ఎంపీడీవోపై విచారణ సమయంలో తోపులాట

ABN , First Publish Date - 2021-02-28T07:00:34+05:30 IST

పామూరు మండలంలో పంచాయతీ ఎన్నికల్లో వలంటీర్లపై ఎంపీడీవో ఒత్తిడి పెట్టారని అందిన ఫిర్యాదుపై శనివారం విచారణ జరిగింది.

ఎంపీడీవోపై విచారణ సమయంలో తోపులాట
తహసీల్దార్‌ సమక్షంలో వైసీపీ టీడీపీ వాగ్వాదం

టీడీపీ నాయకులపై వైసీపీ నేతల దాడి

తహసీల్దార్‌ సమక్షంలో ఘటన

పామూరు, ఫిబ్రవరి 27: పామూరు మండలంలో  పంచాయతీ ఎన్నికల్లో వలంటీర్లపై ఎంపీడీవో ఒత్తిడి పెట్టారని అందిన ఫిర్యాదుపై శనివారం విచారణ జరిగింది. అయితే విచారణ సమయంలో తహసీల్దార్‌ సమక్షంలో వైసీపీ- టీడీపీ మధ్య తోపులాట జరగడం గమనార్హం.

ఎంపీడీఓ ఎం.రంగసుబ్బరాయుడు వైసీపీకి కొమ్ము కాస్తూ, వలంటీర్లను వేధిస్తున్నారని ఆరోపిస్తూ టీడీపీ నాయకులైన బైరెడ్డి జయరామిరెడ్డి, గంగరాజు యాదవ్‌లు ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కందుకూరు సబ్‌ కలెక్టర్‌ భార్గవ తేజ్‌  ఎంపీడీవోపై వచ్చిన ఆరోపణలపై విచారించి నివేదికి ఇవ్వాలని పామూరు తహసీల్దార్‌ సిహెచ్‌ ఉషకు ఆదేశాలు జారీ చేశారు. సబ్‌ కలెక్టర్‌ ఆదేశాల్లో భాగంగా తహశీల్దార్‌ కార్యాలయంలో శనివారం విచారణ చేపట్టారు. ముందుగా టీడీపీ నాయకులు ఫిర్యాదులోని అంశాలు వివరిస్తున్నారు. ఈ విచారణ, ఎంపీడీవో, వలంటీర్లు, ఫిర్యాదు చేసిన టీడీపీ మధ్య జరగాల్సి ఉంది. అయితే  విచారణకు సంభందంలేకుండా వైసీపీ నాయకులైన గంగసాని హుస్సేన్‌రెడ్డి, చప్పిడి సుబ్బయ్య, బారా షరీ్‌ఫలు ఒక్కసారిగా తహసీల్దార్‌ కార్యాలయంలోకి చొచ్చుకొచ్చారు. విచారణ జరగుతుండగా తహసీల్దార్‌ సమక్షంలో టీడీపీ నాయకులను దుర్భాషలాడుతూ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే స్వల్ప తోపులాట జరిగింది.   దీంతో కార్యాలయంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. కార్యాలయంలో ఏమి జరుగుతుందో అర్థంకాక విచారణకు వచ్చిన వలంటీర్లు భయభ్రాంతులకు గురైయ్యారు. ఇంతలోనే పోలీసులు వచ్చి ఇరుపార్టీల నాయకులను కార్యాలయ ఆవరణ నుంచి పంపించి వేశారు. అనంతరం తహసీల్దార్‌ వలంటీర్లను పిలిచి ‘మీపై ఎంపీడీవో రాజకీయంగా ఒత్తిడి తెచ్చారా..?’ అని ప్రశ్నించారు. అయితే వారు అదేమి లేదని పేర్కొన్నారు. ఆ మేరకు స్టేట్‌మెంట్‌ నమోదు చేసినట్లు తహసీల్దార్‌ తెలిపారు.

వైసీపీ దాడి గర్హనీయం

ఫిర్యాదు నేపథ్యంలో వివరాలు తెలియజేస్నుత్న టీడీపీ నేత గంగరాజుపై వైసీపీ నేతలు దాడి చేయడం గర్హనీయని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. అధికారుల సమక్షంలో దాడి జరగడం ప్రస్తత పాలనకు నిదర్శనమని విమర్శించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆర్‌ఆర్‌రఫి, మా కోఆప్షన్‌ ఖాజా రహంతుల్లా, పువ్వాడి రామారావు, మన్నం రమణయ్యతో పాటు సిపిఐ నాయకులు ఎస్‌డి మౌలాలి, మస్తాన్‌రావు, వజ్రాల సుబ్బారావు, సిపిఐ నాయకులు కె మాల్యాద్రి, శంకర్‌తో పాటు ఎంపీడీవో ఎం రంగసుబ్బరాయుడు వలంటీర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-28T07:00:34+05:30 IST