సైన్స్‌ను క్షేత్రస్థాయికి విస్తరించాలి

ABN , First Publish Date - 2021-03-01T07:43:04+05:30 IST

ఆత్మనిర్భర భారత్‌ అనేది కేవలం కేంద్ర ప్రభుత్వ విధానం కాదని.. జాతీయ స్ఫూర్తి అని ప్రధాని మోదీ చెప్పారు. ‘స్వావలంబన భారత్‌’ అనే మంత్రం గ్రామాలకు కూడా చేరుకుందన్నారు...

సైన్స్‌ను క్షేత్రస్థాయికి విస్తరించాలి

  • సైన్స్‌ అంటే ఫిజిక్స్‌, కెమిస్ట్రీయే కాదు.. ‘ల్యాబ్‌ టు ల్యాండ్‌’తో ముందుకెళ్లాలి
  • అందుకు ఉదాహరణ వెంకట్‌రెడ్డి.. ‘విటమిన్‌ డి’ వరి, గోధుమ పండించారు
  • పేటెంట్‌ హక్కును కూడా పొందారు.. హైదరాబాద్‌ రైతుకు ప్రధాని ప్రశంస
  • జల సంరక్షణ సమష్టి బాధ్యత.. 100 రోజుల ‘క్యాచ్‌ ది రెయిన్‌’ ప్రచారం
  • తమిళం నేర్చుకోనందుకు బాధపడుతున్నా.. మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ఆత్మనిర్భర భారత్‌ అనేది కేవలం కేంద్ర ప్రభుత్వ విధానం కాదని.. జాతీయ స్ఫూర్తి అని ప్రధాని మోదీ చెప్పారు. ‘స్వావలంబన భారత్‌’ అనే మంత్రం గ్రామాలకు కూడా చేరుకుందన్నారు. 74వ మన్‌కీ బాత్‌ రేడియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం ప్రధాని దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. దేశంలోని ప్రతి ఒక్కరూ స్వదేశీ ఉత్పత్తుల పట్ల గర్వంగా ఉండాలని, స్వావలంబన భారత్‌ నినాదానికి అనుసంధానం కావాలని కోరారు. మన దేశ ప్రఖ్యాత శాస్త్రవేత్త సీవీ రామన్‌ ‘రామన్‌ ఎఫెక్ట్‌’ను కనుగొన్న రోజు కావడంతో ఫిబ్రవరి 28ని ‘జాతీయ సైన్స్‌ డే’గా గుర్తించినట్లు తెలిపారు. సైన్స్‌ అంటే కేవలం భౌతిక, రసాయ శాస్త్రమే కాదని, సైన్స్‌ను ప్రయోగశాలలకే పరిమితం చేయకూడదని చెప్పారు. ‘ల్యాబ్‌ టు ల్యాండ్‌’ మంత్రంతో సైన్స్‌ను విస్తరించాలని మోదీ సూచించారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌కు చెందిన రైతు, పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకట్‌రెడ్డి సాధించిన విజయాలను ప్రస్తావించారు.


‘‘విటమిన్‌ డి లోపం వల్ల కలిగే నష్టాలను వెంకట్‌రెడ్డి తన స్నేహితుడైన ఓ డాక్టర్‌ చెబితే తెలుసుకున్నారు. తన పొలంలోనే పరిశోధనలు, ప్రయోగాలు చేశారు. చివరికి సహజసిద్ధంగా విటమిన్‌ డి పోషకాలు ఎక్కువగా లభించే వరి, గోధుమ విత్తనాలను ఉత్పత్తి చేశారు. వీటికి ఇటీవలే ప్రపంచ మేధో హక్కుల సంస్థ నుంచి పేటెంట్‌ కూడా పొందారు. గత ఏడాది వెంకట్‌రెడ్డిని మా ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఇది మాకెంతో గర్వకారణం’’ అని మోదీ పేర్కొన్నారు.   ఇక జలసంరక్షణ సమష్టి బాధ్యత అని మోదీ చెప్పారు. ఇందుకోసం 100 రోజుల ప్రచారం చేపట్టాలని పిలుపునిచ్చారు. వర్షం ఎక్కడ, ఎప్పుడు కురిస్తే అప్పుడు నీటిని ఒడిసి పట్టాలని.. ఇందుకోసం కేంద్ర జలశక్తి శాఖ ‘క్యాచ్‌ ది రెయిన్‌’ ప్రచారాన్ని ప్రారంభించనుందని మోదీ తెలిపారు. చెరువులు, కుంటలకు మరమ్మతులు చేయాలని.. ప్రవాహానికి అడ్డుగా ఉండే వ్యర్థాలను తొలగించాలని సూచించారు.

