గ్రహాంతరవాసులకు మరో మెసేజ్ పంపేందుకు శాస్త్రవేత్తల యత్నం

ABN , First Publish Date - 2022-04-19T22:58:11+05:30 IST

గ్రహాంతరవాసులతో సంబంధాలు ఏర్పరచుకోవాలని శాస్త్రవేత్తలు విపరీతంగా

గ్రహాంతరవాసులకు మరో మెసేజ్ పంపేందుకు శాస్త్రవేత్తల యత్నం

న్యూఢిల్లీ : గ్రహాంతరవాసులతో సంబంధాలు ఏర్పరచుకోవాలని శాస్త్రవేత్తలు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. చంద్రునిపై కాలు మోపిన తర్వాత 1974 నవంబరులో విశాల విశ్వంలోకి మరింత చొచ్చుకెళ్ళాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ప్యూర్టోరికోలోని శక్తిమంతమైన అరెకిబో టెలిస్కోప్ ద్వారా ఓ రేడియో సందేశాన్ని పంపించారు. దాదాపు 5 దశాబ్దాల అనంతరం ఇప్పుడు మరొక సందేశాన్ని పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 


1974 నవంబరులో పంపిన రేడియో సందేశంలో మౌలిక జీవ సంబంధిత రసాయనాల సమాచారం, డీఎన్ఏ నిర్మాణం, సౌర కుటుంబంలో భూమి ఉండే చోటు, మానవుడి బొమ్మలను పంపించారు. దీనిని కార్నెల్ ఆస్ట్రానమీ ప్రొఫెసర్ ఫ్రాంక్ డ్రేక్, ఫిజిసిస్ట్ కార్ల్ సాగన్ రూపొందించారు. ఇది ఇప్పటికీ విశ్వంలో ప్రయాణిస్తూనే ఉంది. ఇప్పుడు మరొక సందేశాన్ని పాల పుంత నక్షత్ర మండలంలోని గ్రహాంతరవాసులకు పంపించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 


భూమిపైగల మానవులకు, భూమికి వెలుపలగల గ్రహాంతరవాసులకు మధ్య సంబంధాలు ఏర్పడటం కోసం మాధ్యమాలను తెరవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని కోసం నక్షత్రాల మధ్యకు సందేశాన్ని పంపించాలని శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. కమ్యూనికేషన్ కోసం సరళ సూత్రాలు, ప్రాథమిక గణిత భావనలు, భౌతిక సూత్రాలు, డీఎన్ఏలోని భాగాలు, మానవులకు సంబంధించిన సమాచారం, భూమి, తిరిగి ఎవరైనా సమాధానం ఇవ్వాలని అనుకుంటే ఉపయోగపడేందుకు చిరునామా వంటివాటిని పంపించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాలకు జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీకి చెందిన డాక్టర్ జొనాథన్ జియాంగ్ నాయకత్వం వహిస్తున్నారు. 


ఈ సందేశాలను చైనాలోని 500 మీటర్ల అపెర్చర్ స్ఫియరికల్ రేడియో టెలిస్కోప్, ఉత్తర కాలిఫోర్నియాలోని SETI ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న అలెన్ టెలిస్కోప్ ఎరే నుంచి పంపించాలని ప్రతిపాదించారు. పాల పుంతలో జీవం అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ పాల పుంతలోని ఎంపిక చేసిన ప్రాంతంలోకి ఈ సందేశాలను పంపించాలని ప్రతిపాదించారు. 


1973లో సందేశాన్ని పంపించిన అరెకిబో రేడియో టెలిస్కోప్‌ తర్వాతి తరానికి చెందిన శక్తిమంతమైన నూతన బెకన్స్ ద్వారా తాజా సందేశాలను పంపించాలని నిర్ణయించినట్లు పరిశోధకులు చెప్పారు. అరెకిబోపై కూడా ప్రస్తుతం కొంత వరకు ఆధారపడుతున్నట్లు తెలిపారు. భూమిపైగల సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నాగరికత నుంచి వెళ్లే ఈ సునిర్మిత కమ్యూనికేషన్‌తో ఈ కొత్త బెకన్స్ అరెకిబో వారసత్వాన్ని 21 శతాబ్దంలోకి తీసుకెళ్తాయన్నారు. 


సౌర వ్యవస్థ, భూమి ఉపరితలం, మానవ రూపం చిత్రాలను ఈ మెసేజ్ డిజిటైజ్ చేస్తుందని పరిశోధకులు చెప్పారు. స్పందించగలిగే గ్రహాంతరవాసులు ఉంటే, వారికి ఆహ్వానాన్ని కూడా ఈ సందేశంలో పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పత్రాలను ఇంకా పీర్ రివ్యూ చేసి, ప్రచురించవలసి ఉంది, 


పాల పుంత నక్షత్ర మండలంలో మేధాశక్తిగల జీవులను గుర్తించేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నారు. మన నక్షత్ర మండలంలోనే 5,000కుపైగా ప్రపంచాలను అమెరికాలోని నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) గుర్తించింది. వీటిలో జీవానికి తగిన పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ ప్రపంచాలన్నిటినీ అధ్యయనం చేయడం ప్రస్తుత టెక్నాలజీతో సాధ్యం కాదు. 


Updated Date - 2022-04-19T22:58:11+05:30 IST