Abn logo
Apr 22 2021 @ 02:02AM

ఆణిముత్యములె తలంబ్రాలుగా..

  • భద్రాద్రిలో శాస్త్రోక్తంగా సీతారాముల కల్యాణం
  • పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
  • నేడు శ్రీరామ మహా పట్టాభిషేకం


భద్రాచలం, ఏప్రిల్‌ 21: శివ ధనస్సును ఎత్తి విరిచేసిన రామయ్య..  బాల్యంలోనే ఆ విల్లును ఓ పక్కకు తోసేసిన ఘనత గల సీతమ్మ. ఆ చేతులతోనే వధూవరులుగా ఇద్దరూ పూలదండలు పట్టుకొని నడిచొస్తుంటే ఆ బరువుకు కరకమలాలు కందిపోవునేమో అన్నంత సౌకుమార్యం వారిలో! ఆ తలంబ్రాలు ఎంత పుణ్యం చేసుకున్నాయో.. రామచంద్రుడు దోసిట్లోకి తీసుకుంటే నీలపురాశిగా, జానకి దోసిట్లోకి తీసుకుంటే కెంపులుగా మారిపోయి.. పరస్పరం తలమీద పోసుకుంటుంటే అణిముత్యాలుగా మెరిసి మురిశాయి. ఆ కమీనయ దృశ్యంతో భక్తజనం పులకించిపోయింది. జగదానందకారకా.. జయ జానకీ ప్రాణ నాయకా అంటూ జేజేలు పలకింది. బుధవారం శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రి క్షేత్రంలోని నిత్య కల్యాణ మండపంలో శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం వైభవంగా జరిగింది. విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం, యోక్త్రబందనం, రక్షాబంధనం, యజ్ఞోపవీతదారణ, కన్యావరణం, పాదప్రక్షాళన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. 


రాఘవుడికి పచ్చలపతకం, సీతమ్మవారికి చింతాకు పతకం, లక్ష్మణస్వామికి శ్రీరామమాడ సమర్పించారు. మహాసంకల్పం పఠించి అభిజిత్‌లగ్నంలో వధూవరుల శిరసుపై జీలకర్ర, బెల్లం ఉంచారు. అనంతరం మాంగల్యపూజ నిర్వహించి రామదాసు చేయించిన మూడు తాళిబొట్లున్న ప్రత్యేకమైన మంగళసూత్రాన్ని సీతమ్మవారికి ధరింపజేశారు. నూతన వధూవరులకు గోదాదేవి అనుగహ్రించిన నాట్యాతిరుమళి ప్రబంధంలోని వారణమాయరం పాశురాలను పఠనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు సమర్పించారు. వేద ఆశీర్వచనం, అష్టోత్తర హారతితో శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణ తంతు సుసంపన్నమైంది. ఈ వేడుకలో మంత్రి పువ్వాడ అజయ్‌, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, భద్రాచలం, నాగర్‌కర్నూలు ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, మర్రి జనార్దన్‌రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, భద్రాద్రి దేవస్థానం ఈవో బి.శివాజీ తదితరులు పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి కారణంగా వేడుకను తిలకించేందుకు భక్తులను అనుమతించకపోవంతో టీవీల్లోనే జనం వీక్షించారు. కాగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గురువారం శ్రీరామ మహాపట్టాభిషేకాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయ ప్రాంగణంలోని నిత్య కల్యాణ మండప వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

Advertisement
Advertisement
Advertisement