  1. మధ్యప్రదేశ్‌కు చెందిన బబిత రాజ్‌పుత్‌ గురించి ప్రధాని ప్రస్తావించారు. బబిత(19) తన ఊరి సమీపంలో చెరువు ఎండిపోవడంతో ఇతర మహిళలతో కలిసి ఒక కాలువ తవ్వారన్నారు. దాని ద్వారా వాన నీరు చెరువులోకి వెళ్లేట్లు చేసి, చెరువు నీటితో నింపారని చెప్పారు. 
  2. దేశీయంగా తయారు చేసిన తేజస్‌ యుద్ధవిమానాలు చేస్తున్న విన్యాసాలను, దేశీయ యుద్ధ ట్యాంకులు, క్షిపణులను చూసినప్పుడు, అభివృద్ధి చెందిన సంపన్న దేశాల్లో మేడిన్‌ ఇండియా మెట్రో రైలు కోచ్‌లను చూసినప్పుడు, పదుల కొద్దీ దేశాలకు భారత్‌లో తయారైన కరోనా వ్యాక్సిన్‌ చేరుకున్నప్పుడు, భారతీయులు గర్వంగా తలెత్తుకుంటున్నారని మోదీ పేర్కొన్నారు. ఇలా అన్ని రంగాల్లో తలెత్తుకు నిలబడాలని, అప్పుడే నిజమైన స్వావలంబన సాకారమైనట్లని అన్నారు.
  3. ప్రపంచంలోనే అతి పురాతన భాష అయిన తమిళం నేర్చుకోనందుకు బాధపడుతున్నానని ప్రధాని మోదీ అన్నారు. సీఎంగా, ప్రధానిగా ఇన్నేళ్లలో తాను బాధపడిన విషయం ఏదైనా ఉందా అని హైదరాబాద్‌కు చెందిన అపర్ణరెడ్డి ప్రశ్నించారని.. తమిళం నేర్చుకోకపోవడమేన తనకున్న వెలితి అని మోదీ చెప్పారు. 
  4. ప్రపంచంలోనే ఎత్తయిన సర్దార్‌ పటేల్‌ ఐక్యతా విగ్రహం వద్ద ఓ గైడ్‌ సంస్కృతంలో సమాచారాన్ని తెలియజేడం, క్రికెట్‌ వ్యాఖ్యానం కూడా సంస్కృతంలో చెప్పడాన్ని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. 
  5. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు. దేశాభివృద్ధి కోసం ఆయన ఎంతో కష్టపడి పనిచేశారన్నారు.




వారియర్స్‌గా ఉండండి.. వర్రీయర్స్‌ కావద్దు

వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల్లో ప్రధాని మోదీ ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు వారియర్స్‌లా ఉండాలని.. వర్రీయర్స్‌ కావద్దని సూచించారు. ‘పరీక్షల యోధులు’ పుస్తకాన్ని సరికొత్త అంశాలతో నవీకరించామన్నారు. విద్యార్థులంతా పరీక్షలు రాయడానికి సంతోషంగా వెళ్లి, చిరునవ్వుతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. కంటి నిండా నిద్ర పోవాలని, చక్కగా ఆడుకోవాలని, ప్రశాంతంగా చదువుకోవాలని చెప్పారు. ఈ సారి ఆన్‌లైన్‌లో నిర్వహించే పరీక్షా పే చర్చలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొని విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.


Updated Date - 2021-03-01T07:43:04+05:30 IST