రెండో పంట సాగు సందిగ్ధం!

ABN , First Publish Date - 2021-04-17T03:42:16+05:30 IST

ఈ ఏడాది రెండో పంట సాగు ప్రశ్నార్ధకంగా మారింది. పెట్టుబడులు పెరగడం, దిగుబడులు తగ్గడంతో పాటు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు.

రెండో పంట సాగు సందిగ్ధం!
ధాన్యం కాటా వేస్తున్న కూలీలు

కావలి కాలువ కింద 75 వేల ఎకరాలకు 

   నీటి సరఫరాకు అధికారుల హామీ

పెరిగిన పెట్టుబడులు, తగ్గుతున్న దిగుబడి

గిట్టుబాటు ధర లేక నష్టాలు

వనరులున్నా ఆసక్తి చూపని రైతులు


జలదంకి, ఏప్రిల్‌ 16: ఈ ఏడాది రెండో పంట సాగు ప్రశ్నార్ధకంగా మారింది. పెట్టుబడులు పెరగడం, దిగుబడులు తగ్గడంతో పాటు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు. దీంతో సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నా, కావలి కాలువ కింద 75 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామని అధికారులు హామీ ఇచ్చినా పంటల సాగుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. భూములు బీడుగానైనా వదిలేస్తామని, పంటసాగు చేసి తెచ్చిన అప్పులు తిరిగి చెల్లించలేక నష్టాల ఊబిలో కూరుకుపోలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు మూడేళ్ల క్రితం కావలి కాలువ కింద రైతులు బోరుబావుల కింద రెండో పంటగా వరి, పత్తి, వేరుశనగ సాగు చేసేవారు. ప్రస్తుతం బోరుబావులతో పనిలేకుండా రెండో పంటకు 75 వేల ఎకరాలకు సాగునీరు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. అయినా ఏ ఒక్క రైతు సాగుకు ముందుకు రావడం లేదు. దీనికి ప్రధాన కారణం గత ఏడాది రెండు దఫాలూ వరి సాగు చేయగా దిగుబడులు భారీగా తగ్గి ఎకరానికి రెండుపుట్ల ధాన్యం కూడా రాలేదు. ఈ ఏడాది మొదటి పంట కూడా గత ఏడాది లాగే దిగుబడి తగ్గింది. ఆరుగాలం కష్టించి పండించిన అరకొర ధాన్యాన్ని అమ్ముకోవాలంటే నానాఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇక కౌలురైతు పరిస్థితి మరింత దారుణంగా మారింది. దీనికి తోడు పెట్టుబడులు రెట్టింపు అయ్యాయి. దీంతో నష్టాలే మిగిలాయి. గతంలో ఎకరం వరి సాగుకు రూ.15వేలు ఉంటే ప్రస్తుతం రూ.25వేల నుంచి రూ.30వేల వరకు ఖర్చవుతోంది. ప్రధానంగా కూలీల రేట్లతో పాటు ఎరువులు, డీజిల్‌ ధరలు ఆమాంతం పెరగడం పెట్టుబడులు రెట్టింపునకు ప్రధాన కారణంగా రైతులు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాలువకు నీరిచ్చినా ఆదాయం లేని వ్యవసాయం ఎందుకు చేయాలనే మీమాంసలో అన్నదాతలు ఉన్నారు.

రైతులకు చేయూత కరువు

రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం రైతు భరోసా, పీఎంకిసాన్‌తో సరిపెడుతున్నాయి తప్ప మరే ఇతర చేయూత కరువైంది. ప్రతి ఏటా కేంద్రం మూడు విడతల్లో, రాష్ట్రం మూడు విడతల్లో కలిపి ఆరు విడతల్లో ఇచ్చే రూ.13,500 సాయంతో రైతుకు మేలు జరగడం లేదు. వీటిని బూచిగా చూపి గతంలో రైతులకు అందించే పలు పథకాలకు పూర్తిగా ప్రభుత్వాలు మంగళం పాడాయి. రాయితీపై వ్యవసాయ పనిమట్లు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందడం లేదు. అంతే కాకుండా గత ప్రభుత్వం హయాంలో సూక్ష్మపోషకాలు రైతులకు విరివిగా అందించారు. దీంతో అప్పుడు దాతులోపాల నివారణ జరిగి జిల్లాలో పంట దిగుబడులు భారీగా పెరిగి రైతులకు లాభాలు వచ్చేవి. ప్రస్తుతం అవిలేకపోవడంతో దిగుబడులు భారీగా తగ్గాయి. 

రాయితీలు కొనసాగించాలి

గతంలో రైతులకు వ్యవసాయశాఖ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన పలురకాల రాయితీలు తిరిగి కొనసాగించి అన్నదాతలను ఆదుకోవాలని జిల్లా రైతాంగం కోరుతోంది. ఇప్పటికైనా పాలకులు స్పందించి ఈ విషయంపై పునరాలోచించాలని, లేనిపక్షంలో సాగునీరిచ్చినా పంటలు సాగు చేయలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు.



Updated Date - 2021-04-17T03:42:16+05:30 IST