కోవిడ్‌-19 కట్టడికి పరికరం

ABN , First Publish Date - 2020-03-28T05:53:03+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను కట్టడి చేసే పరికరాన్ని అభివృద్ధి చేసినట్లు డి స్కలీన్‌ అనే సంస్థ ప్రకటించింది. ఈ పరికరం కోవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తిని అడ్డుకుంటుందని తెలిపింది.

కోవిడ్‌-19 కట్టడికి పరికరం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను కట్టడి చేసే పరికరాన్ని అభివృద్ధి చేసినట్లు డి స్కలీన్‌ అనే సంస్థ ప్రకటించింది. ఈ పరికరం కోవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తిని అడ్డుకుంటుందని తెలిపింది. దీని సమర్థతను నిర్ధారించేందుకు అమెరికాలోని మేరీలాండ్‌ విశ్వవిద్యాలయానికి పంపిస్తున్నట్టు పేర్కొంది. డీ స్కలీన్‌ అనేది మెడికల్‌ ఎలక్ర్టానిక్‌ రీసెర్చ్‌ యూనిట్‌. ఈ సంస్థ అధ్యక్షుడు డాక్టర్‌ రాజేశ్‌ విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ తాము ఓ చిన్న పరికరాన్ని అభివృద్ధి పరిచామని తెలిపారు. దీనిని ‘స్కలీన్‌ హైపర్‌ఛార్జ్‌ కరోనా కెనాన్‌’ అని పిలుస్తున్నట్లు పేర్కొన్నారు.  కోవిడ్‌-19తో బాధపడుతున్నవారికి ఈ పరికరం వల్ల ఉపయోగం ఉండదన్నారు. ఇది రోగాన్ని నయం చేసేది కాదు, వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే పరికరం మాత్రమే అని వివరించారు. కోవిడ్‌ పాజిటివ్‌ రోగితో కలిసి మరో వ్యక్తి ఓ గదిలో ఉన్నపుడు, ఆ రోగి నుంచి  వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఈ పరికరం కాపాడుతుందని ఆయన చెప్పారు. ఈ పరికరం నుంచి పెద్ద ఎత్తున ఎలక్ర్టాన్లు వెలువడతాయని, అవి వైరస్‌ ను నాశనం చేస్తాయని తెలిపారు.


2019 ఏప్రిల్‌ నుంచే పరిశోధన

ఈ పరికరాన్ని కనుగొనడం వెనుక కారణాన్ని డాక్టర్‌ రాజేశ్‌ వివరించారు. తమ సంస్థలో శాస్త్రవేత్తలు, పరిశోధకులు సెలవులు పెడుతున్నారని, దీనిని అరికట్టేందుకు ఏదైనా ఉపాయం ఆలోచించాలని అనుకున్నట్లు తెలిపారు. ఒకరికి జలుబు చేస్తే మిగతావాళ్ళకి అంటుకుంటుందని, ఫలితంగా సెలవులు పెట్టడం ఎక్కువవుతోందని అన్నారు. దీంతో తమ సంస్థలోని శాస్త్రవేత్తలకు ఓ ఆలోచన వచ్చిందన్నారు. అన్ని రకాల ఫ్లూలను నాశనం చేసే పరికరాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. కనీసం తమ సంస్థలోనైనా ఒకరి నుంచి మరొకరికి జలుబు, ఫ్లూ వంటివి అంటుకోకుండా ఉండేలా పరికరాన్ని రూపొందించాలనుకున్నామన్నారు. కోవిడ్‌-19 ప్రపంచాన్ని దెబ్బ తీస్తుండటంతో, ఈ పరికరాన్ని దానిపై ప్రయోగించి చూడాలనుకున్నామన్నారు. స్కలీన్‌ హైపర్‌ఛార్జ్‌ కరోనా కెనాన్‌ పరికరం సామర్థ్యాన్ని పరీక్షించాలని కోరుతూ అమెరికాలోని మేరీలాండ్‌ విశ్వవిద్యాలయానికి, మెక్సికోలోని ఓ ఇన్‌స్టిట్యూట్‌కు లేఖలు రాశామన్నారు. మన దేశంలో ఫిబ్రవరి మొదటి వారంలో మూడు కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, అప్పుడే ఈ పరికరం గురించి కేంద్ర ఆరోగ్యం, సంబంధిత మంత్రిత్వ శాఖకు తెలియజేశామన్నారు.

Updated Date - 2020-03-28T05:53:03+05:30 IST