టిక్కెట్లకోసం యాతన

ABN , First Publish Date - 2022-09-22T06:45:04+05:30 IST

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం బాధ్యతరాహిత్యం కారణంగా భారత్‌-ఆస్ట్రేలియా మూడో టీ20 మ్యాచ్‌ టిక్కెట్ల విక్రయ వ్యవహారం ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది.

టిక్కెట్లకోసం యాతన

జింఖానాకు  పోటెత్తిన అభిమానులు

హెచ్‌సీఏ బాధ్యతారాహిత్యం


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం బాధ్యతరాహిత్యం కారణంగా భారత్‌-ఆస్ట్రేలియా మూడో టీ20 మ్యాచ్‌ టిక్కెట్ల విక్రయ వ్యవహారం ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. ఈనెల 15వ తేదీన ‘పేటీఎం ఇన్‌సైడర్‌’ యాప్‌లో టిక్కెట్లు బుక్‌ చేసుకున్నవారికి బుధవారం నుంచి సికింద్రాబాద్‌ జింఖానా మైదానంలో బార్‌కోడ్‌ టిక్కెట్లు ఇస్తామని మొబైల్‌కు, ఈ-మెయిల్స్‌కు సమాచారం వచ్చింది. దీంతో టిక్కెట్లు బుక్‌ చేసుకున్న వారంతా జింఖానాకు పోటెత్తారు. అయితే, టిక్కెట్ల ముద్రణ ఇంకా పూర్తి కాకపోవడం, ఆ విషయాన్ని టిక్కెట్లు బుక్‌ చేసుకున్న వారికి తెలియజేయకపోవడంతో తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన క్రికెట్‌ అభిమానులు కూడా నగరానికి చేరుకున్నారు. ఉదయం 10 గంటల నుంచే టిక్కెట్లు ఇస్తామని చెప్పి, 12 గంటలకు కూడా కౌంటర్లు తెరవకపోవడంతో అభిమానులు గేట్లు, గోడలు దూకి ఆఫీసు కార్యాలయంలోకి, పైకి, మైదానంలోకి దూసుకెళ్లారు. ఇంతమంది వస్తారని ఊహించని పోలీసులు కూడా అభిమానులను కట్టడి చేయడంతో విఫలమయ్యారు. ఇక, టిక్కెట్లు బుక్‌ చేసుకున్నవారే కాక, రెండో దశ టిక్కెట్లను కౌంటర్లలో విక్రయిస్తారంటూ వస్తున్న వార్తలను నమ్మి కూడా అభిమానులు తండోపతండాలు అక్కడికి చేరుకోవడంతో ఒక దశలో పరిస్థితి అదుపు తప్పింది. పోలీసుల రంగప్రవేశంతో కొద్ది సేపటికి పరిస్థితి అదుపులోకి వచ్చింది.


నేటి నుంచి కౌంటర్‌లోనూ టిక్కెట్ల విక్రయం

క్రికెట్‌ అభిమానుల ఆగ్రహావే శాలు, విమర్శలకు తలొగ్గిన హెచ్‌సీఏ కౌంటర్‌లోనూ టిక్కెట్లను విక్రయించేందుకు ముందుకొచ్చింది. గురువారం ఉదయం నుంచి సికింద్రాబాద్‌ జింఖానాలో ‘పేటీఎం’ సిబ్బంది ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు విక్రయించనున్నారని హెచ్‌సీఏ తెలిపింది. ఒకరికి రెండు టిక్కెట్లు మాత్రమే అమ్మనున్నారని, అధార్‌ కార్డ్‌ లేదా ఏదేనీ ప్రభుత్వ గుర్తింపు కార్డు కౌంటర్‌లో చూపించాల్సి ఉందని హెచ్‌సీఏ అధికార వర్గాలు తెలిపాయి.

Updated Date - 2022-09-22T06:45:04+05:30 IST