విద్యార్థుల కోసం దేశభక్తి సినిమాల ప్రదర్శన

ABN , First Publish Date - 2022-08-09T05:51:09+05:30 IST

స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించనున్న గాంధీ సినిమాను జిల్లాలోని విద్యార్థులందరూ తిలకించేలా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ విద్యాశాఖ, రవాణాశాఖ అధికారులను ఆదేశించారు.

విద్యార్థుల కోసం దేశభక్తి సినిమాల ప్రదర్శన

ప్రతీ విద్యార్థి సినిమా చూసేలా అధికారులు చర్యలు తీసుకోండి 

కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌


సిద్దిపేట అగ్రికల్చర్‌, ఆగస్టు 8 : స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించనున్న గాంధీ సినిమాను జిల్లాలోని విద్యార్థులందరూ తిలకించేలా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ విద్యాశాఖ, రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 9 నుంచి 11 వరకు, 16 వరకు 21 జిల్లాలోని సిద్దిపేట పట్టణం, గజ్వేల్‌, దుబ్బాక, శ్రీనివాస, హుస్నాబాద్‌, చేర్యాలలో ఉన్న మొత్తం 10 సినిమా థియేటర్లలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు (6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న) విద్యార్థుల కోసం గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించాలని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి గాంధీ సినిమాను ఇప్పటికే డౌన్‌లోడ్‌ చేసుకుని సినిమా హాళ్లలను సిద్ధంగా ఉంచడం జరిగిందని ఆయన తెలిపారు. ముందుగా ఈ నెల 9 నుంచి 11 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ యూపీఎస్‌, జడ్పీ, గురుకులలు, వివిధ సంక్షేమ హాస్టళ్లల్లో 6 నుంచి 10 తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సినిమా చూపించాలన్నారు. ఇందుకోసం ఆయా పాఠశాలల నుంచి సమీప పట్టణాల్లో థియేటర్లకు విద్యార్థులను తరలించేందుకు ఉచిత వాహనాలను ఏర్పాటు చేయాలని జిల్లా రవాణాశాఖ అధికారి భాను ప్రసాద్‌ను ఆదేశించారు. విద్యార్థులను క్షేమంగా థియేటర్లకు తీసుకెళ్లి అనంతరం ఇంటికి చేర్చే బాధ్యత విద్యాశాఖ అధికారులదేనన్నారు. ప్రతీ మండలానికి నియమించిన ఒక నోడల్‌ అధికారి సినిమా సమయానికి అనుగుణంగా జాప్యం జరగకుండా రవాణాశాఖ అధికారులతో సంప్రదించి బస్సులను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి, రవాణా శాఖ అధికారులు, మండల నోడల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-09T05:51:09+05:30 IST