడ్కర్ ఒక సంజాయిషీదారు అని వారు ప్రతి విమర్శలు చేస్తుండేవారు. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో వైస్రాయ్ కార్యనిర్వాహక వర్గంలో అంబేడ్కర్ చేరడాన్ని గాంధీ అనుయాయులు తీవ్రంగా ఆక్షేపించేవారు.
 
ఇటీవలి దశాబ్దాలలో అంబేడ్కర్ వాదులు మరింత తరచుగా గాంధీని విమర్శిస్తున్నారు. కుల వ్యవస్థను సంస్కరించడంలో ఆయన కృషి చిత్తశుద్ధితో చేసినది కాదని కొట్టివేస్తున్నారు. పూణే ఒడంబడిక సందర్భంలోనూ, ఆ తరువాత తమ ప్రియతమ నాయకుడి పట్ల గాంధీ వైఖరిని వారు తప్పుపడుతున్నారు. అలాగే గాంధీ రాజకీయ వారసుడు జవహర్ లాల్ నెహ్రూ , అంబేడ్కర్ ప్రతిభాపాటవాలను సరైన విధంగా వినియోగించుకోకపోవడాన్ని దుయ్యబడుతున్నారు (నెహ్రూ కేబినెట్‌లో అంబేడ్కర్ రెండు సంవత్సరాల పాటు న్యాయశాఖ మంత్రిగా వున్నారు). ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో గాంధీపై దళిత మేధావులు తీవ్ర విమర్శలు చేస్తుంటారు. అయితే కర్ణాటకలో నిమ్న శ్రేణుల రచయితలు గాంధీని ఒక విశాల దృష్టితో చూస్తున్నారు. అంబేడ్కర్, గాంధీల కృషిని పరస్పర పూరకమైనదిగా చూడాలని కీర్తిశేషుడు డి. ఆర్.నాగరాజ్ తన ప్రశస్త పుస్తకం ‘ది ఫ్లేమింగ్ ఫీట్’లో మనకు విజ్ఞప్తి చేశారు.
 
జమియా మిలియా ఇస్లామియా విద్యార్థులకు, షాహీన్ బాగ్ మహిళలకు డి.ఆర్. నాగరాజ్, దేవనూర్ మహదేవ మేధో కృషి గురించి బహుశ, తెలిసివుండకపోవచ్చు. ఆ కన్నడ మేధావులు విశాల దృక్పథంతో గాంధీ గురించి చేసిన విశ్లేషణను జమియా విద్యార్థులు, షాహీన్ బాగ్ మహిళా ఉద్యమకారులు ధ్రువీకరించారు. కర్ణాటక చింతనాపరుల వలే అంబేడ్కర్,- గాంధీలను పరస్పర విరోధులుగా చూడవద్దని ఆ సాహసోపేత ఢిల్లీ నిరసనకారులు మనకు విజ్ఞప్తి చేశారు. ఆ ఇరువురు మహోన్నతులను ఒక సమున్నత లక్ష్య సాధనలో సహచరులుగా చూడాలని వారు కోరారు. మరింత మెరుగైన ప్రజాస్వామ్యానికి, బహుత్వ వాద సంస్కృతికై జరుగుతున్న పోరాటంలో అంబేడ్కర్, గాంధీ మేధో కృషి, మానవతావాద కార్యాచరణల వారసత్వాలను సమ్మిళితం చేయవలసిన అవసరమున్నదని జమియా విద్యార్థులు, షాహీన్ బాగ్ మహిళలు మనకు విజ్ఞప్తి చేశారు.
 
‍ఢిల్లీ రచయిత ఒమైర్ అహ్మద్ ఇటీవల షాహీన్ బాగ్‌ను సందర్శించిన తరువాత ట్విటర్‌లో ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య పోస్ట్ చేశారు. ఆ నిరసన ప్రదర్శనలలో గాంధీ చిత్రాల కంటే అంబేడ్కర్ చిత్రాలే ఎక్కువగా ప్రదర్శితమవడం పట్ల ఆయన ఇలా వ్యాఖ్యానించారు: ‘తమకు స్వాతంత్ర్యం సాధించిన నాయకుడికి ధన్యవాదాలు తెలిపే సంప్రదాయం నుంచి, స్వేచ్ఛాయుత పౌరులుగా తమ సొంత హక్కుల గురించి నిశ్చితంగా మాట్లాడేందుకుఅవసరమైన రాజ్యాంగ ఉపకరణాలనిచ్చిన నాయకుికి ధన్యవాదాలు చెప్పే ఆనవాయితీకి ప్రజలు మారారు’. అహ్మద్ ట్వీట్‌కు నేనిలా ప్రతిస్పందించాను: ‘మీతో నేను ఒక షరతుపై అంగీకరిస్తున్నాను. హిందూ–-ముస్లిం సమైక్యతను పటిష్ఠం చేయడంలో గాంధీతో సరి సమానులైన నాయకులు మరెవ్వరూ లేరు (నెహ్రూ సైతం ఇందుకు మినహాయింపు కాదు). ఇది మరింత వివరంగా చర్చించాల్సిన విషయం. ఏమైనా అంబేడ్కర్‌, గాంధీలను సమష్టిగా ఆవాహన చేసుకోవడానికి ప్రయత్నించడం చాలా ముదావహమైన విషయం’. దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టాని(సిఏఏ)కి వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న నిరసనలు పలు విధాల ఉత్తేజపరుస్తున్నాయి. ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొనడం, ఆ నిరసనలకు మహిళలు నాయకత్వం వహించడం ఒక గాఢానుభూతిని కలిగిస్తున్నాయి. మహిళలను ప్రోత్సహించే విషయమై కూడా అంబేడ్కర్, గాంధీలను సమష్టిగా ప్రస్తావించడం సముచితంగా ఉంటుంది.
 
