స్టార్టప్‌ల్లో ఉద్యోగాలకు కత్తెర

ABN , First Publish Date - 2022-05-29T08:54:52+05:30 IST

దేశీయ స్టార్ట్‌పల రంగంలో ఈ ఏడాది ఉద్యోగాల కోతలు భారీగా పెరిగాయి.

స్టార్టప్‌ల్లో  ఉద్యోగాలకు కత్తెర

ఈ ఏడాదిలో ఇప్పటివరకు దాదాపు 8,000 మందికి ఉద్వాసన 

మరికొద్ది నెలల్లో తొలగింపులు 60,000 వరకు చేరుకునే చాన్స్‌ 

కీలకేతర కార్యకలాపాలూ కట్‌ 

మార్కెటింగ్‌, ప్రచార ఖర్చుల్లోనూ కోత 

ఫండింగ్‌ తగ్గడమే ప్రధాన కారణం 


 దేశీయ స్టార్ట్‌పల రంగంలో ఈ ఏడాది ఉద్యోగాల కోతలు భారీగా పెరిగాయి. ఈ ఐదు నెలల్లో పలు స్టార్ట్‌పలు దాదాపు 8,000 మంది సిబ్బందికి ఉద్వాసన పలికినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. వందల సంఖ్యలో తీసివేతలకు పాల్పడిన జాబితాలో బ్లింకిట్‌ (గతంలో గ్రోఫర్స్‌), ఓలా, వైట్‌హ్యాట్‌ జూనియర్‌, అన్‌ఎకాడమీ, కార్స్‌ 24, వేదాంతు, ఎంఫైన్‌, మీషో, ట్రెల్‌, ఫర్‌లెన్కో వంటి ప్రముఖ స్టార్ట్‌పలు కూడా ఉన్నాయి. మున్ముందు నెలల్లో ఈ రంగంలో ఉద్యోగుల తొలగింపులు 60,000 వరకు చేరుకోవచ్చని గ్లామ్యో హెల్త్‌ సహ వ్యవస్థాపకులు అర్చిత్‌ గార్గ్‌ అభిప్రాయపడ్డారు. ఫండింగ్‌ బాగా తగ్గిపోవడంతో ప్రస్తుతం స్టార్ట్‌పల రంగం ఒత్తిడిలో ఉందని, నిధుల లభ్యత మళ్లీ మెరుగుపడేందుకు కనీసం 6-9 నెలలు పట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం చేతిలో ఉన్న నిల్వలను కాపాడుకునేందుకు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా స్టార్ట్‌పలు వ్యయాల నియంత్రణపై దృష్టిసారించాయని.. ఆ వ్యూహంలో భాగంగానే ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయని ఇండస్ట్రీ విశ్లేషకులు తెలిపారు. కరోనా ఆంక్షలు ఎత్తేయడంతో విద్యార్థులు మళ్లీ బడిబాట పట్టారు. తత్ఫలితంగా ఆన్‌లైన్‌ బోధనకు డిమాండ్‌ తగ్గడంతో ఎడ్యుటెక్‌ స్టార్ట్‌పలపై ఒత్తిడి అధికమైందని వారు పేర్కొన్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా స్టార్ట్‌పలు ఉద్యోగుల తొలగింపులతో పాటు కీలకేతర విభాగాల కార్యకలాపాలకూ స్వస్తి పలుకుతున్నాయి. అంతేకాదు, మార్కెటింగ్‌, ప్రచార వ్యయాలకూ కత్తెర పెడుతున్నాయి.


ముందున్నది గడ్డుకాలం..

గత ఏడాది భారత స్టార్ట్‌పల్లోకి రికార్డు స్థాయిలో 3,500 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు వచ్చాయి. నిధులు వరదలా ప్రవహించడంతో గత ఏడాది వారానికో స్టార్టప్‌ యూనికార్న్‌గా (100 కోట్ల డాలర్ల మార్కెట్‌ విలువ కలిగిన స్టార్టప్‌) ఎదిగింది.  అయితే, ఈ ఏడాదిలో పరిస్థితులు క్రమంగా తలక్రిందులవుతూ వచ్చాయి. అంతర్జాతీయంగా ధరలు అందోళనకర స్థాయికి పెరగడం, వడ్డీ రేట్లు మళ్లీ ఎగబాకుతుండటం, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలతో ఆర్థిక పురోగతిపై పెరిగిన అనిశ్చితి, మాంద్యం భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు గండికొట్టాయి. దాంతో ఈ ఏడాది ప్రారంభం నుంచే వెంచర్‌ క్యాపిటలి్‌స్టలు, ప్రైవేట్‌ ఈక్విటీ ఇన్వెస్టర్లు, ఏంజిల్‌ ఇన్వెస్టర్లు స్టార్ట్‌పల్లో కొత్త పెట్టుబడులను క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నారు. మున్ముందు ఫండింగ్‌ మరింత తగ్గనుందని, స్టార్ట్‌పలు తమ వద్దనున్న నిధులను పొదుపుగా ఉపయోగించుకోవడం మేలని వారు సంకేతాలిస్తున్నారు. అమెరికాలో వడ్డీ రేట్ల సెగతోపాటు ఆర్థిక మాంద్యం భయాలు రోజురోజుకూ పెరుగుతుండటంతో రాబోయే గడ్డుకాలాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సిలికాన్‌ వ్యాలీ ఇంక్యుబేటర్‌, స్టార్టప్‌ ఫండ్‌ అయిన వై కాంబినేటర్‌ తన పోర్ట్‌ఫోలియో ఫౌండర్స్‌ను హెచ్చరించింది. వై కాంబినేటర్‌ భారత్‌కు చెందిన 150 స్టార్ట్‌పల్లో పెట్టుబడులు కలిగి ఉంది. 



