Space Agriculture : చంద్రునిపై పంటలు పండించొచ్చు

ABN , First Publish Date - 2022-05-13T23:07:31+05:30 IST

‘చందమామ రావే, జాబిల్లి రావే’ అని పాడుకోవడం ఆపేసి, ఇక చంద్రుని

Space Agriculture : చంద్రునిపై పంటలు పండించొచ్చు

న్యూఢిల్లీ : ‘చందమామ రావే, జాబిల్లి రావే’ అని పాడుకోవడం ఆపేసి, ఇక చంద్రునిపైనే పంటలు పండించే రోజులు రాబోతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చంద్రుడి నుంచి తీసుకొచ్చిన కొంచెం మట్టితో చేసిన ప్రయోగాలు రోదసీ వ్యవసాయ విజ్ఞానంలో గొప్ప ముందడుగు వేయడానికి దోహదపడ్డాయని అంటున్నారు. అపోలో ప్రోగ్రామ్‌లో వ్యోమగాములు తీసుకొచ్చిన ల్యూనార్ సాయిల్‌లో మొట్టమొదటిసారి మొక్కలను పెంచినట్లు చెప్తున్నారు. ఈ వివరాలను ‘కమ్యూనికేషన్స్ బయాలజీ’ అనే జర్నల్ ప్రచురించింది. 


ఈ అధ్యయనాన్ని నిర్వహించిన ఫ్లోరిడా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం, ఈ అంశంపై ఇంకా చాలా పరిశోధనలను నిర్వహించవలసి ఉంది. అమెరికా రోదసీ పరిశోధనల సంస్థ NASA చీఫ్ బిల్ నెల్సన్ మాట్లాడుతూ, దీర్ఘకాలిక పరిశోధనల లక్ష్యాలకు తాజా పరిశోధన అత్యంత కీలకమైనదన్నారు. చంద్రుని చీకటి భాగానికి ఆవలివైపునగల ప్రాంతంలో నివసిస్తూ, కార్యకలాపాలను నిర్వహించే వ్యోమగాముల కోసం ఆహార వనరులను అభివృద్ధి చేయడానికి అంగారక, చంద్రులపై దొరికిన వనరులను మనం ఉపయోగించుకోవలసిన అవసరం ఉందన్నారు. 


పరిశోధకులు తాజా ప్రయోగంలో కేవలం 12 గ్రాముల ల్యూనార్ సాయిల్‌ను ఉపయోగించారు. దీనిని అపోలో 11, 12, 17 మిషన్స్‌లో చంద్రునిపై వివిధ ప్రాంతాల నుంచి సేకరించారు. చేతి వేలు పై భాగానికి పట్టే పరిమాణంగల కుండలలో ఈ ల్యూనార్ సాయిల్‌ (రిగొలిత్)ను వేసి, నీరు పోసి, విత్తనాలను నాటారు. ప్రతి రోజూ ఈ మొక్కలకు న్యూట్రియెంట్ సొల్యూషన్‌ను కూడా అందించారు. 


ఆవాల తరహాలోని ఓ మొక్క అరబిడోప్సిస్ థలియానాను ఈ ల్యూనార్ సాయిల్ (రిగొలిత్)లో పండించారు. ఈ విత్తనాలు యూరాసియా, ఆఫ్రికాలో ఉంటాయి. ఇవి ఆవ గింజలు, కాలిఫ్లవర్ తరహాకు చెందినవి. ఇవి చాలా తేలికగా పెరుగడం మాత్రమే కాకుండా  వీటిపై పరిశోధనలు కూడా విస్తృతంగా జరిగినందువల్ల వీటిని ఎంచుకున్నారు. దీని జన్యుపరమైన కోడ్, ప్రతికూల పరిస్థితుల్లో దీని స్పందనలు కూడా సుపరిచితం. అదేవిధంగా రోదసి వాతావరణంలో వీటి పరిస్థితులపై కూడా అవగాహన ఉంది. అందుకే వీటిని ల్యూనార్ సాయిల్‌లో నాటారు. భూమిపైగల మట్టిలోనూ, అంగారక గ్రహం నుంచి తీసుకొచ్చిన మట్టిలోనూ కొన్ని విత్తనాలను నాటారు. రెండు రోజుల తర్వాత ఈ అన్ని రకాల మట్టిలలో నాటిన విత్తనాలు మొలకెత్తాయి. 


ఈ పరిశోధన పత్రం ప్రధాన రచయిత అన్నా-లీసా పౌల్ ఓ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ల్యూనార్, భూమి, అంగారక మట్టిలలో నాటిన విత్తనాల నుంచి వచ్చిన మొక్కలన్నీ ఆరు రోజుల వరకు ఒకే విధంగా కనిపించాయి. ఆరు రోజుల తర్వాత వీటి మధ్య తేడాలు కనిపించాయి. ల్యూనార్ సాయిల్‌లోని మొక్కల ఎదుగుదల నెమ్మదిగా ఉన్నట్లు, వేళ్లు గిడసబారినట్లు కనిపించాయి. 20 రోజుల తర్వాత ఈ మొక్కలన్నిటినీ కోసి, వాటి డీఎన్ఏపై అధ్యయనాలు నిర్వహించారు. 


ప్రతికూల వాతావరణాల్లో పెరిగినవాటి మాదిరిగానే ల్యూనార్ ప్లాంట్స్ కూడా ప్రతిస్పందిస్తున్నట్లు ఈ విశ్లేషణల్లో తేలింది. ఉప్పు కలిపిన మట్టిలోనూ, భార లోహాలు కలిసిన మట్టిలోనూ పెరిగిన మొక్కల మాదిరిగానే ఇవి కూడా స్పందించినట్లు గమనించారు. ఈ వాతావరణం మరింత అనుకూలంగా ఉండేలా చేయడమెలా? అనే దానిని శాస్త్రవేత్తలు అర్థం చేసుకోవాలనుకుంటున్నారు. 


ఆర్టెమిస్ ప్రోగ్రామ్‌లో భాగంగా చంద్రునిపైకి మళ్ళీ వెళ్ళాలని NASA సిద్ధమవుతోంది. చంద్రుని ఉపరితలంపై మానవుడు శాశ్వతంగా ఉండేవిధంగా చేయాలన్న దీర్ఘకాలిక లక్ష్యంతో వెళ్ళబోతోంది. అదేవిధంగా ల్యూనార్ స్టేషన్‌ను నిర్మించేందుకు చైనా, రష్యా చేతులు కలిపాయి. 


Read more