జెండర్ సమానత్వానికి అంబేడ్కర్, ఎటువంటి మినహాయింపులు లేకుండా సంపూర్ణంగా నిబద్ధుడైన విశాల హృదయుడు. ఆ నిబద్ధత రాజ్యాంగ రచనలో నిండుగా ప్రతిబింబించింది. హిందూ మత చట్టాలను సంస్కరించేందుకు ఆయన సలిపిన రాజీలేని కృషి కూడా ఆ నిబద్ధతకు ఒక తిరుగులేని తార్కాణమే. గాంధీ తన వ్యక్తిగత జీవితంలో పితృస్వామ్య సంప్రదాయాలు, ఆచారాలనే పాటించినప్పటికీ ప్రజా జీవితంలో మాత్రం మహిళా సాధికారతకు పరిపూర్ణంగా కృషి చేశారు. 1925లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా సరోజినీ నాయుడు ఎన్నికవ్వడానికి గాంధీయే ప్రధాన కారకుడు. ఆ కాలంలో అమెరికా, బ్రిటన్ మొదలైన పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశాలలోని ఏ ప్రధాన రాజకీయ పార్టీకీ ఒక మహిళ అధినేత్రి కావడమనేది పూర్తిగా అనూహ్య విషయం మరి.
 
‘బోధించు, సంఘటితపరచు, ఉద్యమించు’అని అణగారిన భారతీయులకు అంబేడ్కర్ పిలుపునిచ్చారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థులు, మహిళలు మొక్కవోని దీక్షతో నిర్వహిస్తున్న నిరసనలు పూర్తిగా అంబేడ్కర్ స్ఫూర్తిదాయక పిలుపునకు అనుగుణంగా వున్నాయి. హిందూ అధిక సంఖ్యాకవాద ధోరణులను నిలువరించి ప్రజాస్వామ్యాన్ని, బహుత్వ వాదాన్ని సంరక్షించుకోవడానికి జరుగుతోన్న చైతన్యశీల కృషిలో అంతర్-మత సామరస్యం కోసం గాంధీ జీవితాంతం చేసిన పోరాటం ప్రతిధ్వనిస్తోంది.
 
హిందూత్వ శక్తులతో ఎదురవుతున్న ముప్పును ఎదుర్కోవడానికి అంబేడ్కర్, గాంధీలను సమష్టిగా ఆవాహన చేసుకోవాలని దేవనూర్ మహాదేవ నొక్కి చెప్పారు. ఆయన ఇలా అన్నారు: ‘‘వారణాసికి చెందిన పదహారేళ్ళ బాలుడు ఒకరు అన్న మాటలను మనం విని తీరాలి’. ‘గాడ్సే దేశంలో నేను గాంధీతో నిలబడతాను’ అని ఆ చిరుప్రాయుడు అన్నాడు. అలా నిలబడనిపక్షంలో ఏ ఛాందసవాదమైనా సరే తొలుత మీ కళ్ళను పెరికి వేసి మిమ్ములను అంధులను చేస్తుంది. ఆ తరువాత మీ మెదడును చితగ్గొట్టి, హేతుయుక్తంగా ఆలోచించలేకుండా చేస్తుంది. పిదప మీ గుండెను పగుల గొట్టి మిమ్ములను రాక్షసుడిగా చేస్తుంది. అంతిమంగా ఒక త్యాగం చేయమని మిమ్ములను అడుగుతుంది. ఈ ధోరణి నేడు పెచ్చరిల్లి పోతోంది. మనం మన బిడ్డల నయనాలను, వారి హృదయాలను, వారి మస్తిష్కాలను ఛాందసవాద కోరల నుంచి తక్షణమే కాపాడుకోవాలి. ఇటువంటి చైతన్యశీలతను సంతరించుకోకపోతే దళితులకు మరింత మహా ముప్పు వాటిల్ల గలదని నేను ఆందోళన చెందుతున్నాను’.
 
అంబేడ్కర్ గానీ, గాంధీ గానీ మానవాతీతులు కారనడంలో సందేహమేమీ లేదు. ఇరువురూ మహా తప్పులు చేశారు. ఆ మహోన్నతులిరువురినీ యాంత్రికంగా ఆవాహన చేసుకోకూడదు; గుడ్డిగా అనుకరించకూడదు. వారు ఈ భూమిపై నడయాడిన కాలానికి సంపూర్ణంగా భిన్నమైన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. 21 వ శతాబ్ది మూడో దశాబ్ది రాజకీయ, సాంకేతికతా సవాళ్లు 20వ శతాబ్ది మధ్యనాళ్ళ రాజకీయ, సాంకేతికతా సవాళ్లకు పూర్తిగా భిన్నమైనవి. అప్పటికీ, ఇప్పటికీ నైతిక, సామాజిక సవాళ్లు మాత్రం ఒకే విధంగా వున్నాయి. కుల నిర్మూలన, జెండర్ సమానత్వ పోరాటాలు ముగియలేదు. అంతర్-మత సామరస్య సాధన అత్యావశ్యక, అతి ప్రధాన కర్తవ్యంగా మిగిలిపోయింది. సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్న హిందూత్వ శక్తులను ఓడించేందుకు అంబేడ్కర్, గాంధీ ఒకే పక్షాన ఉండవలసిన అవసరమున్నది.
 
 
రామచంద్ర గుహ 
(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - 2020-02-03T23:59:33+05:30 IST