బ్యాక్‌ టు ఐటీ 

స్టార్ట్‌పల్లో ఉద్యోగ భద్రత లోపించడంతో టెక్‌ నిపుణులు తిరిగి ఐటీ కంపెనీల్లో చేరుతున్నారని టాలెంట్‌ కన్సల్టింగ్‌ కంపెనీ హాన్‌ డిజిటల్‌ తెలిపింది. స్టార్ట్‌పలను వీడుతున్న టెక్‌ నిపుణుల్లో సగం మంది ఐటీ కంపెనీలు, కన్సల్టింగ్‌, ప్రొడక్ట్‌ డెవల్‌పమెంట్‌ కంపెనీలు, గ్లోబల్‌ క్యాప్టివ్‌ సెంటర్లలో చేరుతున్నారని వెల్లడించింది. స్టార్ట్‌పల ఆకర్షణీయ ప్యాకేజీల కారణంగా గడిచిన రెండేళ్లలో ఐటీ కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను కోల్పోయాయి. ఐటీ సేవలకు డిమాండ్‌ పెరిగిన అనూహ్యంగా పుంజుకున్న తరుణంలో ఉద్యోగుల వలసలు కూడా భారీగా పెరిగాయి.

 దీంతో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ వంటి దేశీయ ఐటీ సంస్థలు రికార్డు స్థాయిలో ఫ్రెషర్లను నియామకాలు చేపడుతున్నాయి. మున్ముందు స్టార్ట్‌పల రంగంలో ఉద్యోగాల కోతలు పెరగనుండటంతో పాటు కొత్త ఉద్యోగ నియామకాలు కూడా ఉండకపోవచ్చన్న అంచనాలున్నాయి. దాంతో ఐటీ కంపెనీలకు నిపుణుల లభ్యత మళ్లీ పెరగవచ్చని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. 



ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో కస్టమర్లు తమ కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేసుకోవచ్చు. కాబట్టి స్టార్ట్‌పలు వ్యాపారాన్ని కొనసాగించేందుకు నిధులను పొదుపుగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. వ్యాపారాల్లో ప్రత్యామ్నాయ అవకాశాల కోసం అన్వేషించాలి. 

- వాణి కోలా, కలారి క్యాపిటల్‌ వ్యవస్థాపకురాలు 


దేశంలోని ఇతర రంగాల్లో నిపుణులకు భారీ కొరత ఉన్నందున స్టార్ట్‌పల్లో ఉద్యోగం కోల్పోయిన వారికి మళ్లీ ఉద్యోగం లభించవచ్చు. అయితే, స్టార్టప్‌ ఉద్యోగులు ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏదైనా స్టార్టప్‌ త్వరగా, భారీగా నిధులు సమీకరిస్తోందంటే వాటిని అంతే వేగంగా ఖర్చు చేస్తోందన్నమాట. కాబట్టి, భారీగా ఖర్చు చేసే స్టార్ట్‌పలే తొలుత వ్యయ నియంత్రణ చర్యలు చేపడతాయన్న విషయాన్ని ఉద్యోగులు గుర్తుంచుకోవాలి.  

- ఆనంద్‌ లునియా, ఇండియా కోషెంట్‌ ప్రతినిధి ’


 అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో మరికొన్ని త్రైమాసికాల వరకు మూలధన నిధులకు కొరత ఏర్పడవచ్చు. ఈ అనిశ్చితిల్లో ప్రస్తుతమున్న మూలధన నిధులనే దీర్ఘకాలం పాటు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆన్‌లైన్‌ విద్యకు డిమాండ్‌ పెరగడంతో గత రెండేళ్లలో తమ స్టార్టప్‌ అనూహ్య వృద్ధిని నమోదు చేసుకోగలిగింది. కానీ, కరోనా ఆంక్షల సడలించడంతో బడులు మళ్లీ తెరుచుకోవడంతో సంస్థ వృద్ధి కూడా మందగించనుంది.       -

-వంశీకృష్ణ, వేదాంతు సహ వ్యవస్థాపకుడు, సీఈఓ 


Updated Date - 2022-05-29T08:54:52+05:30 IST