టోక్యో: వేగంగా కరోనా టెస్టులు నిర్వహించి రోగులను గుర్తించడమనేది వైరస్ కట్టడికి ఎంతో అవసరం. దీంతో వేగంగా ఫలితాలు ఇచ్చే కరోనా టెస్టులు రూపొందించేందుకు సైంటిస్టులు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఈ దిశగా జపాన్ శాస్త్రవేత్తలు కీలక ఆవిష్కరణకు చేశారు. ఒక్క కరోనా కణాన్ని కూడా గుర్తించ గలిగే కొత్త విధానాన్ని వారు రూపొందించారు. అతి సూక్ష్మ రంధ్రాలున్న జాలీలో నుంచి వైరస్ కణాలను పంపించడం ద్వారా వైరస్‌ను గుర్తించే పద్ధతిని తయారు చేశారు. ఈ విధానంలో భాగంగా.. జాలీలోని విద్యుత్ ప్రవాహంలో జరిగే మార్పుల ఆధారంగా వారు వైరస్ కణాలను గుర్తించారు. ఈ పద్ధతి ద్వారా కనిష్టంగా ఒక్క వైరస్ కణాన్ని కూడా గుర్తించొచ్చని వారు చెబుతున్నారు. ఓసాకా యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు ఏసీఎస్ సెన్సర్ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. భవిష్యత్తులో.. మరింత వేగంగా కచ్చితమైన ఫలితాలను ఇచ్చే కరోనా టెస్టులను రూపొందించేందుకు ఈ పద్ధతి కొత్త దారి పరుస్తుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.