విద్యార్థుల కోసం గాంధీ సినిమా ప్రదర్శన

ABN , First Publish Date - 2022-08-10T10:10:32+05:30 IST

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్రంలోని దాదాపు 22 లక్షల మంది విద్యార్థులకు ‘గాంధీ’ చలనచిత్రాన్ని థియేటర్లలో ఉచితంగా చూపిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ తెలిపారు.

విద్యార్థుల కోసం గాంధీ సినిమా ప్రదర్శన

మంగళవారం నుంచే ప్రారంభం.. మంచి స్పందన

హైదరాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్రంలోని దాదాపు 22 లక్షల మంది విద్యార్థులకు ‘గాంధీ’ చలనచిత్రాన్ని థియేటర్లలో ఉచితంగా చూపిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. మంగళవారం ఉదయం గాంధీ సినిమాను ప్రదర్శిస్తున్న అత్తాపూర్‌లోని మంత్ర సినిమా హాల్‌ను ఆయన సందర్శించారు. విద్యార్థులతో కలిసి కొద్దిసేపు సినిమా చూశారు. యువతరం కోసం గాంధీ సినిమా ప్రదర్శనను ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారి అని ఆయన చెప్పారు. రోజూ రెండున్నర లక్షల మంది విద్యార్థులు గాంధీ సినిమాను  చూసేలా ఏర్పాట్లు చేశామన్నారు. మొత్తం 552 స్ర్కీన్లలో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో జాతీయ సమైక్యత, దేశభక్తిని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్న గాంధీ సినిమాకు అనూహ్య స్పందన లభిస్తోంది. కాగా, వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఒక జాతీయ పతాకాన్ని అందజేస్తున్నామని, ఇందు కోసం చేనేత కళాకారులతో 1.20 కోట్ల జెండాలను తయారు చేయిస్తున్నామని సోమేశ్‌ కుమార్‌ చెప్పారు. 

Updated Date - 2022-08-10T10:10:32+05:30 IST